(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్ దిగొచ్చిండు. తలకెక్కిన అహంకారం దిగుతున్నది. పక్కా ఓటు బ్యాంకు రాజకీయాలు నెరిపే అలవాటు దోరణి నుంచి రూటు మార్చాడు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నబీసీ కాన్సెప్టు ప్రకారం తనూ పోవాల్సిందేనని తేల్చుకున్నాడు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్టు… తను అధికారం కోల్పోవడానికి కారకులైన ఓడిన ఎమ్మెల్యేలను ఇంచార్జిల బాధ్యతల నుంచి పీకిపారేసి.. ఆ స్థానంలో బీసీలను నియమించడం ద్వారా జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవచ్చనుకుంటున్నాడు. రాబోయే ఎన్నికల కోసం బీసీ టీమ్ కూడా తన పార్టీలో ఉందని చెప్పుకునేందుకు రెడీ అయ్యాడు.
దాదాపు 20 నుంచి 30 మంది ఇంచార్జిలను తొలగించేందుకు సిద్దమైన గులాబీ అధినేత.. ఆ స్థానంలో అక్కడ బలంగా ఉన్న బీసీ సామాజికవర్గ నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా బీసీల ఓట్ల సంఖ్యను బట్టి.. ఆ సామాజికవర్గానికి చెందిన బలంగా ఉన్న నేతల కోసం సర్చింగ్ మొదలు పెట్టాడు. మున్నూరుకాపు, గౌడ్స్, పద్మశాలి, యాదవ్‌లపై ప్రధానంగా ఆయన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. వీరిని కాదని మరో బీసీకి ఇచ్చే చాన్స్ లేదు. అంత రిస్క్ కూడా తీసుకోడు కేసీఆర్. ఇప్పటికే ఆయన పలువురు పార్టీ పెద్దలను, తనకు బాగా సన్నిహితులుగా ఉన్న నేతలకు ఈ టాస్క్ అప్పగించినట్టు తెలిసింది.
ఎక్కడెక్కడ ఎవరెవరు బీసీలు బలంగా ఉన్నారు. వారికి టికెట్లు ఇస్తే గెలుస్తారా..? వారి ఆర్థికబలమెంత…? రాజకీయంగా ఉనికి ఎలా ఉంది..? పేర్లు ప్రకటిస్తే ప్రజలు ఆక్సెప్ట్ చేసేంత సీన్ ఉందా..? అనే అంశాపైనా లోతుగా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తరువాత బీసీ జపం చేస్తున్నది. 42 శాతం బీసీల కోటా విషయంలో క్లారిటీగా ఉన్నది. రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రాన్ని దోషిగా బోనులో నిలిపింది. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు కేంద్రం ఓకే అనకున్నా.. పార్టీ తరుపున ఆ కోటాను భర్తీ చేసి తమది రెడ్డి రాజ్యం కాదని, రెడ్ల ప్రభుత్వం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నది. ఈ అంశం బీఆరెస్‌ను ఇరుకన పెట్టనుంది. ఎందుకంటే.. కేసీఆర్ బీసీలను కల్లులో ఈగలాగా తీసిపాడేశాడు.
వీరందరికీ టికెట్లిస్తే అంతే సంగతులనే ఆలోచన ఆయనకుంది. అందుకే రెడ్లకు అగ్రతాంబూలం అందించాడు. ఆర్థిక బలం ఉండి.. నేర చరిత్ర ఉన్నా.. గెలుస్తాడనే నమ్మకం ఉంటే వారికే టికెట్లిచ్చాడు. అధికారంలోకి రావడమే పరమావధిగా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసం, తెలంగాణ జనం కోసం అని అనుకునే స్థితిలో ఎవరూ లేరు. అందుకే ఆయన దిగొచ్చాడు. తలెకెక్కిన అహంకారాన్ని తగ్గించుకున్నాడు. నేల విడిచి సాము చేయడం వల్ల ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని తెలుసుకున్నాడు. పరివర్తన చెందినట్టు ప్రవర్తిస్తున్నాడు.
Dandugula Srinivas
Senior Journalist
8096677451
