(మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు)

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మార్పులు చేర్పుల‌పై ఉత్కంఠ‌త కొన‌సాగుతోంది. కొత్త‌గా ముగ్గురు మంత్రుల చేరిక‌తో శాఖ‌ల్లో మార్పులు అనివార్య‌మైంది. మార్పుల‌పై ప్ర‌త్య‌క్షంగా రాహుల్‌గాంధీ క‌స‌ర‌త్తు చేయ‌డం విశేషం. కొంద‌రి బ‌డా మంత్రుల శాఖ‌లు మార్చ‌నున్న‌ట్టు తెలుస్తోంది. త‌న‌కు హోం మంత్రిత్వ శాఖ కావాల‌ని మొద‌టి నుంచి డిమాండ్ చేస్తున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధిష్టాన వ‌ర్గం తీసుకోబోతున్న నిర్ణ‌యం ముందే తెలిసి అల‌క వ‌హించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల వివాద‌స్ప‌దంగా మారిన ఆర్థిక శాఖ నుంచి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ను మార్చి ఆ స్థానంలో ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని నియ‌మించాల‌ని అధిష్టానం నిర్ణయించిన‌ట్టు స‌మాచారం. ఎస్సీ వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌కు హోం మంత్రిత్వ శాఖ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది.

సాధార‌ణంగా, ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న‌వాళ్ల‌కు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వ‌డం ఒక ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. కానీ భ‌ట్టి విక్ర‌మార్క‌కు మొద‌ట్లో ఆర్థిక శాఖ కేటాయించి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి హోం మంత్రిత్వ శాఖ‌ను త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. ఆర్ధిక శాఖ‌లో బ‌హిరంగంగా క‌మీష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంద‌ని, భ‌ట్టి విక్ర‌మార్క‌శాఖ‌పై నియంత్ర‌ణ కోల్పోయార‌ని బ‌ల‌మైన విమ‌ర్శ‌లొచ్చాయి. ఈ క్ర‌మంలో ఆర్థిక శాఖ‌ను మార్చి సీనియ‌ర్ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిని నియ‌మించాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టాన వ‌ర్గం ఉంది. కానీ, నీటి పారుద‌ల శాఖ‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. నేవిలో ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న తన‌కు హోం మంత్రిత్వ శాఖ ఇవ్వాల‌ని మొద‌టి నుంచి ప‌ట్టుబ‌డుతున్నారు. మొద‌టి నుంచే ఈ శాఖ ప‌ట్ల‌, తన‌కు కేటాయించిన శాఖ ప‌ట్ల‌, త‌న‌కు ఇస్తున్న ప్రాధాన్య‌త ప‌ట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఒక ద‌శ‌లో ముఖ్య‌మంత్రిగా నెక్ టు నెక్ రేసులో ఉన్న ఆయ‌న‌.. హోం మంత్రిత్వ శాఖ ఇవ్వ‌క‌పోవ‌డం ప‌ట్ల త‌రుచు అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతున్నారు.

ఈ క్ర‌మంలో అస‌లుకే ఎస‌రు పెట్టిన‌ట్టు నీటి పారుద‌ల శాఖ కాద‌ని ఆర్థిక మంత్రిగా నియ‌మించే సూచ‌న‌లు క‌న‌బ‌డ‌టంతో ఆయ‌న మ‌రింత అసంతృప్తికి గుర‌వుతున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ నుంచి ఆయ‌న‌కు హ‌ఠాత్తుగా పిలుపు రావ‌డం సంచ‌ల‌నం రేపుతోంది. శాఖ‌ల మార్పుపై ఆయ‌న‌ను అధిష్టాన వ‌ర్గం బుజ్జ‌గించిన‌ట్టు.. ఏ ప‌రిస్థితుల్లో శాఖ‌ల‌ను మార్చాల్సి వ‌స్తుందో వివ‌రించిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి, కేబినెట్ మార్పుల‌పై సుధీర్ఘ స‌మ‌యం త‌రువాత రాహుల్ గాంధీ.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ప్ర‌త్య‌క్షంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. కేసీ వేణుగోపాల్‌, మీనాక్షి న‌ట‌రాజ‌న్ త‌దిత‌రుల‌తో ఆయ‌న స‌మాలోచ‌న‌లు జ‌రిపారు. ముఖ్య‌మంత్రి కూడా కొన్నిమార్పులు చేర్పుల‌పై సూచ‌న‌లు చేసిన‌ట్టు తెలుస్తున్న‌ది. వాస్త‌వానికి, కొత్త‌గా నియ‌మితులైన ముగ్గురు మంత్రుల నియామ‌కంలో రాష్ట్ర పార్టీ గానీ, ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మార్కు గానీ కనిపించ‌డం లేదు. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కొప్పుల రాజు సామాజిక స‌మీక‌ర‌ణ‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మంత్రి ప‌ద‌వులు కేటాయించిన‌ట్టు కాస్త లోతుగా ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

మ‌క్త‌ల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీ‌హ‌రి ముదిరాజ్ కూడా ఏఐసీసీ అధ్య‌క్షుడు, కర్ణాట‌క సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే కోటాలో నియ‌మితులు కావ‌డం, వివేక్ కూడా రాహుల్ కోటాలో రావ‌డం, మాదిగ కోటాలో అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ పేరు అనూహ్యంగా తెర‌మీద‌కు రావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఈ మంత్రివ‌ర్గ కూర్పులో రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చోటు ద‌క్క‌క‌పోవ‌డం ప‌ట్ల ఆ వ‌ర్గంలో తీవ్ర అసంతృప్తి నెల‌కొన్న‌ది. దీంతో పాటు మంత్రివ‌ర్గంలో ఎస్సీ, బీసీల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త‌నివ్వ‌డం, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌తో క‌లిపి ఐదుగురికి కేబినెట్‌లో స్థానం క‌ల్పించ‌డం, ఏడుగురు స‌భ్యులున్న బీసీల‌కు వివిధ ర‌కాలుగా ఐదు ప‌ద‌వులివ్వ‌డం ప‌ట్ల రెడ్డి సామాజిక‌వ‌ర్గం నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ఈ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ముఖ్య‌మంత్రితో పాటు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డిల‌కు కీల‌క శాఖ‌లున్న‌ప్ప‌టికీ, సంఖ్యాప‌రంగా అన్యాయం జ‌రిగింద‌ని, ఇంత‌టి ప‌రిస్థితి ఎప్పుడూ లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బోధ‌న్‌ ఎమ్మెల్యే సుద‌ర్శ‌న్‌రెడ్డి కూడా రాజీనామాకు సిద్ద‌మ‌య్యాడు. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శాఖ‌ల‌ను మారిస్తే మ‌రింత అసంతృప్తి చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

 

ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి కూడా రాహుల్‌గాంధీ స‌మావేశంలో కొంద‌రి మంత్రుల‌పై ఆరోప‌ణ‌ల విష‌యం ప్ర‌స్తావ‌న తెచ్చిన‌ట్టు రూఢీ కాని వార్తలు. ప్ర‌భుత్వం ఏర్పాటైనప్ప‌టి నుంచి రాహుల్ గాంధీ ముఖ్య‌మంత్రితో ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డం ఇదే మొద‌టిసారి. ఇప్పుడైనా ఆయ‌న క‌లిసిన ఫోటో బ‌య‌ట‌కు వ‌స్తుందా లేదా అనేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎందుకంటే మ‌హేశ్ కుమార్ గౌడ్‌తో పాటు చాలా మంది నాయ‌కులు రాహుల్‌గాంధీతో దిగిన ఫోటోలు ప్ర‌ముఖంగా ప్ర‌చురిత‌మ‌య్యాయి. ఆ మ‌ధ్య‌కాలంలో రేవంత్ రాహుల్ ను క‌లిసినాన‌ని చెప్పిన‌ప్ప‌టికీ ఫోటో బ‌య‌ట‌కు వెల్ల‌డి కాక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాహుల్ గాంధీ, ముఖ్య‌మంత్రి రేవంత్‌కు ప‌లు విష‌యాల్లో అంత‌రం ఏర్ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. బీసీల జ‌నాభా లెక్క‌లు, జ‌న‌గ‌ణ‌న‌, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ వంటి కీల‌క అంశాల‌పై విజ‌యోత్స‌వ స‌భ పెట్టాల‌ని రేవంత్ రెడ్డి … రాహుల్ గాంధీని ఆహ్వానించిన‌ప్ప‌టికీ ఆయ‌ను నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు.

కొత్త మంత్రుల ఎంపిక‌లో కూడా సీఎం ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్టు క‌నిపించ‌లేదు. ఇప్పుడు మార్పు చేర్పుల‌పై కూడా ముఖ్య‌మంత్రి కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన‌ట్టు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. వివేక్‌కు కీల‌క‌మైన శాఖ ఇచ్చే అవ‌కాశం ఉంది. వివేక్ మంత్రి ప‌ద‌వి కేటాయించిన త‌రువాత ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ లాంటి నాయ‌కుల‌ను క‌లిసిన త‌రువాతే ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌డం విశేషం. ఏది ఏమైనా మంత్రి వ‌ర్గంలో మార్పులు ఖాయంగా క‌నిపిస్తున్నాయి. ఈ మార్పులు చేర్పులు పార్టీలో ఎటువంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తుందో వేచి చూడాలి.