అతి మేధావిత‌నం అప్పుడ‌ప్పుడు ప‌ప్పులో కాలేసేలా చేస్తుంది. త‌ప్ప‌ట‌డుగులు వేయిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాగే బోల్తా పడ్డాడు. ఏదో అనాల‌నుకుని మ‌రెదో అని త‌ర్వాత నాలుక క‌రుచుకున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు హుజురాబాద్ టీఆరెస్ అభ్య‌ర్థిగా సీటు ఖ‌రారు చేసిన నేప‌థ్యాన్ని తీసుకుని దానిపై త‌న‌దైన శైలిలో కేసీఆర్‌కు కౌంట‌ర్ వేద్దామ‌ని మంచి ప్లానింగ్ వేశాడు. అర్వింద్ ఎత్తు వేస్తే టీఆరెస్ చిత్తు కావాల్సిందే. కానీ ఈ విష‌యంలో మాత్రం అర్వింద్ వేసిన ఎత్తు అత‌న్నే సెల్ఫ్‌గోల్ చేసింది. పాడి కౌశిక్ రెడ్డిని విల‌న్‌గా చూపాల‌నుకున్నాడు. కేసీఆర్ అన‌వ‌స‌రంగా అత‌న్ని హీరో చేశాడ‌ని నిరూపించాల‌నుకున్నాడు.

దేనికీ కొర‌గాని, ఎందుకూ ప‌నికిరాని కౌశిక్ రెడ్డికి ఆరేండ్ల కాల ప‌రిమితి ఉన్న ఎమ్మెల్సీ అనే పర్మినెంట్ ఉద్యోగ్యాన్ని ఇచ్చాడ‌ని, కానీ గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు మాత్రం ఓడిపోబోయే హుజురాబాద్ టీఆరెస్ అభ్య‌ర్థిగా నిల‌బెట్టాడని చెప్పాల‌నుకున్నాడు. పాపం ఎవ‌రిచ్చారో ఐడీయా గానీ స్క్రిప్ట్ బాగానే రాసుకున్నాడు. ఆడియో, వీడియో బాగానే వ‌చ్చింది. కానీ ఇక్క‌డే క‌థ అడ్డం తిరిగింది. అర్వింద్ అనుకున్న‌ది ఒక‌టి.. మ‌రీ అతిశ‌యోక్తికి పోవ‌డంతో మరోటైంది. గెల్లును అమాంతంగా లేపేశాడు. గొప్ప‌ ఉద్య‌మ కారుడిగా అభివ‌ర్ణించాడు. వంద‌ల కేసులు ఉన్నాయ‌ని కీర్తించాడు. ఓయూలో పీహెచ్‌డీ చేస్తున్నాడ‌ని కితాబిచ్చాడు.

ఇంత మంచి ఉద్య‌మ‌కారుడికి ఓడిపోయే సీటు ఇచ్చి, ప‌నికి మాలిన పాడి కౌశిక్‌కు ఆరేండ్ల ప‌ర్మినెంట్ ఎమ్మెల్సీ ప‌ద‌వినిచ్చాడ‌ని కేసీఆర్‌ను దునుమాడాడు. అయితే అన్యప దేశంగా, అనుకోకుండా, త‌న‌కు తెలియ‌కుండా.. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను ఆకాశానికెత్తాడు అర్వింద్‌. ఓడిపోబోయే సీటు అని ధ్రువీక‌రించాడు బాగానే ఉంది. ఇన్ని క్వాలిటీస్‌, ఇంత క్వాలిఫికేష‌న్ గెల్లుకు ఉంద‌ని త‌నే ప‌దే ప‌దే చెప్పిన‌ట్ల‌యింది. ఈ వీడియోను టీఆరెస్ శ్రేణులు త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ‘మా గెల్లు గురించి మావోళ్లే ఇంత బాగా చెప్ప‌లేదు.. అర్వింద్ నువ్వు ఎంత బాగా చెప్పావు. నీకు థ్యాంక్స్ అబ్బా..’ అని త‌మ కృత‌జ్ఞ‌త‌ను వెట‌కారంగ తెలియ‌జేస్తున్నారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఇది వైర‌ల్ అయ్యింది.

You missed