నిజామాబాద్ ప్రతినిధి – వాస్తవం:
బీఆరెస్ పార్టీ తనను ఆగం చేసిందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె జనంబాట కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమానికి హాజరైన జాగృతి కార్యకర్తలు, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినందుకు, పార్టీలో పరిపాలన పరమైన లోపాలు, తీసుకున్న నిర్ణయాలపై గొంతెత్తినందుకు తనను ఒంటరిని చేసి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జనం మీద తనకు నమ్మకం ఉందని, తనతో కలిసి నడుస్తారని, అండగా ఉంటానని నమ్ముతున్నానన్నారు. తనను సొంత పార్టీలోనే కుట్ర చేసి ఓడించారని, నిజమైన బీఆరెస్ కార్యకర్తలకు ఇది తెలుసునని, వారే ఆలోచించుకోవాలని అన్నారు.
5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానన్నారు. నేను నిజామాబాద్ కోడలిని. ఇది నా గడ్డ. ఎప్పటికైనా ఈ గడ్డలోనే కలిసిపోతానన్నారామె. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సరే నా మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందన్నారు. మీ బిడ్డను కాబట్టి నన్ను ఇక్కడి నుంచి పార్లమెంట్ కు పంపించారని, మీ మర్యాద, గౌరవం కాపాడే విధంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నానన్నారు. నేను 27 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఉద్యమంలోకి వచ్చానని గుర్తు చేశారు. నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ చేయలే.. కానీ నన్ను కుట్ర చేసిన పంపించారు..నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరుతున్నా.. నిజామాబాద్ లో నా ఓటమి కుట్రనా కాదా ఆలోచించాలని కోరారు. ఎన్ని అవమానాలు జరిగినా సరే కేసీఆర్, పార్టీ మీద ప్రేమతో భరించానన్నారు.
కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా. తొలి అడుగు మన గడ్డ మీది నుంచే అని వచ్చానని ఆమె తన మనసులో అంతరంగాన్ని ఇందూరు జనం ముందుంచారు.
