సినిమా థియేట‌ర్లు తెరిచినా తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. దాదాపు ప‌ద‌కొండు రోజులుగా థియేట‌ర్ల‌లో సినిమాలాడుతున్నాయి. కానీ 30శాతం కూడా జ‌నాలు వెళ్లి చూడ‌డం లేదు. దీంతో థియేట‌ర్ల య‌జ‌మానులు, డిస్ట్రిబ్యూట‌ర్లు నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకు జ‌నాలు రావ‌డం లేద‌నే విశ్లేషించుకుంటున్నారు. థ‌ర్డ్‌వేవ్ భ‌యం ఇంకా వెంటాడుతున్న‌ద‌ని, అందుకే భ‌యంతో జ‌నాలు రావ‌డం లేద‌ని స‌ర్ధి చెప్పుకుంటున్నారు. కానీ విచిత్రంగా ఆంధ్రాలో మాత్రం క‌లెక్ష‌న్స్ ఫుల్‌గా ఉండ‌డంతో తెలంగాణ మేనేజ్‌మెంట్‌కు అంత‌రార్ధం అంతుచింక‌డం లేదు.

మొన్న‌టి వ‌ర‌కు ఆంధ్రాలో టికెట్ రేట్ల గొడ‌వ జ‌రిగింది. మొన్న 30వ తారీఖు నుంచి థియేట‌ర్లు తెరిచినా త‌గ్గించిన రేట్ల‌తోనే ఆంధ్రాలో సినిమాలు న‌డిచాయి. రూర‌ల్‌, సెమీ అర్భ‌న్ ప్రాంతాల్లో నామిన‌ల్ రేట్లు పెట్టిన జ‌గ‌న్ సిటీలో మాత్రం ఎక్కువ రేట్ల‌కు అవ‌కాశం ఇచ్చాడు. కానీ రూర‌ల్ ఏరియాలో కూడా రేట్లు పెంచుకునేలా అవ‌కాశం ఇవ్వాల‌ని ఆంధ్రా థియేట‌ర్ల య‌జ‌మానులు జ‌గ‌న్ పై ఒత్తిడి పెంచాడు. ఈ నెల 6 నుంచి అక్క‌డ థియేట‌ర్లు బంద్ చేద్ధామ‌ని నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. కానీ జ‌గ‌న్ వారికి ఈ నెల 14, 15 తేదీల్లో భేటీకి అవ‌కాశం ఇవ్వ‌డంతో థియేట‌ర్లు కొన‌సాగిస్తున్నారు. కానీ అక్క‌డ క‌లెక్ష‌న్లు డ‌ల్‌గా ఏమిలేవు. ఫుల్‌గానే ఉన్నాయి.

కానీ తెలంగాణ‌లో అన్ని థియేట‌ర్లు తెర‌వ‌కున్నా.. కొన్ని థియేట‌ర్ల ద్వారానే షోలు ర‌న్ చేస్తున్న క‌లెక్ష‌న్లు మాత్రం సో సో గానే ఉన్నాయి. దీంతో నష్టాల్లోనే వీటిని న‌డిపిస్తున్నారు. హైద‌రాబాద్‌లో చాలా థియేట‌ర్ల‌లో షోలు ర‌ద్దు చేసుకుంటున్నారు. థ‌ర్డ్‌వేవ్ భ‌య‌ముంటే షాపింగ్ మాల్స్‌, హోట‌ల్స్‌లో కూడా ర‌ద్దీ త‌గ్గాలి క‌దా? కానీ త‌గ్గ‌డం లేదు. కానీ సినిమాల‌కే జ‌నం ఎందుకు రావ‌డం లేదు? ఓటీటీల‌కు అల‌వాటు ప‌డ్డారా? లేదు. ఓటీటీలు అంద‌రికీ అందుబాటులో లేవు. మ‌రి టాకీస్‌ల‌కు ఎందుకు రావ‌డం లేదు? అల‌వాటు త‌ప్పారా? అలాగే అనిపిస్తుంది. ఆంధ్రాలో మాత్రం టాకీస్‌లో సినిమా చూసే షోకు త‌గ్గ‌లేదు.

భారీ సినిమాలేమైనా వ‌స్తే జ‌నాలు టాకీస్‌ల‌కు వ‌స్తార‌ని తెలంగాణ సినీ ఇండస్ట్రీ భావిస్తుంది. ఇప్పుడు ఎస్సార్ క‌ల్యాణ మండ‌పం అనే సినిమా త‌ప్ప చెప్పుకోద‌గ్గ సినిమాలేమి లేవు. పెద్ద హీరోల సినిమాలొస్తే త‌ప్ప థియేట‌ర్ల‌కు పాత‌క‌ళ వ‌చ్చేలా లేదు. అల్లు అర్జున్ పుష్ప‌, వెంక‌టేశ్ ఎఫ్‌త్రీ, రౌడీబాయ్స్‌, పాగ‌ల్ సినిమాలు రావాల్సి ఉన్నాయి. ఇవీ వ‌స్తేనైనా జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు కావొచ్చు. కానీ థ‌ర్డ్‌వేవ్ గ‌నుక రంగ ప్ర‌వేశం చేస్తే థియేట‌ర్ల తెర చిరిగిన‌ట్టే.

You missed