(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ తరచూ సభల్లో ఓ పిట్టకథ చెబుతుండే. ఒక ఊళ్లో ఒక పెద్దవ్వ ఇంటికి ఓ ఎగిర్తపు సుట్టం వచ్చిండట. వచ్చీ రాంగనే నేను పోతా నే పోతా.. జల్దిపోవాలె.. జల్ది జల్ది పోవాలె.. అంటున్నడంట. పెద్దవ్వ అన్నదట. సరే మరి. జల్దిపోయేదుంటున్నవ్ కదా.. ఇంట్ల సలిబువ్వ ఉన్నది తినిపోతవ..? అని అడిగిందట. ఎందుకు పెద్దవ్వ సలిబువ్వ తింట.. ఉడుకుదయ్యేదాకా ఉంటా..! అన్నడంట. సేమ్ అట్లనే ఉంది సీఎం రేవంత్‌రెడ్డి యవ్వారం ఇయ్యాల.
పెట్టింది పార్టీ మీటింగు. ఉద్దేశ్యం సామాజిక న్యాయ సమరభేరి. కానీ దీని గురించి మాట్లాడింది ఆవగింజంత. పెద్దల దగ్గర ప్రాబల్యం చాటుకునేందుకు చేసిన ప్రయత్నం కొండంత. లోకల్‌బాడీ ఎన్నికల గురించి మాట్లాడిండు. బాగనే ఉంది. నేనే గెలిపిస్తానన్నాడు. ఇదీ మంచి ఊపునే ఇచ్చింది. అవకాశాలు రాని వారికి మున్ముందు మంచి చాన్సులున్నాయనే విషయం చెప్పాడు. శుభవార్తనే. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు.. అందరికీ అవకాశాలుంటాయని చెప్పడం అవసరమే. కానీ వంద అసెంబ్లీ గెలిపిస్తాననడమే కొంత ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉంది. పనిలో పని 15 ఎంపీలిస్తాం.. తీసుకోండి.. ఢిల్లీలో అధికారం తెచ్చుకోండి. పండుగ చేసుకోండని వేదిక మీద ఏఐసీసీ పెద్దలకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు రేవంత్. వేదిక మీద నుంచి నేను మీకు భరోసా ఇస్తున్నా.. కాసుకోండి.. తీసుకోండనే రేంజ్‌లో ఆవేశంలో వాగ్దాటిగా మాట్లాడేశాడు.
అంతకు ముందు మాట్లాడుతూ.. ఇన్నీ చేశామా.. నాకే నమ్మబుద్దికాలేదన్నాడు. దేశానికే ఆదర్శంగా నిలిచామన్నాడు. రైతుభరోసా, రుణమాఫీ, ఉద్యోగాలు, హామీల అమలు.. అన్నింటిపై చర్చకు సిద్దమన్నాడు. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్ల రైతు భరోసా వేస్తమా వెయ్యమా..? అని అంతా అనుకున్నారు. వీళ్లు కచ్చితంగా వెయ్యరనే ఎదురుచూశారు.. కానీ వేశాం.. అదీ మా కమిట్మెంట్ అన్నాడు. ఒక్కసారికి చేసి జబ్బలు చరుచుకుంటే ఎట్లా రేవంత్ సాబ్..! అంతకు ముందు ఎగనామం పెట్టిన సంగతి రైతుల మరవలేదు. అప్పుడు డప్పు కొట్టుకునుడెందుకు..? మళ్లా సీజన్ రానే వస్తది. అప్పుడు ఇదే ఊపు లేక.. మళ్లీ అప్పులు.. వడ్డీలు వల్లెవేస్తూ పాడిండే పాటరా.. అన్నట్టు స్పీచ్ కొనసాగితే మాత్రం జనాలు ఈసడించుకుంటారు. ఇప్పటికదే చేస్తున్నారు. మరి ఇంత భారంగా బండి నెట్టుకొస్తున్నం కదా.. మళ్లా ఎట్లా అంత ఈజీగా అధికారంలోకి వస్తానంటావు..? అదీ వందనా..? సరే సరే అంతమటుకు మన మీద మనకు నమ్మకం ఉండాలె.
ఒకటి మాత్రం రేవంత్ క్లారిటీ ఇచ్చిండు. మళ్లాగిట్ల గెలిస్తేనిలిస్తే.. నేనే సీఎం మరి. చూసుకోండ్రి.అక్కడ రాహుల్, సోనియలకు కూడా ఇదే చెప్పుండ్రి. ఎందుకంటే గప్పుడు కూడా శపథం చేసిన. అధికారంలోకి తెస్తానని. ఇప్సుడు సుక చేస్తున్నా. వంద గెలిపిస్తానని. ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి తగ్గదు. తగ్గితే నన్ను అడగుండ్రి. ఇగో ఇంత గట్టిగ చెప్తున్ననంటే అది నాతో అయితదనేగా. అందుకే మళ్లీ నేనే సీఎం. ఇప్పుడు కొనసాగుతా. మళ్లా వచ్చే ఐదేండ్లూ నేనే ఉంటా. చలిబువ్వ తింట. ఉడుకుది అయ్యేదాకా ఉంటా.. ఇదన్నమాట సంగతి.
Dandugula Srinivas
Senior Jornalist
8096677451