(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఇప్పుడో చ‌ర్చ జ‌రుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్క కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌తో తెలంగాణ రాలేద‌ని. కేసీఆర్ తీసుకున్న యూట‌ర్న్ ముచ్చ‌ట‌.. ఓయూ విద్యార్థులు చేప‌ట్టిన కేసీఆర్ దిష్టిబొమ్మ శ‌వ‌యాత్ర‌.. ఇవ‌న్నీ ముచ్చ‌ట్లు ఇవాళ ఒక్క‌రోజు రాజ్య‌మేలుతున్నాయి. కార‌ణం… బీఆరెస్ నేత‌లు చాలా కాలం త‌రువాత యాది చేసుకుని మ‌రీ ఆర్బాటంగా, హ‌డావుడిగా, అనివార్యంగా చేప‌ట్టిన దీక్షా దివస్‌. మాది ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ. ఉద్య‌మ‌పార్టీ కాదు.. అని పెద్ద సారు ప్ర‌క‌టించిన రోజే ఉద్య‌మ‌కారులకు ఈ పార్టీలో అతీగ‌తి ఉండ‌ద‌ని అర్థ‌మైపోయింది. అదే జ‌రిగింది. ఘోర అవ‌మానం. ప‌ద‌వులు లేవు. ప‌ట్టింపు లేదు. చీత్కారాలు లేవు. కొత్త ముఖాల‌కు ప‌ద‌వులు. ఎమ్మెల్యే టికెట్లు.. మ‌ళ్లీ.. మ‌ళ్లీ. మంత్రి ప‌ద‌వులు.. ఇవ‌న్నీ చూసీ చూసీ విసుగొచ్చి ఓడ‌గొట్టు పాతాళానికి పాత‌రేశారు.

ఇప్పుడ మ‌ళ్లీ న‌వంబ‌ర్ 29 అని.. దీక్షా దివ‌స్ అని పాత పాటను కొత్త రాగం క‌లిపి సెంటిమెంటు క‌ల‌గ‌లిపి వచ్చింది జ‌నం ముందుకు గులాబీ దండు. నిజామాబాద్ జిల్లా గురించి ఇక్క‌డ చెప్పుకోవాలె. క‌విత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి చెడామ‌డా ఇక్క‌డి అక్క‌డి బీఆరెస్ నేత‌ల బాగోత‌లను, పార్టీ లోపాల‌ను అన్నీ ఎండ‌గ‌డుతూ ఉన్న త‌రుణంలో .. ఇక్క‌డి ఇందూరు నేత‌లు క‌నీసం అమ‌ర వీరుల స్థూపానికి ఓ దండ వేద్దామ‌న్న సోయి కూడా లేకుండ పోయింది. అక్క‌డికి పోయి ఫోటోల‌కు ఫోజులిచ్చి మ‌రీ వ‌చ్చారు.

ఇందులో మాజీ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి కూడా ఉన్నాడు. ప్రేక్ష‌క పాత్ర వ‌హించి చేతులు క‌ట్టుకుని ఫోటోల‌కు ఫోజులిచ్చారే త‌ప్ప‌.. ఆ స్థూపాన్ని శుభ్ర‌ప‌రుద్దాం.. పూల‌తో అలంక‌రిద్దాం.. ఓ దండ వేసి అమ‌ర వీరుల‌కు నివాళుల‌ర్పిద్దామ‌ని సోయి ఎవ‌రీ లేదు. ఆ దుమ్ములోనే నాలుగు పూల రేకులు అక్క‌డ జ‌ల్లి ఫోటోలు దిగి వ‌చ్చారు. ఇదీ మ‌న‌వాళ్ల నిబ‌ద్ద‌త‌.. దీక్షా దివ‌స్ దీక్షాప‌రుల నిర్ల‌క్ష్యం.

Dandugula Srinivas

Senior Journalist

7661066999