(దండుగుల శ్రీ‌నివాస్‌)

స్వాతిముత్యం సినిమాలో పాపుల‌ర్‌పాట స‌రిగ్గా క‌విత‌కు న‌ప్పుతుంది. అక్క‌డ రాముడిని న‌మ్ముకున్న సీత‌ను వ‌దిలేసి వెళ్లిన ఉదంతంలో రాసుకున్న పాట‌… ఇక్క‌డ తండ్రీ, అన్న క‌విత‌ను అనాథను చేసి త‌మ అధికారంలో పొత్తు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌క గెంటేసిన వైనానికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఆ పాట‌లో అస‌లేముంది..? అండా దండా ఉండాల‌ని కోదండారాముని న‌మ్ముకుంటే.. గుండే లేని మ‌నిష‌ల్లే నిను కొండా కోన‌ల కొదిలేశాడా? … ఇక్క‌డ ఇద్ద‌రు క‌విత‌ను బ‌య‌ట‌కునెట్టేశారు ద‌యాదాక్షిణ్యాలు లేకుండా. అహంకారంతో. అధికారం కోసం తండ్రి కేసీఆర్‌. అన్న కేటీఆర్‌. అగ్గీలోనా దూకి పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు.. నెగ్గేవ‌మ్మా ఒక‌నాడు .. నింగి నేల నీ తోడు…! అచ్చంగా క‌విత కూడా ఇట్ల‌నే మాట్లాడింది. అవును.. తాను కేసీఆర్ మీద చేసిన ఆరోప‌ణ‌లు, పార్టీ విధానాల‌ను ఎండ‌గ‌ట్టిన వైనం అచ్చంగా నిజాలేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. త‌నను ఒంట‌రిని చేసి అనాథ‌లా మార్చినా.. ఇప్పుడు వ్య‌క్తిగా వెళ్లి.. మ‌ళ్లీ శ‌క్తిగా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి వ‌స్తాన‌ని కూడా ధీమాగా శ‌ప‌థం చేసిందామె.

నిండ స‌భ‌లో కంట త‌డి పెట్టి ఆమె మాట్లాడిన మాటలు అంద‌రినీ క‌దిలించాయి. క‌ళ్లు చెమ‌ర్చేలా చేశాయి. నిజంగా ఆమె మాట‌ల్లో ఎక్క‌డా నాట‌కీయ‌త లేదు. రాజ‌కీయం లేదు. ఓ అమ్మ‌త‌నం ఉంది. ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడే ప‌సితనం ఉంది. ఆత్మాభిమానం మెండుగా ఉన్న వ్య‌క్తిలోని నిజాయితీ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ చెట్టు కిందే సేద తీరాన‌నే విశ్వాస‌మూ ఉంది.. ఆ చెట్టు ఎలా కుళ్లిపోయి స‌మాజానికి హాని త‌ల‌పెడుతోందో చెప్పే క్ర‌మంలో వ‌చ్చే భావోద్వేగ‌మూ క‌నిపించింది. ఎక్క‌డా క‌ట్టుక‌థ‌ల్లేవు. మ‌రెక్క‌డా అబ‌ద్దాల జాడ లేదు. అంతా సూటిగా.. ఘాటుగా.. నిక్క‌చ్చిగా.. ఆమె మాట‌లు అక్క‌డ తూటాలే అయ్యాయి కొంద‌రికి. అవి న‌గ్న స‌త్యాలేన‌ని తేలిపోయింది జ‌నానికి.

పాల‌కు పాలు నీళ్ల‌కు నీళ్లు వేరు చేసింది క‌విత‌. కేసీఆర్‌కు బిడ్డెగా. ఆమె పిల్ల‌ల‌కు త‌ల్లిగా, కేటీఆర్‌కు చెల్లెగా, జాగృతికి పెద్ద దిక్కుగా ఆమె అన్ని పాత్ర‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పోషించి మాట్లాడింది ఉన్న‌దున్న‌ట్టుగా. క‌విత మాట‌ల్లో క‌నిక‌ట్టు లేదు. ఆక‌ట్టుకునే ప్ర‌సంగ‌మే ఆసాంతం. ప్ర‌తీ ప‌లుకూ కదిలించే నేప‌థ్య‌మే. పార్టీల‌క‌తీతంగా క‌ళ్లు చెమ్మ‌గిల్లేలా చేసిన ఆమె నిజాయితీని శంకించాల్సిన ప‌నిలేదు. ఎవ‌రికి కూడా.

Dandugula Srinivas

Senior Journalist

7661066999

You missed