(దండుగుల శ్రీనివాస్)
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా కవిత మహిళా లోకానికి ఇచ్చిన సందేశం ఆకట్టుకున్నది. ఆలోచింపజేసింది. అంతకు మించి ఆమె అందులో తన స్వీయానుభవాన్ని కూడా జోడించారు. ఈ మాటలు పరోక్షంగా అన్నా.. అవి ఆమె స్వయంగా జీవితంలో పడిన ప్రత్యక్ష అనుభవాలను, పాఠాలను మహిళాలోకం ముందుంచి.. జాగురుకత బోధించినట్టు అవగతమైంది వారికి. మామూలు స్పీచ్‌లాగా కాకుండా ఆమె చాలా విషయాలు తనదైన శైలిలో మాట్లాడారు. తన మనోభావాలను సూటిగా, సుత్తిలేకుండా, ఘాటుగా చెప్పడం ఆకర్షించింది. అసలు ఆమె ఏం మాట్లాడారు?
మహిళాలోకంలో చిన్నకులం, పెద్దకులం ఉండదన్నారు కవిత. పేద,ధనిక తారతమ్యాలూ ఉండవన్నారు. పురుషాధిక్య సమాజంలో అందరూ బాధితులేనని స్పష్టం చేశారు. చదవు, ధనం, కులంతో పని లేకుండా మగజాతంతా ఆడవారిని తెలివితక్కువగా చూస్తారని, వంటింటి కుందేలుగానే పరిగణిస్తారని ఆమె చెప్పుకొచ్చారు.ఓ భర్త, ఓ తండ్రి, ఓ అన్న.. అంతా తమను తెలివి తక్కువగా చూస్తారని ఆమె చెప్పినప్పుడు.. ఆమె స్వీయానుభవంలోని ఘటనలనే మహిళాలోకానికి వివరిస్తున్నట్టుగా అక్కడున్నవారికి తెలిసిపోయింది. చాలా మంది కూడా ఆమె వ్యక్తీకరించిన ఈ భావప్రకటనలో ఆంతర్యమేమిటో తెలుసుకోగలిగారు. ఆమె విషయానికొస్తే.. భర్తతో ప్రాబ్లెం లేదు.. కానీ పురుషలందరినీ జతకట్టి మాట్లాడారు. కానీ తన జీవితంలో తండ్రి, అన్న తనను తెలివితక్కువగా చూసి, అవహేళన చేసి తక్కువగా చూసే విధానాన్ని అనుసరించారని ఆమె చెప్పకనే చెప్పారు ఈ వేదికగా.

మన తడాఖా చూపాలని ఆమె మహిళా సమాజానికి కవిత పిలుపునిచ్చారు. విద్య, వ్యాపారం, ఉపాధి, వ్యాయామం, రాజకీయాలు, ఆర్థికబలోపేతంపై మహిళలు కచ్చితంగా దృష్టి సారించాలని ఆమె కోరారు. ఇంకా సమానమైన హక్కులు రాలేదని, అప్పటి వరకు మహిళా జాతికి రావాల్సిన హక్కులు, రిజర్వేషన్లు, చట్టాల జోలికి ప్రభుత్వాలు వెళ్లొద్దని హితవు పలికారు. రాజకీయాల్లో మహిళలంతా రాణించాలని, తమ శక్తిని సమాజానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. స్టాండ్ విత్ హర్ కాదు.. గివ్ హర్ స్పేస్ అని ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి చురకలంటించారు. కాంగ్రెస్ సర్కార్‌లో మహిళలపై నేరాలు పెరిగిపోయాయని, సర్కార్ ఏం చేస్తున్నదని ప్రశ్నించిన ఆమె… మాకు మీరు చేసేది మెహర్బానీ కాదు.. బాధ్యత..అది గుర్తెరిగి నడుచుకోండని సీఎంకు హితవు పలికారు కవిత.
అంతకు ముందు ఆమె పలు ఇంటర్వ్యూలలో తన స్టాండ్‌ను మరింత బలంగా వినిపించారు. సర్కార్ తోనే కాదు.. పైన మోడీతో, ఇక్కడ డాడీతో కూడా తన పోరాటం ఉంటుందని ప్రకటించారు. మానసికంగా హింసించారని కూడా కుటంబ సభ్యుల గురించి చెబుతూ వచ్చిన ఆమె.. ఇవాళ ఏకంగా తన తండ్రి, అన్న కూడా తెలివితక్కువ దాన్నిగా తనను చూశారనే విషయాన్ని ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. అందుకు ఆమె ఈ వేదికగా తన స్వీయానుభవాన్ని ఇలా టూకీగా చెప్పినా.. ఘాటుగానే వివరించారు. అందుకే ఇక్కడ కులాలతో సంబంధం లేదన్నారామె. ఆర్థికంగా బలంగా ఉన్నా.. మహిళలకు ఈ అవహేళనలను, అవమానాలు కామన్‌గా జరుగతూనే ఉన్నాయని, దానికి నిదర్శనం తన జీవిత పాఠాలేనని ఆమె నర్మగర్బంగా చెప్పారామె.
