(దండుగుల శ్రీ‌నివాస్‌)

క‌విత ఒంట‌రి. సొంత అన్న కాదు పోమ‌న్నాడు. పొగ బెట్టి బ‌య‌టకు సాగ‌నంపాడు. కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డెను దూరం చేసుకున్నాడు. ఆమె ఒంట‌రిగానే పోరాడుతున్న‌ది. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. తండ్రి కేసీఆర్‌.. అన్న రామ‌న్న‌, బావ హ‌రీశ్‌రావు.. కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేసిందామె. తుక్కు తుక్కు తిడుతున్న‌ది. అవినీతిని ఎండ‌గ‌డుతున్న‌ది. బాగోతాల‌ను బ‌య‌ట‌పెడుతున్న‌ది. ప‌నిలో ప‌ని అధికార పార్టీని క‌డిగేస్తున్న‌ది. నేను ఎవ‌రికీ విన‌ను. న‌న్ను తెర వెనుక ఉండి ఎవ‌రూ న‌డిపించ‌డం లేదు. నేను జ‌నం వ‌దిలిన బాణాన్ని, ఎవ‌రో వ‌దిలిన బాణాన్ని కాదు.. అంటూ ప‌దే ప‌దే చెబుతూ వ‌స్తున్న క‌విత వెనుక‌.. క‌న్నారావు ఉన్నాడు.

అవును, సొంత అన్న కాదు పొమ్మ‌న్నా… పెద్ద‌నాన్న.. అంటే కేసీఆర్ అన్న రంగారావు కొడుకు క‌ల్వ‌కుంట్ల క‌న్నారావు కవిత‌కు అండ‌గా నిలిచాడు. అన్నీ తానై ముందుకు న‌డిపిస్తున్నాడు. ఆది నుంచి క‌న్నారావుది డిఫ‌రెంట్ మెంటాలిటీ. కేసీఆర్ సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ ఎప్పుడూ బ‌య‌ట‌కు రాలేదు. పెద్ద‌గా వార్త‌ల్లో నిల‌వ‌లేదు. త‌న వ్యాపారాలేవో త‌ను చేసుకుంటూ ఉండేవాడు. నేప‌థ్యం మాత్రం గ్యాంగ్‌స్ట‌ర్‌గా చెప్పుకుంటారు. ఒకానొక ద‌శలో న‌యీంను కూడా బెదిరించాడ‌ని ఓ ఇంట‌ర్వ్యూలో త‌నే చెప్పుకొచ్చాడు. త‌ను ఎవ‌రికీ విన‌ని, త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతాన‌ని కూడా చెప్పాడు. కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌ను ఇద్ద‌రినీ గ‌డ్డి ప‌ర‌క‌లా తీసి పారేసిన్ట‌టే మాట్లాడాడు చాలా సంద‌ర్బాల్లో. త‌ను అప్పుడే కేసీఆర్‌కు ప‌క్క‌లో బ‌ల్లెంలా ఉండేవాడు. కానీ తెర ముందుకు వ‌చ్చేవాడు కాదు.

ఇప్పుడు ఆ క‌న్నారావు .. క‌విత‌కు అన్నీ తానై నిలిచాడు. ఆర్థిక‌,అంగ బ‌లంగా తాను క‌విత‌ను , ఆమె వెళ్తున్న మార్గాన్ని బ‌లోపేతం చేసేందుకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. ఇప్పుడు ఆయ‌నే ఆమెకు ఒక సైన్యం. అంతలా ధైర్యాన్ని, ధీమాను కూడా అందిస్తున్నాడు క‌న్నారావు. క‌విత ఇప్పుడు ఏది మాట్లాడిన జ‌నం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఆమె ఒక్కొక్క‌టిగా బీఆరెస్ నేత‌ల అవినీతిని బ‌య‌ట‌పెడుతూ వ‌స్తున్న‌ది. అధికార పార్టీ కాంగ్రెస్ క‌న్నా.. ఈ క‌విత దెబ్బ‌కే బీఆరెఎస్ ఇజ్జ‌త్ ఖ‌చ్రా అవుతోంది. కేసీఆర్‌కు మాన‌సిక క్షోభ‌నే మిగుల్చుతున్న‌ది క‌విత‌. ఆ పార్టీని మ‌రింత డ్యామేజీ చేసేలా ఆమె వ్యాఖ్య‌లుంటున్నాయి. త్వ‌ర‌లో రాజ‌కీయ పార్టీ ఖాయ‌మ‌ని, తాము పోటీలో ఉంటామ‌ని కూడా చెబుతున్న ఆమెకు క‌న్నారావు అన్ని విధాలుగా అండ‌దండ‌లందిస్తున్నాడు. అందుకే ఇప్పుడే ఆమె ఏ పార్టీకి స‌పోర్టుగా మాట్లాడ‌టం లేదు. త‌న పంథా త‌ను ఎంచుకుని ముందుకు సాగుతున్న‌ది. రానున్న కాలంలో ఆమెకున్న ప్ర‌జాబ‌ల‌మే ఆమెను ఎటువైపుకు తీసుకువెళ్తుందో తెలియ‌జేస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు క‌న్నారావు స‌పోర్టుతో ఆమె మ‌రింత దూకుడుతో రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఓ ముద్ర వేసుకునే ప‌నిలో ఉన్న‌ది.

Dandugula Srinivas

Senior jOURNALIST

7661066999