వాస్తవం – ఖమ్మం ప్రతినిధి:
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో భరోసా పైసలను వేస్తామన్నాడాయన. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా రూ. 70 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తుచేశారు. రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని చెప్పారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని అన్నారు. ప్రజాభిమానం ఉంటే పదవులు అవే దక్కుతాయని పేర్కొన్నారు. రైతుల రుణభారం తగ్గించేందుకు పాత రుణాల మాఫీ పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. రైతు బంధు పేరుతో గతంలో అన్ని పథకాలు ఆపేశారు.
కానీ ఇప్పుడు అన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లింది రూ.36,000 కోట్లని వెల్లడించారు. విత్తనాల విషయంలో నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నకిలీ విత్తనాల విషయంలో పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు.
