(దండుగుల శ్రీ‌నివాస్‌)

కాళేశ్వ‌రం ప్రాజెక్టు పెద్ద అవినీతి అని స‌ర్కార్ తేల్చిపారేసిన సంద‌ర్భంలో క‌విత కూడా దీనికి మ‌ద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఇంత అవినీతి జ‌ర‌గ‌డానికి కార‌ణం హ‌రీశ్‌రావేన‌ని ఆమె తేల్చిపారేసింది. తాజాగా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో జ‌రిగిన కాళేశ్వ‌రం ప‌నుల‌తో పాటు, ఎస్సారెస్పీ పున‌రుజ్జీవ ప‌థ‌కం పెద్ద అవినీతి మ‌య‌మ‌ని, దీనికి కేటాయించిన నిధుల‌న్నీ కాంట్రాక్ట‌ర్ల జేబుల్లోకి వెళ్లాయ‌న్న క‌విత‌.. దీని వ‌ల్ల న‌యాపైస ఉప‌యోగం కూడా ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాకు జ‌ర‌గ‌లేద‌న్నారు. ఆమె చేసిన తాజా ఆరోప‌ణ‌లు వైర‌ల్ కాగా.. మ‌ళ్లీ ఆమె నిజామాబాద్ జాగృతి నేత‌ల‌తో ఓ ప్రెస్ మీట్ పెట్టించి.. ప్రశాంత్‌రెడ్డే దీనికి ఆద్యుడు, బాధ్యుడు అని కూడా చెప్పించేసింది.

ఎన్ని వేల కోట్ల నిధుల దుర్వినియోగం.. అవినీతికి మూలం ప్ర‌శాంత్‌రెడ్డేన‌ని, ఆయన కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలేన‌ని చెప్పించింది క‌విత‌. ఎస్సారెస్పీ పున‌రుజ్జీవ ప‌థ‌కం ప్ర‌శాంత్‌రెడ్డి మ‌దిలోంచి వ‌చ్చిన ప్లానే. పోచంపాడ్ ఎండిపోతే.. దాన్ని నింపేందుకు రివ‌ర్స్ పంపింగ్ ద్వారా నీళ్ల‌ను కాళేశ్వ‌రం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోసి ఎస్సారెస్పీ నింపాల‌నేది ఈ ప్రాజెక్టు ప్లాన్‌. కానీ ఇది ఇంత వ‌ర‌కు స‌క్సెస‌య్యింది లేదు.. నిధుల‌న్నీ వృథా అయ్యాయ‌ని క‌విత ఆరోపిస్తున్న‌ది. అంచ‌నా వ్య‌యం కూడా భారీగా పెంచి ఎవ‌రి జేబులు నింపార‌ని మాజీ మంత్రి క‌విత ప్ర‌శ్నించింది. ఇరిగేష‌న్ చ‌రిత్ర‌లోనే ఇదో పెద్ద స్కాం అని కూడా తేల్చిపారేసింది క‌విత‌. ఆమె మాట‌ల ప్ర‌కారం కాళేశ్వ‌రం అవినీతిలో హ‌రీశ్‌రావు త‌రువాత ప్ర‌శాంత్‌రెడ్డే అన్న‌మాట‌.

జాగృతి నేత‌లు ఇంకేమ‌న్నారంటే..!

– కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం ద్వారా కాళేశ్వరం నీళ్లతో శ్రీరాంసాగర్ నింపామన్నారు మాజీ మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి. ఇది ప‌చ్చి అబ‌ద్దం.

– 2021 ఏప్రిల్ 22న కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు గోదావరి నీళ్లు చేరాయి.. కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలను కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారు. ఆ తర్వాత వరుసగా భారీ వర్షాలు కురవడంతో ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదు.

– 2023 జూలైలో ఎస్ఆర్ఎస్ పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా 2.50 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి ఎత్తిపోశారు.. ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీళ్లతో పాటు వరద నీళ్లు స్పెల్ వే గేట్ల ద్వారా గోదావరిలోకి .. ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను దాటుకొని బంగాళాఖాతంలోకి చేరింది వాస్తవం కాదా.. మరి శ్రీరాంసాగర్ ను కాళేశ్వరం నీళ్లతో నింపామన్న ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నిజమవుతాయి?

– కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో 1,81,349 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1,86,262 ఎకరాలు ప్రతిపాదించారు.. ప్యాకేజీ 20, 21, 21ఏ, ప్యాకేజీ 22 కింద వీటిలో ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు.

– ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రాజెక్టు. రూ.1,067 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు .. నాలుగేళ్లలోనే రూ.2 వేల కోట్లకు చేరింది.

– ఈ ప్రాజెక్టు ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులను మొదట రూ.600 కోట్లతో ప్రతిపాదిస్తే అవి ఏకంగా రూ.1,400 కోట్లకు చేరాయి.. కాంట్రాక్టర్లకు లాభం చేయడం తప్ప అంచనాల పెంపుతో ఎవరికి లాభం జరిగింది?

– ఈ అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టుగా అప్పట్లో లీకులు ఇచ్చారు.. ఆ విచారణ నివేదిక ఏమైంది?

– కాళేశ్వరం ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు నీళ్లు రాలేదు.