(దండుగుల శ్రీనివాస్)
కొండంత రాగం తీశారు.. తుర్రుమన్నరు. లేస్తే మనిషిని కానన్నాడు. లేచినట్టే చేసి మళ్లీ ఫామ్‌హౌజ్‌లనే పన్నడు. కేసీఆర్ ఏం చేసినా ఏదేదో వ్యూహమే అయి వుటుందని గులాబీలు గుడ్డిగా నమ్మారు షరా మామూలుగా. ఎందుకంటే ఆయనే అన్నాడు కదా.. నేను కొడితే మాములుగా ఉండదని. అలాంటిదేదో చేస్తాడేమోనని భ్రమపడ్డారు యథావిధిగా. కానీ అక్కడ వ్యూహం లేదు. తొక్కా లేదు. ఆ వ్యూహమే పెద్ద తొక్కలో వ్యూహం.. అన్నట్టుగా ఉంది. అవును.. కేసీఆర్ చేసింది.. పాటించింది.. ఆదేశించింది.. అమలు చేసింది.. అంతా అట్లనే ఉంది. మొత్తంగా కేసీఆర్ తొక్కలో వ్యూహం వల్ల.. హరీశుడి పలాయనవాదంతో అసెంబ్లీలో బీఆరెస్ జీరో అయితే.. రేవంత్ హీరో అయ్యాడు.
కృష్ణా జలాల నీటి వాటాల విషయంలో మొదలైన వివాదం నువ్వంటే.. నువ్వు.. అనే రేంజ్లో సాగుతోంది. వాస్తవానికి ఇది జనం పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వివాదం విషయంలో ఏ పార్టీ ఏం చేసింది? ఎవరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు? ఎవరు రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టారు? అనే టాపిక్ ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ వివాదానికి అసెంబ్లీ నుంచి క్లారిటీ వస్తుందనుకున్నారు. కేసీఆర్ కూడా ఇంతింత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కాబట్టి.. చూద్దాం ఎవరేమి చెబుతారో? అని ఎదురు చూశారు. కానీ జరిగేందేమిటీ..? వచ్చే వచ్చే వచ్చే.. ఇగ వచ్చె చూడు.. వచ్చిండు సూడరా ఎదురు లేని వీరుడు.. అని పెద్ద పెద్ద రాగాలు తీసి.. ఒకరోజు వచ్చి అటెండెన్స్‌లో సంతకం చేసి.. కనీసం సంతాపాల తీర్మానాలు అయ్యే వరకు ఉండకుండా తుర్రుమన్నాడు కేసీఆర్. గులాబీలు పెట్టుకున్న ఆశలన్నీ తుస్సుమన్నాయి. వారి భ్రమలపై నీళ్లు జల్లి మీవి భ్రమలే.. నిజాలు కావని తేల్చి చెప్పాడు పెద్దసారు మరోసారి.
ఇక హరీశుడి పలాయనవాదం మరింత సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేసంది గులాబీ పార్టీని. వాదనాలు ఇంకా పూర్తి కాకముందే.. తన వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేయకుండానే ఆదిలోనే చేతులెత్తేయడం మరింతగా పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టేసింది. ఆది నుంచి అధికార పార్టీదే పైచేయిగా నిలుస్తూ వచ్చింది. కేసీఆర్ వ్యూహం.. అసలు దాన్ని వ్యూహమనే అనొద్దు. ఎందుకంటే.. అహంకారం ఇంకా వీడని వారి ప్రవర్తన, వ్యవహార శైలికి దృశ్యరూపమనే చెప్పాలి. అందుకే అక్కడంతా వారు ఫెయిల్ అయ్యారు. జనాల ముందు మరోసారి ఫూల్ అయ్యారు.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
