(దండుగుల శ్రీనివాస్)
పదవీ వ్యామోహం రక్త సంబంధాన్నీ కాదన్నది. అధికార దాహం మమకారాన్నీ మైమరపింపచేసింది. ఒక్క సీఎం సీటు… ఓ తండ్రిని, ఓ అన్నను కర్కశులుగా మార్చింది. కఠినాత్ములుగా తీర్చిదిద్దింది. నిజస్వరూపమిదేనని నిగ్గు తేల్చింది. రాజకీయం కోసం, కుర్చీ కోసం ఎంతదాకైనా పోతాం.. అనేదాకా తెచ్చింది. వేదికలెక్కి ఎన్ని నీతి సూత్రాలు వళ్లెవేసినా.. డెబ్బై వేల పుస్తకాలు చదివి పండితుడనని తనకు తాను భుజకీర్తులు తగిలించుకున్నా .. తనదాకా వస్తే ఇదిగో ఇలా ఉంది పరిస్థితి. పండితుడు పామరుడికన్నా అద్వానంగా ఆలోచిస్తాడు. కారణజన్ముడని కీర్తికండూతి ప్రదర్శింపజేసుకునే ఆ తండ్రి.. కన్నబిడ్డెనే బలిపెడితే ఏమనాలి? తెలంగాణ తెచ్చింది నేనేనని జాతిపితగా బిరుదాంకితుడుగా గుర్తింపు పొందేందుకు తహతహలాడే ఆ పితామహుడిని ఏమని పిలవాలె? ఫాదర్ ఆఫ్ తెలంగాణ.. గుడ్ ఫాదర్ కాలేకపోయాడు. సీఎం సీటు కోసం పగటికలలు కంటు చెల్లెను దూరం చేసుకుని, అడ్డుతొలగించుకుని..ఆమెపై పరోక్ష, ప్రత్యక్ష దండయాత్రకు దిగిన అన్న చరిత్రలో బ్యాడ్ బ్రదర్‌గా మిగిలిపోయాడు.
అందుకే వీరిద్దరికీ ఇవాళ్టి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నది వాస్తవం.
ఇంట గెలవలేదు కానీ రచ్చ గెలుస్తానని బయలుదేరాడు కేసీఆర్. ఎందుకు? కొడుకుకు రాష్ట్రం అప్పగించి తాను జాతీయ రాజకీయలు వెలగబెడదామని. ఇక్కడ బంగారు తెలంగాణ చేసేసి… బంగారు పల్లెంలో తెలంగాణను కేటీఆర్‌కు అప్పగించేసి తన రాజకీయ జీవిత చరమాంకం అలా ఢిల్లీలో గడిపేద్దామనుకున్నాడు. పార్టీలో తెలంగాణ పేరే లేకుండా చేసేశాడు. తానేం చేసినా వెర్రి గొర్రెలు తెలంగాణ ప్రజలు పెద్దాయన సూపర్ అని కోరస్ ఇస్తారనుకున్నాడు. మితిమీరిన అతి విశ్వాసం, పుత్రోత్సాహం.. ఉన్న నమ్మకాన్ని పోగొట్టింది. తెచ్చుకున్న అధికారాన్ని దూరం చేసింది. ఈ క్రమంలోనే కవిత రాజకీయంగా బలైంది. తండ్రిని కంట్రోల్ చేసేందుకు కేంద్రానికి ఆమె ఓ పావైంది. లిక్కర్ స్కాం పేరుతో తండ్రిని కంట్రోల్ చేసేందుకు.. ఎక్కడికక్కడ నిలువరించేందుకు బిడ్డెను బలిపశువును చేశారంతా. ఓ ఆడబిడ్డ మానసికక్షోభకు కారకులయ్యారంతా.
ఇంత జరిగినా.. తండ్రి మారాడా లేదు. ఆయన చదువుకున్న మూర్ఖుడిలా.. కొడుకును సీఎం చేయాలనే యావలో బిడ్డెను దూరం చేసుకున్నాడు. ఆమె కొడుకుకు అడ్డుగా మారుతుందని లెక్కలేసుకున్నాడు. అయుత చండీయాగాలెన్ని చేసినా.. దేవుడు ఆయన పక్షం లేడనే అనుమానం ఉంది కాబోలు.. బిడ్డే అడ్డనుకున్నాడు. ఆమెను నిలువరిస్తే.. అణిచేస్తే.. కనబడకుండా చేస్తే….. ఒక కొడుకుకు తిరుగులేదనుకున్నాడు. తన జీవితాశయానికి రూట్ క్లియర్ అవుతుందని అంజనమేసుకున్నాడు. అందుకే కవితను అక్కడ జైలు గోడల మధ్య బందీ చేసినట్టుగానే విడుదలైన తరువాతా రాజకీయ బంధీగా మార్చాడు. జనానికి దూరం చేశాడు. అపవాదులను బలపర్చాడు. కన్న కూతురిని అవమానపరిచే రాక్షస క్రీడలు యథేచ్చగా సాగుతున్నా.. మౌనమనే ఆజ్యమే పోశాడు. మేకవన్నె పులే అయ్యాడు కన్నబిడ్డె విషయంలో. అంతా కొడుకు కోసం. మరీ ఇంత దారుణమా? అని దగ్గరున్నా వాళ్లే నోళ్లు వెళ్లబెట్టేలా.
తండ్రిని మించిన తనయుడు .చెల్లెను దూరం చేసుకోవడానికి ఇదే మంచి తరుణమనుకున్నాడు. సీఎం కావాలన్న కాంక్షకు చెల్లెనే అడ్డు అనే అనుమానం అతగాడినీ పీకుతోంది. నిద్రలేకుండా చేస్తోంది. ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆలోచనలూ ఒక్కటయ్యాయి. ఇద్దరి మధ్యా ఆమె దూరమైంది. దూరం చేశారు. కుటుంబానికి. జనానికి. అందరికీ. ఇదే అనుకున్నారు. అమలు చేశారు. తెలంగాణ తెచ్చిన అని రొమ్ము విరుచుకు విర్రవీగే పితామహుడు…పదేళ్లూ ఇక్కడి ప్రజలను ఏలిన ఏలిక… ఓ వైపు! ఇక రాబోయే రోజుల్లో నాదే తెలంగాణ…నేనే సీఎం.. నాకే పదవి. నా తరువాత నా కొడుకుకు.. అని లెక్కలేసుకుని చుక్కల్లో చంద్రుడిలా పగటి కలలు కనే ఫ్యూచర్ లీడర్ మరొకవైపు! ఆమెను బలిపెట్టారు. ఇంటి ఆడబిడ్డెకే న్యాయం చేయలేకపోయారు. న్యాయం మాటటుంచి… అవమానించారు. బలిపెట్టారు. బర్బాద్ చేద్దామనే పన్నాగం పన్నారు. మరి రాష్ట్రంలోని మహిళా లోకానికి ఏం మెసేజ్ ఇస్తారు.. ఇచ్చారీ ఇద్దరూ!
