(దండుగుల శ్రీనివాస్)
ఇంకా అవే మాటలు. కర్రు కాల్చి వాత పెట్టినా.. ఫామ్‌హౌజ్‌కే పరిమితం చేసినా.. జనాలు ఛీత్కరించుకున్నా.. అవే బలుపు మాటలు. అహంకారం వీడని వ్యాఖ్యలు. తాజాగా మరోసారి కేటీఆర్ తను , తన తండ్రి మారని మనుషులమని నిరూపించుకున్నాడు తన మాటల ద్వారా. మేమింతే.. అని మొండిగా వాదిస్తున్నారు. ఇప్పుడు నేనే చెప్పేది మారని తండ్రీకొడుకుల కథ. అదే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఓ తండ్రి కేసీఆర్.. ఓ కొడుకు కేటీఆర్ గురించి.
దీక్షాదివస్ సందర్భంగా కేటీఆర్ మళ్లీ అవే బలుపు, అహంకారం మాటలే మాట్లాడిండు. పాపం తండ్రి.. మొఖం చెల్లక, జన మీద అలిగి ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. చెరువు మీద అలిగితే ఎవరిది ఎండుతుందో తెలుసు కదా. కానీ జనమే తమ తప్పు తెలుసుకుని చెంపలేసుకుని .. కేసీఆర్ నువ్వే కావాలని జనం గట్టిగా కోరుకుంటారని ఆయన భ్రమ. అవే మాటలు తరుచు అంటున్నారు కూడా ఈ ఇద్దరు. తండ్రి బటయకు రాని దుస్థితికి కొడుకు కలరింగ్ మాటలేమింటంటే.. కేసీఆర్ గోడకు వేలాడుతున్న తుపాకీ అంట. అది ఎప్పుడు బయటకు రావాలో.. ఎప్పుడు పేలాలో ఆ తుపాకీకే తెలుసట. అప్పటిదాకా వెయింటింగ్ చేయమంటున్నాడు. గోడకు వేలాడే తుపాకీ అయితే మాత్రం దాన్ని అంత తక్కువగా చూస్తారు.. ఆయ్..! అని జనాన్ని, లీడర్లను కూడా కసురుకుంటున్నాడు. బాబ్బాబ్బాబు.. అది తుపాకీరా.. జర దానికి వాల్యూ ఈయండిరా నాయనా..! అని కేసీఆర్‌ను అంత అల్కగా తీసేయకండని బతిమాలుకుంటున్నాడు కూడా ఇలా.
ఇక మరో బలుపు మాట, అహంకారపు చేష్ట ఏదంటే… సీఎంను అర్బకుడు అని సంబోధించడం. నాయకుడు కేసీఆర్ అంట.. అర్బకుడు సీఎం రేవంత్‌రెడ్డి అట. అంతే కాదు.. తీన్ ఫూట్ అని కూడా అన్నాడు సీఎంను ఉద్దేశించి. ఇంతకన్నా బలుపు ఎవరికుంటుంది. ఇంత జరిగినా ఇసుమంతైనా మార్పు కనిపిస్తుందా? పాపం.. ఇంకా పార్టీని భ్రష్టు పట్టించే పనిలో..జనం చేత మరీ చీధరించుకుని పాతాళానికి పాతరేయించుకునే పనిలో చాలా బిజీగా కంకణ బద్దుడై ఉన్నాడీ వారసుడు. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడటం చూసి ఫామ్‌హౌజ్‌లో కూసుని వింటున్న కేసీఆర్‌కు వీనుల విందుగా ఉంది కాబోలు. అబ్బ నా అసోంటి కొడుకే. నా తరువాత ఫామ్‌హౌజ్‌లో సేదతీరేటోడే అని సంబురపడ్డడు కావొచ్చు.
అవునూ…. కేటీఆర్! అతడు సినిమాలో సీన్‌లాగా.. గోడకు వేలాడుతన్న తుపాకీ లో గుండు రివర్స్‌లో పేలి మరి మీ పుచ్చే లేచిపోదు కదా.. జర అప్పుడప్పుడు దాన్ని బయటకు తీసి ఓరాయిలింగ్ చేయించండి. ఎందుకైనా మంచిది. కదా!

Dandugula SRINIVAS
Senior Journalist
7661066999
