(దండుగుల శ్రీనివాస్)
ఏమాటకామాటే. అర్వింద్ తను అనుకున్న లక్ష్యానికి రెండు సార్లు చేరువయ్యాడు. కానీ ఆ లక్ష్యాన్ని ముద్దాడలేకపోయాడు. దురదృష్టం వెంటే ఉంది.అతనిలో మిడిసిపడే అహంకారం లాగే. అదృష్టం ముఖం చాటేసింది..అతని వ్యవహార శైలితో అందరూ అతనికి దూరమైనట్టే. అందుకే ఒంటరిగా ఎంత పోరు చేసినా.. గెలుస్తున్నాడు. కానీ పీఠం దరి చేరడం లేదు. దక్కించుకోవడం అసంభమనే తేలుతోంది ప్రతీసారి. ఇక మూడోసారి ఇదే రిపీట్ కాదు. ఇంకా ఘోరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీకి లేనప్పుడు ఇంచుమించు ఇన్నే సీట్లు గెలిచిన అర్విందు.. ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నా.. అవే సీట్లు గెలుచుకున్నాడు. అంటే ఇక్కడ పార్టీ పెరిగిందనుకోవాలా? దాని ఉనికి కొంచెం తగ్గిందనుకోవాలా? ఏదనుకున్నా… కాంగ్రెస్ కంటే బలంగానే ఉందని మాత్రం తేలింది. కానీ ఇదే పరిస్థితి మళ్లీ వచ్చేనాటికి ఉండబోదు.
అయితే, అర్వింద్ బీజేపీని పెంచుకుంటూ వచ్చినమాట వాస్తవమే. అది తన సోషల్మీడియా ద్వారా కావొచ్చు. మన మేయర్..మన ఇందూరు అని హిందుత్వ భావన పెంచి… రెచ్చగొట్టే దోరణే కావొచ్చు… అధికార పార్టీ లోపాలు, మైనస్లను ప్రజల ముందుంచేందుకు వాడే పదాలు,వ్యంగ్యాస్త్రాలు,బూతులు .. ఏవైనా కావొచ్చు.. బీజేపీని సజీవంగా ఉంచుతూ వచ్చాడు. తన స్ట్రాటజీ తను అమలు చేసుకుంటూ ఎవరినీ కేర్ చేయకుండా పోయే దోరణి కొంత కలిసి వచ్చినా.. చాలా మందిని దూరం చేసింది ఆ పార్టీకి. దీంతో ఇలా లక్ష్యాన్ని ముద్దాడే దాకా పోయి.. వీర మరణం పొందినట్టుగానే ఫలితం పునరావృతం కావడం. ఏదేమైనా.. నిజామాబాద్లో బీజేపీని బలంగా ఉంచడంలో అర్వింద్ సక్సెసయ్యాడు.
కానీ మేయర్ పీఠం ఎక్కించేక్రమంలో మన మేయర్.. మన ఇందూరు నినాదమో… ఇందూరుగా పేరు మార్చుతా అనే శపథమో పనిచేయలేదు పెద్దగా. పైగా అర్వింద్ వల్ల పార్టీకి ఎంత ప్లస్ అయ్యిందో.. అతని వల్లే పార్టీకి అంతకు రెట్టింపు నష్టమూ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీని.. అర్వింద్ బీజేపీగా పిలుస్తున్నారు. ఇది ఎంతకాలమో కాలమే చెప్పాలి. అప్పటి వరకు కట్టర్ బీజేపీవాదులు ఓపిగ్గా ఎదురు చూస్తున్నారు. అణచబడ్డ శక్తులు సమయం కోసం కాచుక్కూర్చున్నాయి.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
