కండిషన్స్ అప్లై.
ఇందూరు కాంగ్రెస్ లీడర్లు.. టీఆరెఎస్ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫరిచ్చారు. ‘ఏంటి ఆ ఆఫర్?’ ‘తాము టీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టబోం’ అని ప్రకటించారు. ‘అదేందీ? ఇప్పుడు ఇందూరులో ఏం ఎన్నికలొచ్చాయి? అసలు అభ్యర్థిని ఎందుకు నిలబెట్టమని అంటున్నారు? ‘ అర్థం కావడం లేదా?
తెలుసుకోవాలనుందా? అయితే ఇది చదవండి. పైన కండిషన్స్ అప్లై అన్నది అందుకే.
కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు (డీసీసీ) మానాల మోహన్‌రెడ్డి ఈ రోజు రూరల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించాడు. రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి అధ్యక్షతన ఇది జరిగింది. అందులో మానాల మోహన్ రెడ్డి ధైర్యం చేసి ఓ ఛాలెంజ్ విసిరాడు. అది ఏందంటే…. ‘నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ ను రాజీనామా చేయమ’ని కోరాడు. ‘ఆయన రాజీనామా ఎందుకు మధ్యలో’ అంటారా? హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామాతోనే కదా… అక్కడ ప్రత్యేక పాలన, ప్రత్యేక పథకాల అమలు జరుగుతున్నది. ఇక్కడా అలా జరగాలంటే ‘మీరు రాజీనామా చేయండి సారు..!’ అని బతిమాలాడు మోహన్‌రెడ్డి. మళ్లీ ఆయనే అన్నాడు. ‘నువ్వు రాజీనామా చేస్తే గెలవవని భయంగా ఉందా? అయితే మేము నీ పై అభ్యర్థిని నిలబెట్టం… నిన్ను గెలిపించుకుంటాం..’ అన్నాడు. కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టాడండోయ్. అవేమిటా? ఇవిగో..
‘దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలి.’
‘దళిత, గిరిజనులకు పదిలక్షల రూపాయలు దళితబంధు కింద అమలు చేయాలి’
‘దళిత,గిరిజనులకు డబుల్ బెడ్ రూంలు ఇప్పించాలి.’
’57 ఏండ్లకు కుదించిన వృద్ధాప్య పింఛన్‌ను దళిత, గిరిజనులకు ఇప్పించాలి.’
‘ఇవి చేస్తే చాలు.. మా రేవంత్‌రెడ్డి కాళ్లు పట్టుకోనైనా.. మా అభ్యర్థిని నిలబెట్టకుండా చేసి.. నిన్ను గెలిపించుకుంటా’మన్నాడు.
ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది.
మళ్లీ రాజీనామాల పర్వం తెరపైకి వచ్చింది. ఇది అందరికీ వర్తిస్తుంది. అలాగే నిబంధనలూ వర్తిస్తాయి.