(దండుగుల శ్రీనివాస్)
ప్రొఫెసర్ కోదండరామ్‌ను వాడుకుని వదిలేసింది కాంగ్రెస్. టీజేఎస్‌ను టిష్యూ పేపర్ లెక్క పక్కన పడేసింది అవసరానికి యూజ్ చేసుకుని. ఇది నేనంటున్న మాట కాదు. తెలంగాణ జన సమితి పార్టీ కీలక నేతలే అంటున్నారు. రెడ్ల రాజ్యమొచ్చిందని ఆయన నోరు మెదపడం లేదనే అబాండమూ ఆయనపైన వేస్తున్నారు.
మా పదవులపై సీఎంను ఎందుకు నిలదీయడం లేదని అడుగుతున్నారు. నీకు పదవొచ్చింది.. కానీ ఎవరన్నా సర్కార్‌లో విలువనిస్తున్నారా..? కీలక సమావేశాలకు పిలుస్తున్నారా..? అసలు మీకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారా..? అనే ప్రశ్నలు తన సొంత గూటి నుంచే ఎదుర్కొంటున్నాడు ప్రొఫెసర్ సాబ్. ఇప్పటి వ రకు ఆయన సీఎంను కలిసింది ఓ రెండు మూడు సార్లు. మీనాక్షి నటరాజన్‌ను, పీసీసీ చీఫ్‌ను కూడా ఒకటి రెండు సార్లు కలిశాడు అంతే. వారిచ్చిన హామీల గురించి మాట్లాడారా..? పార్టీలో ఉండి పోరాడిన మా వద్దకు వచ్చి రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాల ప్రస్తావన తెస్తున్నారా..? అని టీజేఎస్‌లో కోదండరామ్ వెన్నంటి ఉండే కీలక నేతలు ఓ పది మంది ఆయనను వెంటాడుతున్నారు. ఒత్తిడి తెస్తున్నారు.
అసలు మనం మిత్రపక్షమా..? ప్రతిపక్షమా..?? మిత్రపక్షమైతే మనకు విలువేది..? మనకు పదవులేవీ..? ప్రతిపక్షమైతే జనం తో పాటు మనం ఎందుకు లేము..? సర్కార్ వైఫల్యాలపై ఎందుకు ప్రశ్నించడం లేదు..? అంతర్గతంగా ఆ పార్టీలో నేతలు కోదండరామ్‌ను ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఊపిరాడనీయడం లేదు. ఒక్కసారైనా ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నేతలతో కలిసి సీఎంను కలవలేదు కోదండం. కనీసం.. మీనాక్షి.. లేదా మహేశ్ గౌడ్.. ఉహూ లేదు. ఆయనే వెళ్లాడు. నవ్వుకుంటూ తిరిగొస్తాడు.
ఏం సాధించాడు..? ఏం మాట తీసుకున్నాడు…? అసలు ఈయన చెప్పే మాటలు వాళ్లు వింటున్నారా..? వీరికే అనుమానం ఉంది కోదండరెడ్డిపై. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టు.. ఛస్.. ! ఊకోండ్ర భయ్… మనం గట్టిగా నిలదీస్తే బీజేపీ బలపడుతుంది.. మీ ఇష్టం అని కూడా బెదిరింపు దోరణిలో మాట్లాడుతున్నాడట. పరపతి పాయె.. ఫేస్ వాల్యూ లేకపోయే.. కులం చెడ్డా సుఖం దక్కకపాయె.. మాకేందీ దురవస్థ..? అని అన్నా.. చలనం లేదట పెద్దాయన దగ్గర. అదే చిరునవ్వు.. మాట్లాడుదాం.. మాట్లాడుదాం..! అంతే.
రోజులు గడుస్తున్నాయ్..! ఏండ్లూ నిండుతున్నాయ్..! కానీ టీజేఎస్ నేతలు మాత్రం త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోయారు. మానసికవేదన పడుతున్నారు. కొరమెరుపంటంటే….. ఆయన దగ్గరకు ఒక్కసారి వచ్చిన వాళ్లు మళ్లీ రావడం లేదట. ఎందుకు..? పనులే కానప్పుడు.. పతారే లేనప్పుడు.. పోయి లాభమేంది.. దారి ఖర్చులు బొక్క అని అనుకుంటున్నారట.. ఇదీ కరివేపాకు కథా కమామీషు..!
Dandugula SRINIVAS
Senior Journalist
8096677451