సమన్యాయం.. సమానత్వం కోసం…!
దేశాన్ని విభజించే కుట్ర కాదు… దేశ సంపద సమానంగా పంచేందుకు..
కులగణన దేశానికి ఆదర్శం కానుంది…!
ఏ వ్యవస్థలో ఏ వర్గం ఎంతుంది..? ఎవరి వద్ద ఎంత ఆర్థిక సంపద ఉంది…?
వీటి లెక్కలే రేపటి భవిష్యత్తుకు నాంది పలికేలా పాలన…
అగ్రవర్ణాలకు నచ్చడం లేదు.. అందుకే వద్దన్నారు.. అయినా వినం.. చేసి చూపుతాం……
ఇప్పటికీ ఇంకా దళితులు అంటరానివారే… ఇంతటి వివక్ష ఇంకా కొనసాగుతోంది…!
ఓబీసీలు ఎంత మంది…? వారి జీవన స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ గణన ఎంతో ఉపయోగం..
కులగణనపై తన అంతరంగాన్ని ఆవిష్కరించిన రాహుల్ గాంధీ..!
రాష్ట్ర సర్కార్ పనితీరును మెచ్చుకున్న రాహుల్… కులగణన ఏర్పాట్లపై సంతృప్తి…
నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే.. .ఈ నెలాఖరుతో పూర్తి….!
(దండుగుల శ్రీనివాస్)
సమగ్ర కులగణన కోసం బుధవారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించనుంది సర్కార్. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపుగా ఈనెలాఖరు వరకు పూర్తి చేసి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది గవర్నమెంట్. రాహుల్‌గాంధీ దీనిపై మొదటి నుంచి పట్టుపడుతున్న నేపథ్యంలో.. ఇక్కడ నుంచే తొలిసారిగా కులగణనకు నాంది పలుకనున్న తరుణంలో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. అందుకే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా రాహుల్‌గాంధీని ఒకరోజు ముందుగా ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మేధావులు, కుల సంఘాల పెద్దలు, విద్యావేత్తలతో సమావేశమై దీనిపై మరింత లోతుగా చర్చించారు.
అనంతరం ఆయన మీడియాతో వచ్చిన పెద్దలతో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎప్పటి నుంచి రిజర్వేషన్లపై లొల్లి నడుస్తున్న తరుణం.. ఎవరికెంత వాటా కావాలో ఇతమిత్థంగా పాలకులు కూడా తేల్చలేని పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. దీనిపై చాలా క్లారిటీతో ఉన్నారని రాహుల్ గాంధీ మాటలను బట్టి తెలుస్తోంది. ఓ వర్గం అట్టడుగు స్థాయిలోనే మగ్గిపోతుంటే మరో వర్గం పెరిగి పెద్దదై పోతున్నది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అందిరికీ అన్ని ఫలాలు అందడం లేదు. బలమున్నోడిదే నడస్తుంది. కులమున్నోడిదో బలమన్నట్టుగా వ్యవస్థలు నడుచుకుంటున్నాయి. ఇకపై ఇలాంటి వ్యవస్థ ఉండొద్దని రాహుల్ కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడారు. దేశ విభజనకు పాల్పడుతున్నాడని మోడీ ఆరోపించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది విభజించడం కాదు.. దేశ సంపదను అందరికీ సమానంగా పంచేందుకు, అంతరాలను తొలగించి అందరికీ సమన్యాయం జరిపేందుకేనని క్లారిటీ ఇచ్చారు.
అగ్రవర్ణాలకు ఈ విషయం నచ్చడం లేదని కూడా ఆయన ఖరాకండిగా చెప్పేశారు. అందుకే వారు దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని, అయినా వెనక్కి తగ్గలేదని, దీన్ని ఇక్కడి నుంచి అంతటా చేసేలా ఒత్తిడి తెచ్చి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారాయన. ఇప్పటికీ దళితులు అంటరాని వారిగానే మిగిలిపోయారని, ఏ వర్గంలో ఎంతటి ఆర్థిక సంపద ఉందో తెలుసుకోవాలని, అప్పుడే ఆ వర్గాలకు మరింత సాయం చేసేలా , అభివృద్ధి పరిచేలా పథకాలు రూపకల్పన చేయడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందని రాహుల్ వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జనాభా ఎంత..? వారి రాజకీయ నేపథ్యం ఏమిటీ..? ఎందరికి ఉద్యోగాలున్నాయి..? చరస్తులు, స్థిరాస్తులు.. వారి జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి…? వీటన్నింటిపైనా కులగణన సర్వే సమగ్ర రిపోర్టును ఇవ్వనుందని, తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలవనుందని పేర్కొన్నారు.
ఇప్పటికే కులగణనకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసింది సర్కార్. బుధవారం నుంచి ఇంటింటి సర్వే చేపట్టి ఈ నెలాఖరులోగా పూర్తి చేయనుంది. సర్కార్ చర్యల పట్ల రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిని అభినందించారు. కుల వివక్షను రూపుమాపి, కులాల వారీగా లెక్కలు తెలుసుకుని ఆమే రకు వారి జీవన స్థితిగతుల ఆధారంగా జీవితాల్లో మార్పులు జరిగేలా చేయడం కోసమే ఈ కులగణన అనే కార్యక్రమమని ఆయన నొక్కి చెప్పారు. సమగ్ర ఆలోచనతో రాహుల్ మాట్లాడిన తీరు, అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.