(దండుగుల శ్రీనివాస్)
ఈ మధ్య క్లౌడ్‌బరస్ట్ పదాలు విరివిగా వాడుతున్నారు. జనాల నోళ్లలో ఎక్కువగా నానుతున్న పదం ఉంది. ఎక్కువగా కొండల ప్రాంతాల్లో ఈ క్లౌడ్ బరస్ట్‌కు అవకాశం ఉందంటున్నారు. మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ విపరీత భారీ వర్షపాతాలు ఎందుకు నమోదవుతున్నాయి…? సాధారణం కన్న ఎక్కువ వర్షపాతం నమోదైతే కుండపోత వర్షపాతం అంటారు. కుంభవృష్టి అని కూడా అంటారు. మరి ఈ క్లౌడ్‌బరస్ట్ పదం ఎందుకు వచ్చింది…? క్లౌడ్ బరెస్ట్‌కు తెలుగీకరణే కుంభవృష్టా..? ఈ రెండూ ఓకేలా ఉన్నా వీటి మధ్య తేటా ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, నిర్మల్ జిల్లాలలో క్లౌడ్ బరెస్ట్ వర్షపాతమేనని తేల్చారు అధికారులు. ఇలాంటివి గతంలో పడలేదా..? ముఖ్యంగా తెలంగాణలో అంటే… పడ్డాయి. వరంగల్, ములుగు ప్రాంతాల్లో గతంలో ఇలాంటి క్లౌడ్ బరెస్ట్‌ను ఎదుర్కొన్నది తెలంగాణ.
సాధారణంగా మాన్‌సూన్ సీజన్‌ను జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు లెక్కిస్తారు. ఈ మధ్యకాలంలో కురిసే వర్షపాతాన్ని లెక్కించి.. సాధారణమా.. ఎక్కువ వర్షపాతమా..? లోటు వర్షపాతమా..? అనేది తేలుస్తారు. ఈ సీజన్‌లో కురిసే వర్షపాతం.. మామూలుగా 86సెం.మీ .. లేదా 90 సెం.మీ వరకు ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం దీనికన్నా తక్కువ కురిసిందా..? ఎక్కువ కురిసిందా లెక్కిస్తారు. కుంభవృష్టి అంటే 20 సెం.మీ వరకు అంతకు మించి వర్షం కురవాలి. దీన్నే ఎక్స్‌ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ అంటాము. మరి ఈ క్లౌడ్ బరెస్టు మాటేమిటీ..? 20 సెం.మీ దాటి.. ఆపై.. అంటే దాదాపుగా 30 సెం. మీ నుంచి 40 సెం.మీ వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరెస్టుగా పిలుస్తారు. కామారెడ్డిలో రెండు రోజులలో 43 సెం.మీ వర్షపాతం నమోదైంది. నిర్మల్ లో కూడా దాదాపు అంతే. క్లౌడ్ బరెస్ట్ కావడానికి ముందు వాతావరణాన్ని అధికారులు అంచనా వేస్తారు. ఆ రోజు సాయత్రం 4-5 గంటల నుంచి మేఘాలు క్లౌడ్‌బరెస్టుకు సిద్దమవుతాయి. రాత్రి మొత్తంగా ఏకధాటిగా, ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. అది అంతటితో ఆగదు. రెండు రోజుల పాటు కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఇది కొంత వెలిసినట్టు కనిపించినా.. మళ్లీ వర్షం దాడి మొదలవుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలోనే ఇది ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు అంచనా వేయడమే తప్ప… చేసేదేమీ ఉండదు. ఆస్తినష్టం అపారంగా ఉంటుంది. ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవడమే సర్కార్ కర్తవ్యం. పెరుగుతున్న కాలుష్యం.. మారుతున్న వాతావరణ పరిస్థితులతో సమతుల్యత దెబ్బతిని ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతాయంటున్నారు సంబంధిత అధికారులు. 2022లో వరంగల్ 66 సెంమీ వర్షపాతం నమోదైంది. ఈ క్లౌడ్ బరెస్టుతో ఆ జిల్లా మొత్తం అతలాకుతలమైన విషయం మరిచిపోలేదెవరు.
మాములు రోజుల్లో ఉన్న క్యూమిలో నింబస్ క్లౌడ్స్‌కు … ఈ వర్షకాలంలో వచ్చే క్యూమిలోనింబర్ క్లౌడ్స్‌కు తేడా ఉంది. అవి ఒక్కదగ్గరపడితే మరో చోట అసలు వర్షమే ఉండదు. కానీ ఈ సీజన్‌లో ఇచ్చే క్యూమిలో నింబస్ క్లౌడ్స్… బరెస్టయితే అంతే. అంతటా వానలే వానలే. తడిచి ముద్దయిపోవాల్సిందే అంతటా. ఏకధాటిగా, ఏకబిగిన.. ఆకస్మాత్తుగా, ఆగకుండా.. రెండు రోజులు కనీసం కురిసే ఈ వర్షాలు పెద్ద విపత్తునే తెచ్చిపెడతాయి. ఆస్తి, ప్రాణనష్టాలను మిగుల్చుతాయి. దాదాపు ఇరవై ఏండ్ల కింద ముంబయిలో 96 సెం. మీ వర్షపాతం నమోదైంది. అది పెద్ద వర్షపాతం అదే అక్కడ. మొత్తం ముంబై మునిగిపోయింది.