(దండుగుల శ్రీనివాస్)
ఎర్రజెండా పార్టీల కలర్ వెలిసిపోయింది. వాటి పరపతి మసకబారిపోయింది. అధికారంలో ఏ పార్టీ ఉంటే అ పార్టీకి బాగా ఊది నాలుగు ఫైరవీలు.. ఒక పదవి దక్కించుకుంటే చాలు.. ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జాగా బతికితే చాలు అనే కాడికి వచ్చాయి. అందుకే ఏ చార్జీలు పెరిగినా అవి రోడ్డెక్కడం లేదు. ఆఖరికి మద్యం ధరలు పెరిగినా. అదేందీ.. మద్యం ధరలు పెరిగితే ధర్నా చేయాలా..? అవును.. అదీ పేదోడి జీవితానికి భారమే. ఆ కుటుంబానికి తీరని పెనుభారమే. సరే,ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. బస్ చార్జీలు ఇలా పెంచారో లేదో.. కవిత కస్సున లేచింది.
బస్ భవన్ దగ్గర ధర్నా చేసింది. అరెస్టులు షరా మామూలే. ఇప్పుడు ఇది కాదు వార్త. ఆమె అలా సకాలంలో సత్వరం స్పందించడం ఆశ్చర్యం. ఆమెకిప్పుడు అది అవసరం కావొచ్చు. వేరు కుంపటి నేపథ్యంలో నాదే పైచేయి అని చెప్పుకునే ప్రయత్నం కావొచ్చు. మొన్నటి వరకు ముందటి కాళ్లకు బంధాలు తెంచుకున్న స్వేచ్ఛ కావొచ్చు. కానీ ఆమె చేసింది చాలా మంచి పనే. అసలు రాష్ట్రంలో ఏ ధరలు పెరిగినా ధర్నాలెందుకు చేయడం లేదు. గతంలో పెట్రోల్ ధర లీటర్కు పది పైసలు పెంచినా ఎర్రజెండా పార్టీలు ఎర్రటి ఎండను లెక్క చేయకుండా రోడ్డెక్కేవారు. ఇప్పుడది లేదు. కేసీఆర్ పాలనలో ఇవన్నీ మరిచిపోయాం. అలవాటు పడ్డాం. ఇప్పుడు అక్క మళ్లా పాత జ్జాపకాలు నెమరువేయిస్తోంది. ఎర్రజెండా పార్టీలకు చలనం కూడా తెస్తోంది. అంతా మన మంచికే.