వాస్తవం ప్రధాన ప్రతినిధి – హైదరాబాద్:
మేడారం జాతరంటే తెలంగాణకే ఓ మణిహారం. ప్రపంచం యావత్తు ఈ జాతర కోసం ఎదురు చూస్తుందంటే అతిశయోక్తి కాదేమో. గిన్నిస్ రికార్డులను తిరిగరాసి.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఈ జాతర వేదిక దేశ, ప్రపంచ నలుచెరగులా చాటిచెప్పే గొప్ప ఆథ్యాత్మిక కేంద్రంగా ఇది విలసిల్లుతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టు దినదిన ప్రవర్తమానంగా సమ్మక్క- సారాలమ్మ పోరాట గాధ, చరిత్ర విశ్వవ్యాప్తమవుతూ.. గిరిజనుల ఆరాధ్య దేవతల ఆశీస్సులు తీసుకునేందుకు.. మొక్కులు చెల్లించుకునేందుకు.. ఆ ప్రాంతాన్ని సందర్శించి తన్మయత్వం చెంది పునీతులయ్యేందుకు కోట్లలో భక్తులు, ప్రజలు వరుసకడతారు. అలాంటి మేడారం జాతర కోసం ఈ సర్కార్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నది.
జాతరకు మూడు నెలల ముందు నుంచే ఓ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు పోతున్నది.తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకైన ఈ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు.. గతంలో ఎప్పుడూ లేని ఏర్పాట్లు, సౌకర్యాలు శాశ్వతంగా నిలిచి ఉండేలా చేసేందుకు కంకణం కట్టుకున్నది. దీనిపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయనే స్వయంగా ఇక్కడి ప్రాంగణాన్ని దర్శించుకుని.. పరిస్థితులను దగ్గరుండి మరీ సమీక్షించనున్నారు. ఇప్పటికే అధికారులతో ఆయన మేడారం జాతర .. ఏర్పాట్లు, సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఆ తరువాత ఏకంగా ఆయనే అక్కడికి వెళ్లి అక్కడే సమీక్ష నిర్వహించి కావాల్సిన అన్ని శాశ్వత ఏర్పాట్లు చేసేలా పకడ్బందీ భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని కోసం అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు.
గతంలో కనివినీ ఎరుగని విధంగా ఆయన మేడారం జాతర కోసం అత్యధిక నిధులు కేటాయిస్తున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపరుస్తూ రహదారులు, సౌకర్యాలు, జంపన్నవాగు అభివృద్ధి, సోలార్ గ్రామాలు, శుభ్రతా కార్యక్రమాలు..ఇలా అన్నింటి కోసం ఏకంగా రూ. 236 కోట్లను కేటాయించారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే తొలిసారి కావడం… ఏకంగా సీఎం రేవంతే స్వయంగా అక్కడుండి సమీక్షించి ఆదేశాలిచ్చి సమీక్షించడం కూడా తొలిసారే కావడం గమనార్హం. గిరిజనుల ఆత్మగౌవరవమే కాదు… ఇది యావత్ తెలంగాణ జాతి ఆత్మగౌవరానికి సంబంధించిన విషయం కావడంతో సర్కార్ అదే స్థాయిలో ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి యావత్ తెలంగాణ జాతి జనం మనసు చూరగొనడమే కాదు.. వీక్షించేందుకు, దర్శించుకునేందుకు వచ్చిన యావత్ ప్రపంచానికీ ఇక్కడి జాతి గొప్పదనాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు రెడీ చేస్తున్నది.
