(దండుగుల శ్రీనివాస్)
సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై డైలమాలో పడింది. ఒకడుగు ముందుకు రెండడుగులు మందుకా అన్నట్టు తర్జన భర్జన పడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల జోలికి పోకుండా జాగ్రత్త పడుతున్నది. వాస్తవానికి, ఎన్నికల నిర్వహణకు తమకు అభ్యంతరం లేదని, బీసీ రిజర్వేషన్ జీవో పై మాత్రమే స్టే విధించామని హైకోర్టు స్పష్టం చేసింది. స్టేను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే సుప్రీం హైకోర్టులో తేల్చుకోవాలని పిటిషన్ డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు డిస్మిస్ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
కానీ, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటామని మళ్లీ పెండింగ్‌లో పెట్టింది. హైకోర్టులో రిజర్వేషన్ జీవోపై ఉన్న స్టేను తొలగించాలని చివరి వరకు పోరాడుతామని నాయకులు మళ్లీ కొత్త రాగం అందుకున్నారు. కేబినెట్ మీటింగులో కూడా ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. వాస్తవానికి, హైకోర్టు ఈ రిజర్వేషన్లపై స్టే ఇచ్చి, పాత రిజర్వేషన్ల ప్రకారమే షెడ్యూల్ననుసరించి ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు మళ్లీ బాల్‌ను హైకోర్టులో వేసింది. హైకోర్టులో స్టేను తొలగించడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించింది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం ఉత్తమమని సర్కార్ భావిస్తోంది.
ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లో తమ పార్టీకి అనుకూలత ఉందని, ఈ ఎన్నికలో గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత ఊపు వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ కారణంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. మరోవైపు రైతుభరోసా కింద 3,4 విడతల సాయం పెండింగ్‌లో ఉంది. ఆ రైతు భరోసాను రైతుల ఖాతాల్లో చేర్చి ఎన్నికలకు పోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఎన్నికలు లేక, ఢిల్లీ నుంచి ఆర్థిక సంఘం నిధులు రాక, పంచాయతీలన్నీ డీలా పడ్డాయి. అపరిశుభ్రతకు నిలయంగా మారాయి. పరిపాలన కుంటుపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గానీ పంచాయతీలకు నిధులు వచ్చే పరిస్థితి లేదు. కానీ, అధికార పార్టీ మాత్రం బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ కోసమో.. లేదా తమకు అనుకూలంగా రాజకీయ పరిస్థితి మలుచుకునే వరకు వేచి చూసే దోరణి అవలంభిస్తోంది.
