(దండుగుల శ్రీనివాస్)
ప్రతిపక్షానికి అదో అస్త్రం నిన్నటిదాకా. పాలన పరంగా, సంక్షేమ పథకాల అమలు పరంగానో విమర్శ కాదది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ సీఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదనేది. ఎన్నిసార్లు వెళ్లినా కలవడం లేదు.. కనీసం పలకరించడ లేదు.. అంటూ తమ రాజకీయ అవసరాల కోసం, తెలంగాణ జనం ముందు రేవంత్‌రెడ్డిని చిన్నగా చూపేందుకు నానా తంటాలు పడ్డారు. అదిప్పుడు తుత్తునియలైంది. రాహుల్ గాంధే దీన్ని బద్దలు కొట్టాడు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితి గోడలను బద్దలు కొడతానని ఏఐసీసీ కార్యాలయ వేదికగా ప్రకటించిన రాహుల్ గాంధీ…. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం బీఆరెస్ చేస్తున్న ఓ చీప్ ప్రచారాన్ని కూడా బద్దలు కొట్టి తుక్కుతుక్కు చేశారు.
కులగణన సర్వే మొదట తెలంగాణలో జరపాలని తలచినప్పుడు రెడ్డి సామాజికవర్గం నుంచి రేవంత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని రాహుల్ భావించారట. దీన్ని ఎలా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తారోనని కొంచెం తటపటాయించిన విషయాన్నీ ఆయన ఒప్పుకున్నారు. కానీ రాహుల్ అనుమానాలను ఇక్కడ రేవంత్ బద్దలు కొట్టారు. ఆ విషయాన్నీ ఈ వేదికగా బహిర్గతం చేశారు రాహుల్. అంతే కాదు అద్భుతమైన డేటాను సమీకరించి పెట్టుకున్న రేవంత్.. ఇక తెలంగాణ పల్లెపల్లెన కావాలని అభివృద్ధి, సంక్షేమం, సామాజిక పురోభివృద్ధి సాధించడమే కర్తవ్యంగా పెట్టుకున్నారని, అదే ఇప్పుడు సీఎం తక్షణ కర్తవ్యమని కూడా సూచన చేశారాయన.
బీసీల పట్ల పార్టీకి ఉన్న నిబద్దత, నిజాయితీ ప్రజలు తెలుసుకున్నారని, అది వేరే పార్టీలకు దక్కదని కూడా పరోక్షంగా రాహుల్ వ్యక్తీకరిచారు. సరే, ఇదంతా పక్కన పెడితే.. ఈ పరిణామం మాత్రం బీఆరెస్ శ్రేణులకు, అందులోనూ ప్రధానంగా కేటీఆర్‌కు మాత్రం ఎంత మాత్రం మింగుడుపడటం లేదనుకుంటా. ఎందుకంటే.. మాట్లాడితే ఢిల్లీ వెళ్లున్నారనడంలో, రాహుల్ గాంధీ అపాయింట్‌మెంటే దొరకడం లేదని ప్రచారం చేయడంలో, ఇద్దరి మధ్యా గ్యాప్ ఉందని నమ్మించే క్రమంలో నిత్యం పడే, పరితపించే ప్రయాస ఇక ఉండబోదు. ఇది ఎంతో కొంత మొన్నటి వరకు తనకు, తన పార్టీకి మైలేజీ తీసుకొస్తుందని కేటీఆర్ భావించి ఉంటారు. కానీ ఈ మీటింగు తరువాత అందరికీ అర్థమైందేంటంటే.. రేవంత్ బలం పెరిగిందని, తిరుగులేని రేవంతుగా మారాడని.
