(దండ‌గుల శ్రీ‌నివాస్‌)

బీసీల‌కు క‌చ్చితంగా 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని, స‌ర్కార్ ఇందులో 10 శాతం ముస్లిం మైనార్టీల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే దీన్ని కేంద్రం అట‌కెక్కించేందుకు రెడీగా ఉన్న‌ద‌ని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై 72 గంట‌ల నిరాహార దీక్ష‌ను ఆమె ఇందిరాపార్క్ వ‌ద్ద ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌పై క‌చ్చిత‌మైన క్లారిటీ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

 

ఇందులో 10 శాతం ముస్లింల‌కు కూడా రిజ‌ర్వేష‌న్లు ఉన్నాయ‌నే సాకుతో బీజేపీ, కేంద్ర ప్ర‌భుత్వం ఈ బిల్లును కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టేందుకు రెడీగా ఉంద‌ని, అలా జ‌రిగితే రాష్ట్ర ప్ర‌భుత్వానికి బీసీల రిజ‌ర్వేష‌న్ల‌పై చిత్తశుద్ది లేద‌నే విష‌యం తేలిపోతుంద‌న్నారు. కామారెడ్డి బీసీ డిక్ల‌రేష‌న్ స‌భ‌లో హామీ ఇచ్చిన‌ట్టుగానే క‌చ్చితంగా దీన్ని అమ‌లు చేసి తీరాల‌ని క‌విత డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీల‌కు 10 శాతం ఇచ్చే రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌త్యేకంగా బిల్లు పెట్టాల‌ని, ఇందులో క‌ల‌ప‌వ‌ద్ద‌ని ఆమె కోరారు.

దీనిపై బీసీ స‌మాజానికి క్లారిటీనిస్తూ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టాల‌ని కోరారు. అధిష్టానం పెద్ద‌ల‌తో క‌లిసి దీనిపై స్ప‌ష్ట‌త‌నిచ్చి బీసీల ప‌ట్ల కాంగ్రెస్ కు నిజ‌మైన చిత్త‌శుద్ది ఉంద‌నే నిరూపించుకోవాల‌ని డిమాండ్ చేశారు.