(దండుగుల శ్రీ‌నివాస్‌)

చెప్పేదొక‌టి. చేసేదొక‌టి. అంతే మ‌రి రాజ‌కీయాలంటే. బీసీల‌కు పెద్ద‌పీట‌. మేం బీసీల‌కు ఎక్కువ సీట్లిస్తాం.. కుల గ‌ణ‌న చేసి బీసీల‌కు న్యాయం చేయ‌బోతున్నాం. బీసీ రిజ‌ర్వేష‌న్లు ఓ చారిత్ర‌క ఘ‌ట్టం.. ఇలాంటి మాట‌లు గ‌త స‌ర్కార్‌లో కన్నా ఇప్పుడే బాగా వినిపించాయి. కానీ క‌నిపించ‌డం లేదు. ముందే రెడ్ల కాంగ్రెస్‌గా ముద్ర‌. దీన్ని పోగొట్టుకునేందుకు తంటాలు ప‌డి .. మ‌రో మూడు మంత్రి ప‌ద‌వులు ఖాళీగానే ఉంచి.. ఆశిస్తున్న రెడ్ల‌కు బుజ్జ‌గింపులు చేసినా.. మంత్రుల‌కు కేటాయించిన శాఖ‌ల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి ఉంది బీసీల్లో. ఓసీల‌కు ఉత్త‌మ శాఖ‌లిచ్చి.. మాకు ఉత్తిత్తి శాఖ‌లిస్తారా..? అనే చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతుంది.

12Vastavam.in (3)

సీఎం కొత్త మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించాడు. అంద‌రూ అనుకున్న‌ట్టు.. మంత్రుల శాఖ‌ల్లో ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌నుకున్నారు. హోం మంత్రి ప‌ద‌వి భ‌ట్టికి ఇచ్చి, ఆర్థిక శాఖ ఉత్త‌మ్‌కు ఇస్తారనుకున్నారు. కానీ అవేమీ జ‌ర‌గ‌లేదు. పాత వారి జోలికి పోలేదు. సీఎం ద‌గ్గ‌ర ఖాళీగా ఉడి ఉన్న శాఖ‌ల‌నే ఈ ముగ్గురికీ కేటాయించాడు. హోం ఉత్త‌మ్‌కు ఇవ్వ‌క‌పోతే వివేక్ ఇస్తారేమోన‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. వివేక్‌కు అప్రాధాన్య‌మైన కార్మిక సంక్షేమం, మైనింగ్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు సీఎం. అస‌లు వివేక్‌కు మంత్రి ప‌ద‌వే వ‌ద్ద‌ని సీఎం అడ్డుప‌డ్డాడ‌నే వార్త‌ల నేప‌థ్యంలో.. ఆయ‌న‌కు కేటాయించిన ప్ర‌యార్టీ లేని శాఖ‌ల‌ను చూస్తే ఇద్ద‌రి మధ్య ఉన్న గ్యాప్ నిజ‌మేన‌నిపిస్తోంది. ఇక ఓసీల‌కు మీకు ఇలా మాకు అలానా అనే చ‌ర్చ మొద‌లైంది.

ఆ మూడు శాఖ‌లు సీఎం వ‌ద్ద ఉంచుకుని.. ప్ర‌యార్టీలేనివే బీసీల‌కు ఇచ్చార‌ని గుర్రుగా ఉన్నారు కొంద‌రు. అయితే ఇంకో బీసీకి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని పీసీసీ చీఫ్ కోరిన నేప‌థ్యంలో మిగిలిన ముగ్గురిలో ఒక‌రికి మంత్రి వ‌స్తుందా..? వ‌స్తే ఆది శ్రీ‌నివాస్‌కే అయి ఉండాలి. లేదా బీర్ల అయిల‌య్య. వీరిలో ఒక‌రికి ఈ మిగిలిన మూడు కీల‌క శాఖ‌ల్లో ఒక‌టి ద‌క్కుతుందా..? స‌రే, అది అయిన‌ప్పుడు చూద్దాం.

 

ఇప్పుడు అస‌లు విష‌యానికొద్దాం.

బీసీ మంత్రులు ముగ్గురు. అందులో పొన్నం ప్ర‌భాక‌ర్‌కు బీసీ,ర‌వాణా, కొండా సురేఖ‌కు దేవాదాయ‌, అట‌వీ, ఇప్పుడు కొత్త బీసీ మంత్రి శ్రీ‌హ‌రికి స్పోర్ట్స్‌, యూత్‌.. ప‌శుసంవ‌ర్థ‌క శాఖ అంతే. మ‌రి ఓసీల‌కు సీఎం వ‌ద్ద హోం, మున్సిప‌ల్, విద్య‌, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి ఇరిగేష‌న్‌, సివిల్ స‌ప్లై, పొంగులేటికి రెవెన్యూ, మీడియా, కోమ‌టిరెడ్డికి రోడ్లు, భ‌వ‌నాలు, సినిమా, శ్రీ‌ధ‌ర్ బాబుకు ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ, తుమ్మ‌ల‌కు వ్య‌వ‌సాయం, జూప‌ల్లికి ఎక్సైజ్‌, టూరిజం…. ఇలా ఉన్నాయి శాఖ‌లు. అంటే మా బీసీల‌కు బ‌డుగులు, బ‌స్సులు, గుడులు, చెట్లు, బ‌ర్లు, గొర్లు, చేప‌లా….! ఇగో ఇప్పుడు న‌డుస్తున్న డిస్క‌ష‌న్ ఇదే.

You missed