వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌:

రియ‌ల్ ఎస్టేట్ పై త‌న విజ‌న్ ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. రియల్ రంగం ప‌డిపోయింద‌నే అబ‌ద్ద‌పు ప్ర‌చారాన్ని ఆయ‌న తిప్పికొట్ట‌డ‌మే కాదు.. హైద‌రాబాద్‌లో రియ‌ల్ రంగం అభివృద్ధికి, తోడ్పాటుకు, పెట్టుబ‌డుల‌కు స‌ర్కార్ చేస్తున్న పురోగ‌తి చ‌ర్య‌ల‌ను, తీసుకొచ్చిన అనుమ‌తుల‌ను ఆయ‌న జ‌నం ముందుంచారు. త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకునేందుకు బీఆరెస్ చేసిన కుట్ర‌ల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. దీనికి జ‌నం ఆమోదం లేద‌ని, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఎవ్వ‌రూ దీన్ని న‌మ్మొద్ద‌ని ఆయ‌న కోరారు. సర్కార్ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రియ‌ల్ రంగం పురోభివృద్ధికి అకుంఠిత దీక్ష‌తో, మొక్క‌వోని విశ్వాసంతో త‌ను ప‌నిచేస్తున్నాన‌న్నారు. స‌ర్కార్‌ను న‌మ్మి పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎక్క‌డెక్క‌డి నుంచో వ‌స్తున్నార‌ని, ఇక్క‌డి వాళ్ల‌ను ఎలా దూరం చేసుకుంటాం..! క‌డుపులో పెట్టి చూసుకుంటాం… వాళ్ల పెట్టుబ‌డుల‌కు నాదీ పూచీ, లాభాల‌కు నాదీ భ‌రోసా ఆయ‌న అండ‌గా నిల‌బ‌డ్డారు. ఓడిపోయామ‌నే కోపంతో జ‌నం మీద ప్ర‌తీకారం తీర్చుకునేందుకు రియ‌ల్ ఎస్టేట్ రంగం ప‌డిపోయింద‌నే ప్ర‌చార కుట్ర‌లు చేసిన వారికి చెంప‌పెట్టులాంటి స‌మాధానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి త‌న ప్ర‌సంగం ద్వారా. ఇప్పుడిది రియ‌ల్ స‌ర్కిళ్ల‌లో వైర‌ల్‌గా మారింది. క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌సంగం ఆసాంతం ఆక‌ట్టుకుంది. త‌న విజన్‌ను తెలంగాణ జ‌నం ముందుంచారు ఆయ‌న‌…

ఏం చేస్తున్నాం.. ఏం చేశాం..!!

సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా..పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు స‌ర్కార్ ఎప్పుడూ ముందుంటుంది. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి.లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా..! అని సీఎం వివ‌రించారు.

ఢిల్లీ అందుకే వెళ్తున్నా! ఫామ్‌హౌజ్‌లో దావత్‌లు చేసుకునేందుకు కాదు!

న‌గ‌ర ప్ర‌తిష్ట‌ను పెంచేందుకే అనుక్ష‌ణం త‌పిస్తున్నాన‌ని సీఎం అన్నారు. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నాన‌న్నారు. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు…మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారు….ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగళా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే ..దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా.అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదు… అని సీఎం వివ‌రించారు.

ఒక్క‌డి కోసం కాదు.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం నా తండ్లాట‌!

26 వేల కోట్లు రుణాలను 35 ఏళ్లకు 7.5 శాతం వడ్డీకి రీ స్ట్రక్చర్ చేయించాన‌ని సీఎం అన్నారు. అలా 2 లక్షల కోట్ల రుణాలకు రీ స్ట్రక్చర్ కోసం ప్రధానిని కోరుతున్నాన‌ని వివ‌రించారు. ఇదినా ఒక్కడి కోసం చేస్తున్నది కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నా తాపత్రయమ‌న్నారు. తెలంగాణకు మరిన్ని విమానాశ్రయాలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదా? మెట్రో, ఎయిర్ పోర్ట్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే … రీజనల్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు 11 కొత్త రేడియల్ రోడ్లు ఏర్పాటు చేయబోతున్నామ‌ని వివరించారు.

మూడు భాగాలుగా విభ‌జించి.. అభివృద్ధి ప్ర‌ణాళిక‌లు రూపొందించి..!

వాటర్, రోడ్డు కనెక్టివిటీ లేకుండా ఇన్ఫ్రా స్రక్చర్ అభివృద్ది కాలేద‌ని సీఎం అన్నారు. హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేలో డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. ఇందుకోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించామ‌ని, త్వరలోనే అనుమతులు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామ‌న్నారు. కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ గా విభజించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయబోతున్నామ‌న్నారు.

హైడ్రా జ‌నం పాలిట హీరో.. విల‌న్ కాదు!

నీళ్ళుండే చోటుకు మనం వెళితే నీళ్లు ఎక్కడికి వెళతాయ‌ని, అందుకే హైడ్రాతో చెరువులను పునరుద్ధరిస్తున్నామ‌ని సీఎం వివ‌రించారు. నాలాల ఆక్రమణలు తొలగిస్తే ఒక పెద్దమనిషి సోషల్ మీడియా ద్వారా మాపై దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్‌పై ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ కోసం ప్రణాళికలు మేం సిద్ధం చేస్తాం.. మీరు ప్రమోట్ చేయండ‌ని క్రెడాయ్ ప్ర‌తినిధుల‌ను సీఎం కోరారు. ప్రణాళికలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వారిపైనే ఉంద‌న్నారు.

నాకు వేరే కోరిక‌లేం లేవు.. సిటీని గొప్ప న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యం!

కులీ కుతుబ్ షా చార్మినార్ కట్టారు, ఔటర్ రింగ్ రోడ్డును వైఎస్ నిర్మించారు, హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశారు.. వాళ్లు ఇక్కడ లేకపోయినా వారి పేర్లు చెప్పుకుంటున్నాం.. వారిని గుర్తు చేసుకుంటున్నామ‌ని అన్నారు సీఎం. సంపాదించింది ఎవరైనా తీసుకెళతారేమో కానీ సమాజానికి ఇచ్చింది ఎవరూ తీసుకెళ్లలేరన్నారు.
నాకు వేరే కోరికలేం లేవు… హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా.. భవిష్యత్ లో వందేళ్లు, వెయ్యేళ్లు చెప్పుకునేలా నగరాన్ని అభివృద్ధి చేస్తాం..నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి, తపన ఉంది..నాకు వయసు ఉంది, ఓపిక ఉంది.. అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామ‌ని పిలుపు నిచ్చారు రేవంత్‌రెడ్డి.

You missed