మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌న‌కంటూ ఒక స్థానం సంపాదించుకునేందుకు బీజేపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ ప్ర‌జాక్షేత్రంలో దూసుకుపోతు వచ్చింది. కాంగ్రెస్ ఆ స‌మ‌యంలో స్త‌బ్దుగా ఉండి ఏమి చేయ‌లేక దిక్కులు చూస్తుఉంది. పీసీసీ ప్రెసిడెంట్ ఎవ‌రో తెలియ‌క కార్య‌వ‌ర్గ్యం, నాయ‌క‌త్వం అయోమ‌యంలో కొట్టుమిట్టాడింది. అయితే ఇప్ప‌డు ప‌రిస్థితి మారిపోయింది. పొలిటిక‌ల్ సీన్ రివ‌ర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి నియామ‌కం త‌ర్వాత ఆ పార్టీ దూకుడు పెంచింది. కొత్త కార్య‌వ‌ర్గం, కొత్త ప్ర‌ణాళిక‌ల‌తో ప్ర‌జాక్షేత్రంలో ఉనికిని కాపాడుకొని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదాను నిల‌బెట్టుకునేందుకు తండ్లాట మొద‌లు పెట్టింది. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ప్ర‌జా ఉద్య‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. పెట్రో నిర‌స‌న‌లు, రాజ్‌భ‌వ‌న్ ముట్ట‌డి విజ‌య‌వంత‌మ‌య్యాయి. భూముల వేలం అమ్మ‌కాల‌పై నిల‌దీత‌ల‌తో ప్ర‌భుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఐఏఎస్ అధికారుల‌నూ వ‌ద‌ల‌డం లేదు. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టి అక్ర‌మాల గుట్టు తేల్చే ప‌నిలో ముందు వ‌రుస‌లో ఉంది. భ‌విష్య‌త్ ఉద్య‌మాల కార్యాచ‌ర‌ణ కూడా ఆ పార్టీ కార్య‌వర్గంలో కొత్త ఊపును తీసుకు వ‌స్తున్న‌ది. నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల క‌ల్ప‌న, రుణామాఫి త‌దిత‌ర ప్ర‌భుత్వ హామీల అమ‌లు పై నిల‌దీసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ది. రూట్ లెవ‌ల్‌లో ఇంకా బ‌లోపేతం కావాల్సిన ప‌రిస్థితులు ఉన్నా.. మెల్ల‌మెల్ల‌గా పూర్వ వైభ‌వం దిశ‌గా పుంజుకునేందుకు అడుగులు వేస్తున్న‌ది