ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు వయసును కుదించి వృద్దాప్య పింఛన్ ఇచ్చేందుకు దరఖాస్తులను స్వీకరించింది. దీనికి ఈ రోజు చివరి తేదీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 6,26,333 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 46,187 దరఖాస్తులు రాగా నిజామాబాద్‌లో 41,611 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్ తరువాత ఎక్కువ దరఖాస్తులు వచ్చిన జిల్లాల్లో నిజామాబాద్ టాప్‌లో ఉంది. ఈ రోజు చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ తేదీని పెంచాలనే ఆలోచన చేస్తున్నది. ఓటరు కార్డు ఐడీ ఆధారంగా గతంలో కూడా దరఖాస్తులు స్వీకరించారు. దానికి రెండేండ్లు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈ హామీ అమలుకు సిద్ధపడింది. 57 ఏళ్లు నిండిన చాలా మంది ఈ వృద్దాప్య పింఛన్‌కు అర్హులుగా తేలారు. దీంతో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి.
ప్రభుత్వం 6.50 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. దాదాపుగా అంచనాకు దరఖాస్తులు రీచ్ అయ్యాయి. మళ్లీ డోర్ టు డోర్ సర్వే చేసి అర్హత లిస్టును తయారు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32లక్షల ఆసరా పింఛన్లు ఇస్తున్నారు. తాజా మరో ఆరున్నర లక్షల వరకు చేరుతున్నాయి.