హుజురాబాద్‌లో దళితబంధను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నది సర్కార్. ఈనెల 16న సీఎం కేసీఆర్ లాంఛనంగా ఇక్కడ ప్రారంభించనున్నాడు. ఈలోగా అర్హులైన వారి జాబితాను రూపొందించారు అక్కడ అధికారులు. స్థానిక రాజకీయ ప్రమేయం సహజంగానే ఇక్కడ అధికంగా ఉంటుంది. అందులో ఎన్నికలు. పైలట్ ప్రాజెక్టు కింద 500 కోట్లు వచ్చి ఉన్నాయి. ఇక మన నాయకులు ఊకుంటారా? అనుచరులు, బంధువులు అంతా వచ్చి చేరారు జాబితాలోకి . దీంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
అసలు ఎవరు అర్హులో కూడా ప్రభుత్వం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. గవర్నమెంటు ఉద్యోగులు అర్హులు కాదని మాత్రం చెప్పింది. సొంతిల్లున్నా, కారు ఉన్నా ఈ పథకం వారికి వర్తించదు వాస్తవానికి. కానీ దీనిపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు సర్కారు. ఏ పత్రికలో కూడా ఈ నిబంధనలపై ఓ సమగ్రమైన కథనం ఇంత వరకు రాలేదు. ఎందుకు రాలేదు? అంటే ప్రభుత్వమే చెప్పడం లేదు. రహస్యాన్ని మెయింటెన్ చేస్తున్నది. ఎందుకు? హుజురాబాద్‌లో ఇది పైలట్ ప్రాజెక్టు కింద అమలవుతున్నది. వీలైనంతగా ఎక్కువ మందికి ఇది చేరాలి. రాజకీయంగా పార్టీకి మేలు జరగాలి.
500 కోట్లు సరిపోకపోతే మరో 500 కోట్లు కూడా ప్రభుత్వం ఇక్కడ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి అలాంటప్పుడు ఇక్కడ ఉద్యోగులా, అర్హులా కారా అనేది కాదు ప్రయార్టీ. వాళ్లు మనవాళ్లా కాదా? ఓట్లు వస్తాయా రావా? అనేది ఇంపార్టెంట్. ఈ అనర్హుల జాబితా రచ్చకెక్కడంతో , ఆందోళనకు దిగడంతో స్వయంగా కలెక్టరే రంగంలోకి దిగి .. ఇప్పటి వరకు జాబితాను రూపొందిచలేదని, ఎవరూ ప్రచారాలు నమ్మొద్దని ఆయన ప్రకటించే వరకు పరిస్థితి వచ్చింది. కలెక్టర్ వచ్చి చెప్పినా.. ఇంకెవరు వచ్చి చెప్పినా.. దళితబంధు జాబితా చాంతాడంత ఉంటుంది. అది కలకూరగంపలా ఉంటుంది. అనర్హులు, అర్హులు లెక్క ఉండదు. నిధులకు కొరత ఉండదు. అంతే మరి. పైలట్ ప్రాజెక్టు అంటేనే అంత. ఓట్ల ప్రాజెక్టు అది.