(దండుగుల శ్రీనివాస్)
కేసీఆర్‌కు ఓ బ్రాండ్ ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాడానే క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణ రావడంలో ఆయనది కీలక పాత్రనే గుర్తింపు ఉంది. చరిత్రలో అది ఉండిపోతుంది. ఇందులో డౌట్ లేదు. జయశంకర్ సార్ కూడా చాలా సార్లే చెప్పాడు. కేసీఆర్‌లో చాలా అవలక్షణాలుండొచ్చు.. కానీ అతనికి తెలంగాణనే ప్రాణం. దాని కోసం కొట్లాడె గుణం ఉంది. మొండిగా ఉండే అతని మెంటాలిటీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అవసరం అన్నాడు.
నిజంగా అవసరమే పడింది. కానీ అప్పటి పరిస్థితులకు. అప్పటి అవసరాలకు. అందుకే జనాలు కూడా ఓన్ చేసుకున్నారు. లోపాలనూ యాక్సెప్ట్ చేశారు. అతడంతే మారడు. మనకు కావల్సింది లక్ష్య సాధన. అందుకు ఒకడు ముందుండాలె. తెలిసినోడు కావాలె. మొండిగా ఉన్నోడు కావాలె. తలొగ్గొద్దు. లొంగొద్దు.. ఇవన్నీ అనుకున్నప్పుడు.. ఆ పారామీటర్స్‌కు సరిపోయాడు కేసీఆర్. వందశాతం కాదు. కానీ అప్పటికి అంతకు మించి ఎవరు లేరు కూడా. ఇది కాదనలేని సత్యమే. కానీ ఆ తరువాత కూడా అదే ముసుగేసుకుని ఇక తను చెప్పిందే వేదం కావాలనుకున్నాడు. నేను తెచ్చిన కాబట్టి తెలంగాణపై గుత్తాధిపత్యం తనదే కావాలనుకున్నాడు.
తనలా ఆలోచించేవారు లేరు కాబట్టి.. ఇంకో మెదడు తెలంగాణ కోసం ఆలోచించొద్దనుకున్నాడు. ఆలోచించినా దాన్ని చించేయాలే తప్ప తన ముందుకు వచ్చి చెప్పేంత దమ్ము, ధైర్యం ప్రదర్శించొద్దనుకున్నాడు. అధికారంలో ఉన్న పదేండ్లు అట్లనే నడిచింది. కేసీఆర్‌ను నమ్మండి.. ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చినోడు… రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలో ఇంతకు మించి తెలిసినోడెవ్వడు.. ? అనే సిగ్నల్ ఇచ్చాడు ప్రజలకు. ప్రజలూ పోనీ ఇచ్చేద్దాం అధికారం అనుకున్నారు. ఇక కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసమే… అందుకే ఆయన ఏం చేసినా గుడ్డిగా తలూపాలె తప్ప ప్రశ్నించొద్దు. ఎదురు మాట్లాడొద్దు. విమర్శించొద్దు. ఇలా చేసిన వారంతా కేసీఆర్‌కే కాదు తెలంగాణకే శత్రువులు.
అవతల పార్టీలో ఉన్నవాళ్లంతా తెలంగాణ ద్రోహులు. టీఆరెస్‌లో చేరగానే, కేసీఆర్‌తో జతకట్టగానే తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు. అందుకే అధికారం పది కాలాలు.. కాదు కాదు.. వంద కాలాలు తన చేతుల్లోనే.. తన వంశం గుప్పిట్లోనే ఉండాలనుకున్నాడు. అందుకే ఆయన ఏం చేసినా తెలంగాణ కోసమే మన కోసమే. అది ఏదైనా. ఫోన్ ట్యాపింగ్ అయినా సరే. దీన్ని ఎంత పెద్ద తప్పిదంలా చూడొద్దు. అదే కేసీఆర్ అభిమతం. ఓ టీవీ ఇంటర్వ్యూలో కూడా అన్నాడు. ట్యాపింగ్ ట్యాపింగ్ అని అరుస్తున్నారెందుకు..? ఓ రాజ్యంలో ఏం జరుగుతుందో సీక్రెట్‌గా గూఢాచారులు తెలుసుకుంటారు.. ఇప్పుడు పోలీసులు కూడా అదే చేస్తున్నారు. అది వాళ్ల డ్యూటీనే కదా అన్నాడు. అబ్బా కొత్త రాజకీయాలకు ఆయనే నిర్వచనం. అధికారం ఎలా సాధించాలి..? జనాలను ఎలా బుట్టలో వేసుకోవచ్చో ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు.
అందుకే ఆయనలో ఆ అహంకారం. అది వీడదు. మారదు. అప్పుడు జనాలకు కేసీఆర్ అవసరం. ఇప్పుడు కేసీఆర్‌కు జనాల అవసరం అంతే తేడా. అప్పుడు కావాల్సింత సపోర్టు ఉంది.. ఇప్పుడు కావాల్సినంత డబ్బు ఉంది. అంతే తేడా. అందుకే అంటున్నా… మోడీ ఏం చేసినా దేశం, ధర్మం కోసం.. కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసం, మనం కోసం అంతే. ఫిక్సయిపోండి.
Dandugula Srinivas
Senior JOURNALIST
8096677451