(దండుగుల శ్రీనివాస్)
మొన్నటికి మొన్న కవిత కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ధాటికి భయపడిన ఆమె ఆస్పత్రిలో చేరి రెస్టు పేరిట ఇందూరుకు ముఖం చాటేసింది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ వస్తోంది. ఇప్పుడు నిజామాబాద్‌లోని ఆమె నివాసం పక్కన కొత్త వివాదానికి తెరలేపింది ఆర్మూర్ కాంగ్రెస్. ఇందూరు బీజేపీ దీన్ని అదనుగా తీసుకుని వరుస ఆందోళనలు, నిరసనలు చేసేందుకు రెడీ అయ్యింది.
ఒకప్పుడు కవిత అంటే అక్కడ హడల్. నిజామాబాద్‌లో ఆమె చెప్పిందే వేదం.బీఆరెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు రోజులు మారాయి. పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆమె ను టార్గెట్ చేస్తూ రాజకీయాలు షురూ అయ్యాయి. ఎప్పుడో కవిత మామ రాంకిషన్ రావు అమ్మిన ఓపెన్ ప్లాట్‌ను పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు ఇది రోడ్డు స్థలమని కంప్లైంట్ ఇచ్చారు. దీని వెనుక ఆర్మూర్ కాంగ్రెస్ నాయకుడు వినయ్‌రెడ్డి అతని అనుచరుడు గాదరి గోపి ఉన్నాడు.
ఇక బీజేపీ ఇదే అదనుగా ఆందోళనలకు సిద్దమయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్, బీజేపీ పట్టు కోసం యత్నిస్తున్నాయి. ఇప్పటికే బిక్క చచ్చిపోయిన బీఆరెస్‌ను ఇలా బజారులోకి గుంజి బద్నాం చేసే యత్నం యథేచ్చగా సాగుతోంది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదేనేమో కాబోలు.