(దండుగుల శ్రీనివాస్)
చేసిందంతా చేసి బీసీ కార్డు ప్రయోగించారు. తిట్టిందంతా తిట్టి కాళ్ల బేరానికొచ్చారు. ఉన్న పదవి ఊడుతుందని భయపడ్డారు. సీఎం అని చూడకుండా నోటికొచ్చింది మాట్లాడేశారు. ఏమన్నా అంటే.. మా కాంగ్రెస్‌లో అంతే మా కాంగ్రెస్‌లో అంతే.. అని సర్దిచెప్పుకున్నారు. చివరకు సీఎం రేవంత్ క్షమించి వదిలేయడంతో సురేఖ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నది. కానీ అంతకు ముందు ఆమెకు మీనాక్షి ఓవైపు.. మహేశ్ మరోవైపు మంచిగా అక్షింతలు వేసి వదిలేశారు. ఇలా ఆమెను క్షమించి, వారించి వదిలేయడం రెండోసారి. ఇక క్షమించడాలు లేవు. అంతే. ఈ విషయాన్నీ ఖరాకండిగా చెప్పేశారు.
మురళి మధ్యవర్తిత్వం.. బతిమాలడం కూడా కలిసి వచ్చింది. మొత్తానికి సురేఖ పదవి సేఫ్ అయ్యింది. బీసీ మహిళ కావడమూ ఆమెకు కలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే మాత్రం సహించేది లేదని అధిష్టానం గట్టిగానే అర్సుకుని వదిలేసింది. పాపం.. సురేఖ ముఖం.. కత్తిగాటుకు నెత్తుటి చుక్కలేదు అన్నట్టుగా మాడిపోయి కనిపించింది. నీళ్లు నములుతూ.. బిత్తిరచూపులు చూస్తూ ప్రెస్‌తో పొడిపొడిగా మాట్లాడి బ్రతుకు జీవుడా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో అందరికీ ఓ వార్నింగ్ వెళ్లినట్టయ్యింది. స్వేచ్ఛా పరిధి ఉంది కదా అని.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడినా.. ప్రవర్తించినా.. ఇక ఊరుకునేదే లేదనే విధంగా అధిష్టానం సురేఖ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక సంకేతమైతే పంపింది.
Dandugula Srinivas
Senior journalist
7661066999
