(మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు)

మాజీ ముఖ్య‌మంత్రి, బీఆరెస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు ఫామ్‌హౌజ్ నుంచి క‌దిలారు. నందిన‌గ‌ర్‌కు చేరుకున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వంపై యుద్దం కోసం క‌త్తులు నూరుతున్నారు. నీళ్లు, నిధులు , నియామ‌కాలు ప్ర‌ధాన నినాదంగా చేసుకున్న తెలంగాణ‌లో.. నీటిపై జ‌రుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ప్ర‌ధానంగా కృష్ణాన‌ది నిక‌ర జ‌లాల‌ను ఆంధ్ర‌కు త‌ర‌లించుకు పోవ‌డంపై జ‌ల‌ఖ‌డ్గం ఝుళిపించ‌నున్నారు. పాల‌మూరు- రంగారెడ్డి ఎత్తిపోత‌ల నిక‌ర జ‌లాల పంపిణీలో జ‌రుగుతున్న అన్యాయాల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని నిర్ణ‌యించారు. ఈ ప్రాజెక్టు విష‌యంలో రేవంత్ స‌ర్కార్‌.. చంద్ర‌బాబు స‌ర్కార్‌తో రాజీ ప‌డుతుంద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది.

మొద‌టి నుంచి కేసీఆర్ నీటి ప్రాజెక్టుల‌పై ఎక్కువ దృష్టి కేంద్రీక‌రించిన విష‌యం తెలిసిందే. కానీ, రేవంత్ స‌ర్కార్ వ‌చ్చిన త‌రువాత సాగునీటి ప్రాజెక్టుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్న‌ది. ఇదే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకుపోవాల‌ని భావిస్తున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీల‌తో పాటు 40 శాతం గెలిచామ‌నే ధీమా ఆ పార్టీలో క‌న‌బ‌డుతున్న‌ది. ఇంచార్జి వ్య‌వ‌స్థ‌ల‌ను ర‌ద్దు చేయాల‌ని యోచిస్తున్నారు. కొత్త నాయ‌క‌త్వాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీ క్యాడ‌ర్ నిర్మాణం లేదు. ఇక‌పై బూతు స్థాయి నుంచి క్యాడ‌ర్ నిర్మాణం చేయాల‌ని అనుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం పాపులారిటీ మీదే దృష్టి పెట్టింది.

నేడు తెలంగాణ భ‌వ‌న్‌కు కేసీఆర్ వ‌చ్చి.. స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ప్రెస్ మీట్‌పెట్టి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌నున్నారు.