(దండుగుల శ్రీ‌నివాస్‌)

నోరు విప్పితే గానీ తెల్వ‌దంట అస‌లు మేథావిత‌నం. అందుకే ఎంత మౌనంగా ఉంటే… ఎన్ని రోజులు నోరు తెర‌వ‌కుండా సైలెంట్‌గా ఉంటే అంత హుందాత‌నం. లోప‌లున్న స‌ర‌కు బ‌య‌ట‌ప‌డొద్దంటే నిశ్శ‌బ్ద‌మే స‌రైన మార్గం. సరిగ్గా ఇదిప్పుడు కేసీఆర్‌కు న‌ప్పుతుంది. రెండేండ్లు ఫామ్‌హౌజ్‌లో ఉన్నాడు. కొడుకు కేటీఆర్ ఇష్ట‌మొచ్చిన‌ట్టు ఒర్రుడు నేర్చుకుని మ‌రింత ప‌లుచ‌న‌య్యాడు. ఏహే.. కొడుకు ఎవ‌డు ప‌ట్టించుకుంట‌డు.. కేసీఆర్ మాట్లాడితే ఓ లెక్క‌గానీ.. అనుకున్నారంతా. అధికార పార్టీతో స‌హ‌. మాజీ సీఎం.. సీనియ‌ర్ లీడ‌ర్‌.. పెద్ద‌మ‌నిషి.. ఆయ‌న మాట్లాడితే ఓ హుందాత‌నం ఉండాల‌ని.. స‌బ్జెక్టుతో మాట్లాడితే ఇంకా మంచిద‌ని భావించారు ఇంటా బ‌య‌ట‌. కానీ ఆ హుందాత‌నం కాస్త ఉష్ మ‌నిపించుకున్నాడు కేసీఆర్‌. రెండేండ్ల త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చి… కొండంత రాగం తీసి ఏదో ప‌నికిరాని ప‌స‌లేని గానం అందుకుని అయింద‌నిపించుకున్నాడు.

అంతా కేసీఆర్ రాకను కీర్తించారు. వ‌చ్చాడు.. వ‌చ్చాడు.. వ‌చ్చాడ‌ని పెద్ద హైప్‌నే క్రియేట్ చేశారు. తీరా ఆయ‌న మాట్లాడింది కృష్ణా జ‌లాల‌పై. అదంతా ఆయ‌న కాలం నాటి ముచ్చ‌టే. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి రెండేండ్ల‌య్యింది. ఇల్లు, వాకిలి చ‌క్క‌బెట్టుకునేందుకే ఈ స‌మ‌యం స‌రిపోలేదు. ఇక వాటాల విష‌యంలో కేసీఆర్ చేసిన ఆరోప‌ణ‌లు ఉట్టి గాలి మాట‌లేని తేలిపోయాయి. ఏదో బ‌ట్ట‌కాల్చి మీదేసేలాగా ఉన్నాయి .. అంతే కాదు.. డీపీఆర్ రూపొందించి.. సంత‌కాలు చేసింది .. ఒప్పందాలు కుదుర్చుకున్న‌ది కేసీఆర్ అండ్ మోడీ టీమే. మ‌ధ్య‌లో ఈ రేవంత్ స‌ర్కార్ వంతు, పాత్ర ఏం ఉందో ఆయ‌న‌కే తెలియాలి. చంద్ర‌బాబుతో లింకు పెట్ట‌డం మూలంగా.. తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేయాల‌నే భావ‌న కూడా కావొచ్చు. అందుకే బీఆరెస్ బ‌దులు.. ఆయ‌న టీఆరెస్ అనే ప‌లుకుతున్నాడు. చేసిన త‌ప్పులకు ఇలా ఎవ‌రికీ తెల‌య‌కుండా చెంప‌లేసుకుంటున్నాడ‌న్న‌మాట‌. మ‌రి ప్ర‌జ‌ల కాల్చి వాత‌ల‌కు బాగానే కందిన‌ట్టుంది పాపం. తేరుకోక‌పోతే .. మ‌రింత ఆరిపోతాడు. అది తెలుసు.

స‌రే, అసలు ముచ్చ‌ట‌కొద్దాం. నీటి వాటా విష‌యంలో రేవంత్ కూడా ఏం త‌గ్గ‌లేదు. రా.. అసెంబ్లీకి చ‌ర్చ పెడ‌దాం. చూసుకుందాం. చ‌ర్చిద్దాం.. అన్నాడు. కేసీఆర్ రాడు. అది అంద‌రికీ తెలుసు. కేసీఆర్ లో ఎవ‌రికీ క‌నిపించ‌ని ఓ పిరికితన ఉంటుంది. అంత‌కు మించి త‌న‌ను ఎవ‌రూ నిందించొద్దు.. ప్ర‌శ్నించొద్దు అనే నియంత పోక‌డ‌లుంటాయి. అందుకే ప్ర‌తిప‌క్షమే లేకుండా చేయ‌డం ద్వారా.. త‌ను చెప్పిందే అంతా వినాలి. జ‌నం అది విని త‌రించాలి. ఈ నీతి ముక్తావ‌ళిని అంతా ఆల‌కించాలి. అంతే గానీ .. ఇది త‌ప్పు.. నువ్విలా ఎందుకు చేశావు..? లాంటి పిచ్చి పిచ్చి ప్ర‌శ్న‌లు వేయొద్దు.. అందుకే రేవంత్ విసిరిన స‌వాలును స్వీక‌రించ‌డం కాదు క‌దా.. అస‌లు త‌న‌కు సంబంధ‌మే లేద‌న్న‌ట్టుగా ఉండిపోతాడు. ష‌రా మామూలుగా హరీషు అరుస్తాడు. క‌వ‌రింగ్ చేసుకుంటాడు. క‌ల‌రింగు ఇస్తాడు.

ఇక 420 హామీల‌న్నాడు. సేమ్ కేటీఆర్ లెక్క‌నే. ఇందులో వైరాగ్యం, వెట‌కారం త‌ప్పితే.. వాస్త‌వం ఉందా? నిజంగా రేవంత్ ప్ర‌జ‌ల‌కు 420 హామీలిచ్చాడా? ఆ ఫిగ‌ర్‌ను చెప్ప‌డం ద్వారా రేవంత్ స‌ర్కార్ మోసం చేసింద‌ని, సీఎం ఓ దొంగ అని చెప్పే బ‌రితెగింపు త‌ప్ప‌.. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఆరు గ్యారెంటీపై మాట్లాడండి… పింఛ‌న్ ఎందుకు పెంచడం లేద‌ని ప్ర‌శ్నించండి.. ఇంకా అమ‌లు కానీ హామీల‌ను బ‌య‌టకు తీసి తూర్పార‌బ‌ట్టండి. అమ‌లు చేస్తావా..? అడ‌గ‌డుగునా నిల‌దీసి అడ్డుకుని ఉతికి ఆరేస్తామ‌ని వార్నింగ్ ఇవ్వండి.. జ‌నాలు ఇవే కోరుకుంటారు. అంతేగానీ.. జ‌నం పిచ్చోళ్ల‌న్న‌ట్టుగా.. ఉచిత ప‌థ‌కాల హామీల మాయ‌లో ప‌డి మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశార‌న్న‌ట్టుగా..అస‌లు ప‌దేండ్ల పాల‌న‌లో ఏమీ త‌ప్పిదాలే జ‌ర‌గ‌లేద‌న్న‌ట్టుగా.. అవినీతి, అక్ర‌మాల‌కు తావే లేద‌న్న‌ట్టుగా.. మేమంతా ప‌తివ్ర‌త‌ల‌మే అని స‌ర్టిఫికెట్ ఇచ్చుకునేలా ఎందుకు మాట్లాడ‌టం… ప్ర‌తిప‌క్షంలో ఎలా ఉండాలో అలా ఉండండి.. జ‌నం జోలికొస్తే .. మ‌రింత క‌రుసైపోత‌రు. జ‌ర జాగ్ర‌త్త కేసీఆర్‌!

Dandugula Srinivas

Senior Journalist

7661066999