(దండుగుల శ్రీనివాస్)
పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి… ఓ పాటుంది. పెద్దోడైనా, చిన్నోడైనా తండ్రికి ముద్దే. మురిపమే. మరి బిడ్డె. ఆమెంటే పంచ ప్రాణాలు. మగపిల్లాడు ఆరితేరాలి. ఆడపిల్ల అనుకువగా ఉండాలి. వాడు అందరిలో తిరగాలి. ఆమె అమ్మకూచీ అయివుండాలి. దాదాపుగా అప్పట్నుంచి ఇప్పటి వరకు అంతా ఇదే చేస్తున్నారు. కొంచెంలో కొంచెం బెటర్. చదవిస్తున్నారు. ఉద్యోగాలు చేపిస్తున్నారు. మగవాడికి సరి సమానంగా పెంచుతున్నారు. కొందరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు తమ వల్ల కాదంటూ పెళ్లి చేసి పంపించేస్తున్నారు.
ఆయన కూడా అంతే. రాజకీయాల్లో చాణక్యుడు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడిన ఉద్యమకారుడు. ఉద్యమానికి దిక్సూచిగా మారినవాడు. దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ పేజీ లిఖించుకోగలిగినవాడు. బిడ్డెంటే ప్రాణం. ఆమెను ముద్దుగా చిరంజీవి అని పిలుపుచుకుని ఆమె ఎదగాలని కోరుకునేవాడు. జనాలతో ఆమె మమేకమైతున్న తీరు చూసి సంబురపడ్డవాడు. అన్నీ ఓకే. ఒక్క విషయంలో తప్ప. కొడుకు కొడుకే. అందరి తండ్రిలాగే ఈ తండ్రీ ఆలోచించాడు. వారసత్వం కొడుకుకే ఇవ్వాలనుకున్నాడు. తన శక్తినంతా, తన చాణక్యమంతా కొడుకు రాజకీయ ఎదుగుదలకే ఉపయోగిచేందుకు డిసైడ్ అయిన వాడు. ఈ విషయంలో బిడ్డె కోసం ఒక్క క్షణం కూడా వేరు ఆలోచన చేయనివాడు.
అంతే బిడ్డె బిడ్డె. ఆంక్షలు, కట్టుబాట్లు ఆమెకూ ఉంటాయని నమ్మినవాడు. సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆథ్యాత్మికం అన్నీ అవపోసన పట్టినవాడే కానీ, ఆడపిల్ల విషయంలో ఓ సగటు తండ్రిలానే ఆలోచించినవాడు. అందుకే బిడ్డెనా.. ? కొడుకా..? అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన దృష్టి కొడుకుపైనే నిలిపినవాడు. అదే న్యాయమని కూడా నమ్మినవాడు. అలా చేస్తేనే ఈ తండ్రికి మోక్షమని బలంగా భావించినవాడు.
అందుకే ఆ బిడ్డ .. తండ్రి రొమ్ములపైనే పెరిగి తిరబడింది. ఎందుకు నాన్నా..? అన్నీ ఇచ్చావు. చివరాఖకు ఇలా వదిలేశావు…? అని గొంతెత్తి బిగ్గరగా అరిచింది. కానీ అది తండ్రికీ వినబడింది. కానీ ఆ కళ్లు చెమ్మగిల్లలేదు. ఆ తనువు చలించలేదు. ఎందుకంటే తను ముందే డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు బిడ్డె రూపంలో తిరుగుబాటు. ఆమె ఎప్పుడూ ఆయనకు చిన్నపిల్లే. మారం చేసి తండ్రివద్ద గారాలు పోయి సాధించుకోవాలని చూసే పసిబిడ్డె. కానీ కేసీఆర్ ఏదడిగినా ఇస్తాడు.. అధికారం తప్ప. అదెప్పుడూ కొడుకు వశమే. అతడే ఇతగాడి వారసుడు. ఆమె రోదన అరణ్య రోదనే అయ్యింది. తెలుసు. అయినా, నాన్నంటే ప్రేమే. ఆ తండ్రికి ఆ బిడ్డంటే పంచ ప్రాణాలే.