(దండుగుల శ్రీనివాస్)
అప్పుడెప్పుడో చంద్రబాబు మాటలు గుర్తొచ్చాయి. ఆ రెండుకళ్ల సిద్ధాంతం చాలా రోజుల తర్వాత కవితక్క నోటి వెంట వినవచ్చింది. బాపు పార్టీ ఒక కన్నైతే..తన పార్టీ .. అదే జాగృతి మరోకన్ను అని డిసైడ్ చేసేసింది. అక్క మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఆమె చెప్పే మాటలకు చేసే చేష్టలకు అస్సలు పొంతన కుదరడం లేదు. ఇంతకు ముందు వాస్తవం చెప్పుకున్నట్టు … బీఆరెస్ టీమ్ పిచ్చోళ్లైపోతున్నారు. బీఆరెస్‌ను, కేసీఆర్‌ను తన ఒక కన్నుతో పోల్చితే ఆమె అంత బాహాటంగా పార్టీ పరువును బజారులో పెట్టే విధంగా ఎందుకు మాట్లాడాలె.
బీజేపీలో బీఆరెస్‌లో విలీనం విలీనం.. అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఎవరిని తగ్గిస్తున్నాయి…? తండ్రి డిసైడ్ అయితేనే కదా.. విలీనం అయ్యేది. మరి తండ్రి మాటకు ఎదురు తిరుగుతున్నదా..? అట్లయితే ఇంకా పార్టీనే ఎందుకు అంటిపెట్టుకుని ఉండాలె. సొంత పార్టీని వెంటనే ప్రకటించుకుని ఆ జెండాపై తిరుగొచ్చు కదా. తిరగలేదు. ముఖం చెల్లదు. తండ్రి ముందుండాలె. కానీ తండ్రిని పరోక్షంగా దెప్పిపొడస్తూ ఉండాలె. రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేయాలె.
కేసీఆర్ కు నోటీసులిస్తారా.? అయితే అది తెలంగాణ జనానికి ఇచ్చినట్టే.. జాతిపితనా మజాకా..? అని మాటల మజాకులు పేల్చిన కవిత… మరి లేఖ ఎవరికి ..? ఎందుకోసం రాసినట్టు..? లోపాలు, శాపాలు, పాపాలపైనే కదా లేఖ రాసింది. మరి ఇన్ని లోపాలకు, పాపాలకు కారణమైన కేసీఆర్ జాతిపితెట్లైతడు. ఓడిన దళపతి, ప్రజల తిరస్కరణకు గురైన మాజీ సీఎంకు నోటీసులు యావత్ తెలంగాణ ప్రజలకు ఎట్ల వర్తిస్తాయి..?? ఏంటో అక్క తిక్క తిక్కగా మాట్లాడుతున్నదనిపిస్తుంది కదా. నాకు కూడా. అందరికీ కూడా.