(దండుగుల శ్రీ‌నివాస్‌)

త‌డ‌పాటు. త‌త్త‌ర‌పాటు. చేసింది కాలరెగ‌రేసి చెప్పే క్ర‌మంలో పొంత‌న లేని మాటలు. ఇవే మోడీ పార్ల‌మెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్య‌లు. అమెరికా చెబితే యుద్దం ఆపావ‌నే క‌దా కాంగ్రెస్ మొద‌టి నుంచి ఆరోపిస్తున్న‌ది. దీనికి స‌రైన, ధీటైన జ‌వావు మోడీ ద‌గ్గ‌ర లేదు. అందుకే ఇన్నీ మాటలు. ఇన్నీ త‌డ‌బాట్లు. సైన్యం దాడులు చేసింది. అంతా అదే కోరుకున్నారు. ఇంకా పాక్‌కు గ‌ట్టిగా బుద్ది చెప్పాల‌ని కూడా అనుకున్నారు. ఇక పై మ‌ళ్లీ ఇటు వైపు చూసేందుకే ఉచ్చ ప‌డేలా చేయాల‌న్న‌దే యావ‌త్ దేశం, ప్ర‌పంచం కూడా కోరుకున్న‌ది. అంతగా కుత‌కుత‌లాడిపోయారంతా పాక్ చేసిన ఉగ్ర‌చ‌ర్య‌ల‌కు. మ‌ద్ద‌తిచ్చిన వైనానికి. మోడీపై భారీ ఆశ‌లే పెట్టుకున్న‌ది దేశం. ఆ అంచ‌నాల‌కు మించ‌కుండా, త‌గ్గ‌కుండానే సైన్యం కూడా ప్రాణాలొడ్డి, ప‌క‌డ్బందీగా దాడి చేసింది.

పాక్ ఉగ్ర‌స్థావ‌రాల‌ను తుత్తునియ‌లు చేసింది. అంతా బాగు బాగ‌న్నారు. మోడీ గ్రేట్ అని కూడా అన్నారు. ఇదే క‌దా మేం కోరుకున్న‌దీ అని కూడా మెచ్చుకున్నారు. కానీ అర్ధంత‌రంగా యుద్దం ఆగింది. ఎందుకు? అమెరికా జోక్యం. ఇదే అంద‌రినీ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. కానీ ఆ ప‌రిస్థితులు వివ‌రించ‌డంలో, ఎందుకు ఆగాల్సి వ‌చ్చిందో చెప్ప‌డంలో ఎందుకో ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయింది కేంద్రం. జ‌నానికి మీ మీద న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు, మీ చ‌ర్య‌లు ఎందుకు ఆగిపోయాయో వివ‌రించి చెప్పాల్సింది. ఎందుకు జ‌నం మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం ఇవ్వ‌లేదు? ఇవ్వ‌క‌పోగా ఎందుకు దీనిపై ముఖం చాటేశారు?? ఇది మ‌రింత అనుమానాల‌ను రేకెత్తించేలా చేసింది. కాంగ్రెస్ దీన్ని మ‌రింత‌గా ప‌దునుగా మోడీపై సంధిస్తూ వ‌చ్చింది. మొత్తానికి పార్ల‌మెంటులో దీనిపై జ‌నానికి జ‌వాబు చెప్పే సంద‌ర్భ‌మూ ఆస‌న్న‌మైంది.

ఏమ‌న్నాడు పీఎం… న‌న్నెవ‌రూ యుద్దం ఆప‌మ‌ని చెప్ప‌లేద‌న్నాడు. కానీ అమెరికా ఉపాధ్య‌క్షుడు మాత్రం ఫోన్ చేశాడంట‌. ఏమ‌ని? మీరు యుద్దం ఆప‌క‌పోతే అణు ఆయుధాలు ప్ర‌యోగిస్తార‌ట అని. అంటే బెదిరించారు. ఆపాల్సిందేన‌ని ఆర్డ‌రేశారు. కానీ మ‌న పీఎం ఏం అన్నాడు. బెదిరేదే లేదు. అంత‌కంతా మేమూ జ‌వాబు చెప్తామ‌న్నాడు. భేష్‌. బాగానే జ‌వాబిచ్చాడు వాళ్ల‌కు. మ‌రి యుద్దం ఎందుకు ఆగింది స‌డ‌న్‌గా? అంటే… అంటే.. అంటే.. వాళ్లు కాళ్ల బేరానికి వ‌చ్చాడు అని స‌మాధాన‌మొచ్చింది. అంటే.. అమెరికా తో ఆప‌క‌పోతే అంతుచూస్తామ‌ని రాయ‌భారం పంపిన పాక్‌.. బాబ్బాబు ఆపండి మీ కాళ్లు మొక్కుతామ‌ని మాత్రం మోడీ వ‌ద్ద మోక‌రిల్లిందట‌.

ఇవి ప‌ర‌స్ప‌ర భిన్నాభిప్రాయాల్లాగా లేవా? దీనికి బ‌దులు.. అవును.. మేమే ఆపేశాం.. అమెరికా మాతో మాట్లాడింది. ఆపండ‌ని చెప్పింది. యుద్దం ఎవ‌రికీ మంచిది కాదు.. వారికి బుద్దొచ్చింది.. ఇక‌పై ఇలా చేస్తే మ‌రింత క‌ఠినంగా ఉందామ‌ని చెప్పింది.. యుద్ధం వ‌ల్ల భార‌త్ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డ‌తారు. ఇప్ప‌టికీ చాలా క‌ష్ట‌న‌ష్టాల్లో ఉన్నార‌ని చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని చెబితే హుందాగా ఉండేదేమో క‌దా. ఇదే వాస్త‌వం కూడా.

Dandugula Srinivas

Senior Journalist

8096677451