(దండుగుల శ్రీ‌నివాస్‌)

తెలంగాణ తెచ్చిన జాతిపిత మీద గింత‌క‌సేందివ్యా మీ అంద‌రికి. కాన‌ర్థం కాదు. అసెంబ్లీకి రాక‌పోతే రాలే రాలె అంటది మీరే. ఫామ్‌హౌజ్‌ల‌నే పంట‌డు పంట‌డు అంట‌రు మీరే. ఇగో గిట్ల అసెంబ్లీకి వ‌స్తే గూడ పొట్టు పొట్టు తిట్టాల్నావ్యా? అస‌లు మీకేంగావాల్నో స‌మ‌జైత లేదు బై. వ‌చ్చిండు. సంత‌కం చేసిండు. కూసున్న‌డు. పోయిండు. అవ్ మ‌ల్లా. ఇంకేం జేయ‌మంట‌ర్రు. స‌భ‌లు మొత్తం అయిపోయేదాకా ..అదే క‌డ‌దాకా కూసోవాల్నా..? ఛ‌ల్‌. గ‌ప్పుడు తెలంగాణ తెచ్చెదాక క‌డ‌దాక కొట్లాడిండు పెద్ద‌సారు. పాణాల‌కు కూడా తెగిడ్సిండు. కాబ‌ట్క‌నే గీ తెలంగాణ వొచ్చింది. మీరంతా గా బంగారు తెలంగాణ‌లోనే బతుకుతుర్రు. మీ బ‌త్కులంద‌ర్యీ క‌ళ‌క‌ళ లాడుతున్నాయి. గ‌ది మ‌రువ‌కుండ్రి. అరె. గాయ‌న ప‌దేండ్లు తెలంగాణ పాలించిన సీఎంరా బై. గది కూడా మ‌రిచిర్రా. గాదాన్కైనా ఇసుమంత సుక ఇజ్జ‌త్ ఇయ్య‌రా?

జీతం కోసం ఒచ్చిండు. పోయిండు. మ‌ళ్లా ఫామ్‌హౌజ్‌ల పంట‌డు.. అని ఒక‌డు. ఏహె సారు తోలు తీయ‌నీకి వ‌చ్చిండు కానీ.. క‌త్తులు ఫామౌజ్ల‌నే మ‌రిచిండంట‌..అందుకే జ‌ప్పున పోయిండ‌ని ఇంకొక‌డు. అబ్బ ఏమ‌న్నా తోలు తీసిండా అసెంబ్లీల‌. ఇగ బ‌య‌ట తీగ‌లు గుంజి ఎక్క‌డిక‌క్క‌డ గ‌ట్టుర్రి.. సారు ఆ తోళ్ల‌న్నీ ఎండేసిపోత‌డు.. మ‌రొక‌డు… అరె నీ య‌వ్వా… తిట్టినోడే గానీ తిట్ట‌నోడు పాపాత్ముడ‌నుకో. అగో సారు ఫామ్‌హౌజ్ల కెళ్లి క‌దిలిండు.. వ‌చ్చిండు సూడ‌రా ఎదురు లేని ఈరుడు… ఇగో నందిన‌గ‌ర్ల కెళ్లి బ‌య‌టకెళ్లిండు. కార్ల కూసుండు. గుమ్మ‌డికాయ‌తోని దిష్టిసుక తీస్తుండ్రు.. సూడుర్రి సూడుర్రి.. ఒత్తుండు ఒత్తుండు అసెంబ్లీకి… అబ్బ‌బ్బ ఎంతగ‌నం పుంగి బ‌జాయించి ఇడ్స‌వెట్టిండ్ర‌నుకున్న‌వ్‌.. మ‌న రామ‌న్న యూట్యూబ్ గొట్టం బ్యాచిగాళ్లు.. సోష‌ల్ మీడియా ప‌నికి ఆహారం ప‌థ‌కం కూలీ వెధ‌వలు.. ఇగ గిట్ల సుక అర్సుకున్న‌రు. ఏందిరా.. మీ పెద్ద‌సారు మూడు నిమిషాలు సుక కూసోలే.. సాలె.. !అని ఈళ్ల‌ను కూడా అర్సుకుని క‌ర్సుకున్న‌ర‌నుకో.

అవ్‌.. నాకు స‌మ‌జ్‌గాక అడుగుతున్నా బై! మా పెద్ద‌సారేం పాపం చేసిండ‌ని గిట్ల ఎగ‌వ‌డ్డ‌రు. గీ తీర్న ఎంబ‌డ‌వ‌డ్డ‌రు. గీ లెక్క‌న వెంటాడి వేటాడుతున్న‌రు. ఆయ‌న సారు.. సారంతే. మా సారంతే. ఆయ‌నేం చెబితే అదే లెక్క‌. ఎట్ల చేస్తే అదే మా రూలు. అంతేమ‌రి. తెలంగాణ తేలే. మ‌రి ఆయ‌న తెచ్చిన తెలంగాణ‌ల ఎట్లుండాల్నో ఆయ‌న‌కు తెల్వ‌దా? గ‌ది సుక మీరు జెప్పాల్నావయా! కుక్క‌ను నిల‌బెట్టినా ఆడ గెలిచి వ‌స్తుంది. అదీ కేసీఆర్ లెక్కంటే. కాక‌పోతే మొన్న గ‌జ్జి కుక్క‌లెక్కువై గ‌బ్బుగ‌బ్బైంది గానీ, ఇప్పుడు మాసారే రావాలంటున్న‌రు. ఆయ‌న స‌ల్లంగుండాలె.. ఫామ్‌హౌజ్‌ల‌నే పండాల‌ని సుక అంటుర్రు ప్ర‌జ‌లు. జనాలేమ‌నుకుంటుర్రో కూడా సారుకు ఎంబ‌టే ఎర్కైత‌ది. అందుకే ఆయ‌న జ‌నం ఏమ‌నుకుంటుర్రో… గ‌ట్ల‌నే న‌డుచుకుంటుండు. మ‌రి గీయంత దానికి వ‌చ్చిపోమ్మా.. మెర‌పు తీగ అన్న‌ట్టు అయింత‌మ‌టుకు వ‌చ్చుడెందుకు? పోవుడెందుకు? ఏ మీరే గ‌దా వ‌యా చెవి కోసిన మేక లెక్క ఒక్క‌టే ఒర్ల వ‌డ్తిరి అసెంబ్లీకి రాక‌పాయె. రాక‌చ్చిండు. ఒస్త‌లేడు.. అని.అందుకే ఒచ్చిండు. పోయిండు. సంత‌కం పెట్టిండు. కూసుండు. ముఖం చూపిచ్చిండు… గిది సాలు మీకు. మీ అసెంబ్లీ జాన్తా నై. మీ డిస్క‌ష‌న్లు మాన్తా నై. మా రూల్ మాకే. మాకు అధికారం వ‌చ్చేదాన్కా.. మ‌ళ్లా రామంటే రాము. రామే రాము.. రాం రాం!

 

Dandugula Srinivas

Senior Journalist

7661066999