(దండుగుల శ్రీనివాస్)
ఆడు ఎన్ని తిట్టిండు. నీకెట్టా మనసొచ్చింది రామన్న. లోపలికెట్టా రానిచ్చివవే. అక్కని తైతక్క అన్నడు. బాపును పోశెట్టన్నడు. బావని అగ్గిపెట్ట మచ్చ అన్నడు. ఇగ నిన్నైతే రకుల్ రావు అంటు ఎన్ని రంకులు పెట్టిండే. ఆనితోని కలిసి మన ఇంటోళ్లను ఎట్ల తిట్టించి సంబరపడి సంకలు గుద్దుకున్నడే. ఆడొద్దన్నడని ఈడు నీకాడికొస్తే నువ్వు ఆనితో మంచిగా కూసుని ముచ్చటవెడ్తవ్ లే. ఇంత కన్నా ఘోరముంటదనే. ఏ ఊకో తమ్మీ… ఆనంతల ఆడే ఒచ్చిండు. ఇగ ఆనితోని కయ్యమని అవతలికొచ్చిండు కదా. అందుకే రానిచ్చినా. అందునా ఆడు బీసీ కార్డు మెడలేసుకుని తిర్గుతుండు సూసినవ్ కదా.
అయితే…. ఆన్ని నమ్మేదెవడే. ఆడో దొంగ. బ్లాక్‌మెయిలర్‌గాడు. ఆడు కాకపోతే ఈడని మాట్లాడతడు. ఈ గాడిది కాకపోతే ఆ గాదిదంటడు. ఏదో ఒక గాడిదెక్కి ఆని పని ఆడు చేసుకుంటడు. మనల్ని గాడిదల్ని చేస్తడన్నా. అరే ఊకోర్రి వయా.. వసుదేవుడసొంటోడు పోయి గాడిదకాళ్లు పట్టుకున్నడు. నేనేంత…? అంటే ఆడే గాడిదంటవ…? మరి నేనా..? అవునన్న ఆడు నిన్నే గాడిదను చేస్తడు చూడు. ఆడుకుని వాడుకుని నవ్వుల పాలు చేసుడు ఆనికి గాడిదపాలతో పెట్టిన విద్య. అన్న … అది సరే గానీ, ఆడు మనతానికొచ్చిండా…? మనం ఆనితానికి వోయినమా..? అరే ఇప్పుడు ఎవడు ఎవనితానికి పోతేందీ..?
అట్లకాదన్నా…. ఆడు మనతానికొచ్చిండు గాబట్టి ఆడే వసుదేవుడైతడు. మనమే గాడిదైతము. ఏందిరా ఊకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నవు.. ఆనితో కలిసింది పాపం ఆఖ్రికి నన్నే గాడిదను చేసివన్ లే. అవునన్న ఆడంటడు. ఆళ్లతోని కలిసింది బీసీల కోసం.. అందర్నీ కలుపుకుపోతే ఆ క్రెడిట్ నాకే దక్కుతదిని చూస్తుండు. అదే చెప్తడు. ఆఖ్రికి మనల్ని బక్రాల్నీ… కాదు కాదు గదేగాండ్లను చేస్తడే. నువ్వు జూడు. నేనే పోయి కల్సిన కాబట్టి నేనే వసుదేవుడ్ని.. ఆడే గాడిద అని కూడా ఆడు చెప్పకతిర్గకపోతే నా చెప్పుతో కొట్టు. అరే పోనియ్యురా వారీ… మన టైం బాగలేదు. బాపు చెప్పినట్టు టైం బాగలేనప్పుడు జర అందర్నీ కల్పుకపోవాలె. పొట్టు పొట్టు తిట్టినోన్ని… రెండుకాళ్లెత్తి పెక్క పెక్క తన్నినోడ్ని గూడ్కన. అరే అట్లంటే… ఇప్పుడు మన పార్టీలున్నోళ్లు అధికారంల మినిష్టరైనోళ్లు తుక్కు తుక్కు తిట్టలే. ఆళ్లని కల్పుకుపోలె. ఇది గంతేనన్నట్టు.
ఏమో అన్న ఈడు గాడిదన్నా… రెండు కాళ్లు ఎప్పుడు లేపి తంతడో తెల్వదు. ఎప్పుడు ఓండ్రపెట్టి బూడిదల పొర్లాడుతూ బూతులు తిడతడో నాకైతే తెల్వద్. సరే అవన్నీ తర్వాత సూస్కుందం తీయ్… ఇగ మళ్లీ తీయకు ఆ మల్లిగాని లొల్లి బంజెయ్.