(దండుగుల శ్రీనివాస్)
నిజం చొప్పాలంటే.. ఈ జాతిపిత వివాదం, తిట్ల పురాణం కేసీఆర్‌ను కూడా బాగా చికాకు తెప్పించి ఉంటుంది. ఆయన జాతిపిత అని తననంతా సంబోధించాలని కోరుకున్నవాడే. ఎందుకంటే కీర్తి కండూతి ఉన్నవాడు కాబట్టి. పలు అంతర్గత సమావేశాల్లో కూడా ఆయన తన దగ్గరగా ఉన్న నేతలతో ఈ మాటలు కూడా అన్నవాడే. తెలంగాణ తెచ్చినందుకు మహాత్మాగాంధీ ఫోటోలతో నా ఫోటో కూడా ఎప్పటికి ఉండిపోవాలి తెలంగాణలో అని. కానీ తను సీఎం కావడం, రాజకీయంలో ఉండటం వల్ల తిట్లు తినాల్సి వస్తుందని కూడా అప్పుడు వాపోయాడట. అప్పుడు పదేళ్లు అధికారంలో ఉన్నందున కేసీఆర్ అంతరంగం పసిగట్టిన పక్కనే ఉన్న బజనపరులు జాతిపిత.. జాతిపిత అని పిలవడం, పిలిపించడం, పలికించడం.. అంతా అనేలా చేయడం.. విస్తృతంగా దీన్ని జనబాహూళ్యంలోకి తీసుకెళ్లడం చేసేశారు.
అప్పుడలా నడిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అధికారం పోయింది. అయినా అప్పటి రోజుల్లెక్కనే కీర్తిస్తాం.. శ్లాఘిస్తాం..అంటే ఇప్పుడున్నోళ్లు ఊకోవాలె కదా. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఎడాపెడా అర్సుకుండు. కేసీఆర్‌ను. నువ్వు జాతిపితేందిరా బై. జయశంకర్ సార్ జాతిపితంటే.. కోట్లు గడిచించినోడు, పదవులకు ఆశపడ్డోడు.. అనినీతి పరుడు జాతిపితెట్లైతడు అని ఎడపడితే ఆడ.. వేదికలనెక్కినకాడల్లా.. తిట్ల పురాణం అందుకుండు. బహుశా ఈ తిట్లకేనేమో.. దడుచుకున్నట్టుంది గులాబీ దండు. నిన్న ఆయన బర్త్‌డే సందర్భంగా అంతా బాపు కేసీఆర్.. బాపు కేసీఆర్.. అనే పిలుచుకున్నారు. ఎవరూ ఎక్కడా మా జాతిపిత.. మన జాతిపిత.. తెలంగాణ జాతిపిత.. అనడానికి సాహించలేదు. అనుడెందుకు? తిట్లు పడుడెందుకు?? అనుకున్నారా లేకపోతే.. పెద్దసారే వద్దు అట్లనకుర్రి ఇప్పుడు.. పరిస్థితులు మంచిగా లేవు ప్రశాంతంగా ఉండనియ్యుర్రి.. ఎందుకు మధ్యల నన్ను గుంజి గుంజి…. చంపుతరు.. అన్నడేమో. మొత్తానికి ఈ జాతిపిత మాట ఇగ ఇనవడేటట్టు లేదు. ఇప్పట్ల.

Srinivas Dandugula
Senior Journalist
7661066999
