వాస్తవం ప్రతినిధి- నిజామాబాద్:
అరాచకానికి ఆర్మూర్ కేరాఫ్ అడ్రస్ మొన్నటి దాకా. పదేండ్ల పాలనలో బెదిరింపులు, అరెస్టులు, అక్రమాలు, దౌర్జన్యాలు. పర, తమ బేధం లేదు. అందరి పట్ల సమన్యాయం ఆ మాజీ ఎమ్మెల్యేది. ఆర్మూర్ అంటేనే వార్తల్లో ఉండే పేరు. జీవన్‌రెడ్డి అంటేనే వివాదాలకు మారుపేరు. మాట వినలేదా? అంతే సంగతులు. ఎదురు ప్రశ్నించారా… బెదిరింపులు, అరెస్టులు. తనకు అనుకూలంగా లేకపోతే అణిచివేతలు. అధికారాన్ని చెప్పుచేతల్లో పెట్టుకుని ఆడింది ఆటగా పాడింది పాటగా నడిచింది ఇన్నాళ్లు. భూ కబ్జాలకు లెక్కలేదు. కొండలు, గుట్టలు కూడ వదల్లేదు. బినామీల రాజ్యం నడిచింది. షాపింగ్ మాల్ పేర బినామీలకు బురిడీ. ఆర్టీసీ సొమ్ముకు గండి. ఫైనాన్సు కిస్తీలకు మంగళం.
. అప్పుల పేరిట తీసుకున్న సొమ్ము గోవింద నామస్మరణం. ఆ పదేండ్లూ ఆర్మూర్ నియోజకవర్గం అంధకారమే. బీఆరెస్ వర్గీయులకు చీకటి రోజులే. ఓడగొట్టారు అంతా కలిసి. పర, తమ బేధం లేకుండా. పీడ పోయిందని ఊపిరి పీల్చుకున్నారంతా. బీఆరెస్ శ్రేణులకు మాత్రం పీడకలల జాడ వదల్లేదు. వెంటాడుతూనే ఉంది.
ఎప్పుడు పీడ విరగడవుతుందా? ఈ దెయ్యం ఎప్పుడు తమను వదిలి వెళ్తుందా? అని అంధకారంలో బిక్కు బిక్కుమంటూ కాంతిపుంజం కోసం ఎదురుచూస్తున్న ఆర్మూర్ గులాబీ బాధితులకు దేవతలా దర్శనమిచ్చింది విజయ భారతి. దివంగత సీనియర్ లీడర్ ఆలూరు గంగారెడ్డి తనయగా, ఆయన రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, అందరి తలలో నాలుకలా, ఆపత్కాలంలో వచ్చి ఆదుకొనే నాయికలా ఆమె ఎంట్రీ ఆ పార్టీకి కొత్త ఊపునిస్తోంది. జీవం ఉడిగిన ఆర్మూర్ గులాబీ జెండాకు జవ జీవాలనందిస్తోంది.