టీవీ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ యాంకర్లందరూ సినిమాల్లో సరైన అవకాశాలు రావడం లేదని చెప్పాలి. తమ ప్రతిభతో వాక్చాతుర్యంతో కొద్ది రోజుల్లోనే టీవీ ప్రేక్షకులను కట్టిపడేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న చాలా ఫిమెల్ యాంకర్లకు వెండితెర ఎంట్రీ కలిసి రాలేదు. సినిమాల్లో ఒక్కఛాన్స్ కోసం వేచిచూసే తరుణంలో మంచి పాత్ర దొరకక ఏదో ఒక పాత్రతో సరిపెట్టుకున్న సందర్భాలే అధికంగా ఉన్నాయి. అయితే సైడ్ క్యారెక్టర్… లేదంటే ఐటం సాంగ్.. లేడీ టీవీ యాంకర్లకు ఇవే అవకాశాలొస్తున్నాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో చాలా మంది యాంకర్లు వెండితెర మీద వచ్చిన ఏ చిన్నపాటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. డైరెక్టర్లు సైతం టీవీ యాంకర్లను వ్యాంపు పాత్రలకు గానో, ఐటం సాంగ్‌లకు పనికొస్తారా? అనే కోణంలోనే చూస్తున్నారే తప్ప వారికి మంచి పాత్రల రూపకల్పన మాత్రం చేయడం లేదు. కారణాలేవైనా ఉండొచ్చు.. టీవీల్లో వీరు చేసే ప్రొగ్రాముల్లో వెకిలిచేష్టలు అధికమై అదే తమకు పాపులారిటీ తెచ్చిపెట్టిందనే భావనలో దీన్నే కొనసాగిస్తూ పోతున్న ఈ టీవీ యాంకర్ల విషయంలో ఇంతకు మించి మన డైరెక్టర్లు పెద్దగా ఆలోచించరేమో!
ఉదయభాను నుంచి మొదలుకొని ఇప్పటి తరం శ్రీముఖి వరకు ఎవరికి వారే తమదైన స్టైల్‌లో టీవీ యాంకర్లుగా సక్సెసయ్యారు. కానీ వెండితెర మీద తమ రాణింపును కొనసాగించలేక పోయారు. రానా లీడర్‌లో ఉదయభాను చేసిన ఐటం సాంగ్ క్లిక్ అయ్యింది. కానీ ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఐటం సాంగ్‌కు కూడా పనికిరాదనుకున్నారో.. ఆమే ఒప్పుకోలేదో తెలియదు. ఆ తర్వాత అనసూయ కూడా రంగస్థలంలో మాస్ క్యారెక్టరే చేసింది. రంగమ్మత్తగా గ్లామర్‌కు అధిక ప్రాధాన్యమున్న పాత్రనే చేసింది. రష్మీకి కూడా వరుసగా ఇలాంటి అవకాశాలే వచ్చాయి. తాజాగా శ్రీముఖి వెండితెర పై తన భవిష్యత్తును పరీక్షించుకునేందుకు ఎంచుకున్న క్రేజీ అంకుల్స్ తో ఆమెకు మున్ముందు ఇలాంటి పాత్రలకే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. యాంకర్ల గత చరిత్ర ఇదే చెబుతున్నది.
ఎక్కువ కాలం వెండితెర పై వెలిగిపోవాలనుకునే యాంకర్ల ఆశలకు డైరెక్టర్లు గండి కొడుతున్నారా? ఏదో ఒక అవకాశమని ఇలాంటి పాత్రలు చేసి వెండితెర పై నుంచి తొందరగా వీరే నిష్క్రమిస్తున్నారా?