(దండుగుల శ్రీ‌నివాస్‌)

ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల అట్టుడికింది. ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాల‌కు క‌విత బాస‌టగా నిలిచారు. పందుల దొడ్డిలో వేసిన‌ట్టు బాధిత ఆడ‌బిడ్డ‌లంద‌రినీ అక్క‌డే ఉన్న అంబేద్క‌ర్ భ‌వ‌న్‌లో కుక్కేసింది స‌ర్కార్‌. అక్క‌డికి వెళ్లి చూసిన క‌విత మ‌న‌సు చ‌లించింది. స‌ర్కార్‌పై ఆమె విరుచుకుప‌డింది. క‌నీసం మెడిక‌ల్ క్యాంపులు ఏర్పాటు చేయ‌కుండా, భోజ‌న వ‌సతి క‌ల్పించ‌కుండా స‌ర్కార్ వారిని హీనంగా చూస్తున్నద‌ని మండిప‌డ్డారు. ఒక్క ఆడ‌బిడ్డ ఏడిస్తేనే ఆ ఇళ్లు బాగ‌ప‌డ‌ద‌ని ఆమె ప‌రోక్షంగా కేసీఆర్ , ఆ కుటుంబంపై దుమ్మెత్తి పోసిన క‌విత‌.. ఇంత మంది ఆడ‌బిడ్డ‌ల‌ను ఏడిపిస్తున్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు, ఖ‌మ్మం నాయ‌కుల‌కు త‌గ‌ల‌క‌పోద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేటీఆర్‌ను కూడా ప‌రోక్షంగా ఆమె తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల బాధ‌లు ఇలా చూసి ప‌రామ‌ర్శించి వెళ్లిపోయిన కేటీఆర్‌కు వీళ్లు ఓ ఎగ్జిబిష‌న్‌లా క‌నిపిస్తున్నార‌ని అన్నారు. గ‌తంలో బీఆరెస్ చేసిన పాపాల‌ను క‌డుక్కోవాల‌ని చూస్తున్న‌ద‌ని వారి త‌ప్పిదాల‌ను ఈ సంద‌ర్భంగా ఆమె ప్ర‌స్తావించారు.

త‌ను రావ‌డం ఆల‌స్య‌మైనా.. ఎక్క‌డున్నా పేద‌లు, బాధితుల ప‌క్షానే నిల‌బ‌డ‌తాన‌ని, ఇక్క‌డ స‌మ‌స్య ప‌రిష్కారం కాకుండా వెళ్లేదేలేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఎక్క‌డైతే పేద‌ల ఇళ్లు కూల్చేశారో.. అక్క‌డే వారికి తిరిగి స్థ‌లం ఇచ్చి, ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌పై ఆమె బాధితుల‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌కు ర్యాలీగా వెళ్లారు. అక్క‌డ చౌర‌స్తాపై ధ‌ర్నాకు దిగారు. క‌లెక్ట‌ర్ వ‌చ్చి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చే వర‌కు క‌దిలేది లేద‌ని భీష్మించుకుని కూర్చోవ‌డంతో పోలీసులు రంగం ప్ర‌వేశం చేశారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితుల మ‌ధ్య క‌విత‌ను, జాగృతి నాయ‌కుల‌ను, త‌దిత‌రుల‌ను బ‌ల‌వంతంగా అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించారు.

లేడీ పోలీసులు లేకుండా క‌విత‌ను అరెస్టు చేసి తీసుకెళ్ల‌డం ప‌ట్ల జాగృతి నాయ‌కులు, అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు డౌన్ డౌన్ అంటు నినాదాల‌తో ఆ ప్రాంతం హోరెత్తింది. అయినా బ‌ల‌వంతంగా వారంద‌రినీ అరెస్టు చేసి పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. జాగృతి ఆందోళ‌న‌తో ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల అట్టుడికిపోయింది. అనంత‌రం ఆమె మాట్లాడుతూ.. త‌మ పోరాటం వివిధ రూపాల్లో భ‌విష్య‌త్తులో ఇంకా కొనసాగుతూనే ఉంటుంద‌ని, ప్ర‌భుత్వం దిగి వ‌చ్చి భూనిర్వాసితుల‌కు న్యాయం చేసేదాకా పోరాడుతామ‌న్నారు. ఇవాళ జాగృతి చేసిన పోరాటంతో స‌ర్కార్ పై ఒత్తిడి పెంచిందని భావిస్తున్నామ‌న్న ఆమె.. భూదాన్ భూములు క‌చ్చితంగా పేద‌ల‌కు పంచాల్సిన భూములేన‌ని, అవి వారికి తిరిగి ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. భ‌విష్య‌త్ పోరాటాల‌పై ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంటామ‌న్నారు.

స‌ర్కార్‌లో క‌ద‌లిక వ‌స్తుందా? ఏం చ‌ర్య‌లు చేప‌డుతుంది? ఇంత వ్య‌తిరేక‌త వ‌చ్చినా ఇంకా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టే మొండిగా వెళ్తుందా? చూడాలి.