(దండుగుల శ్రీనివాస్)
కవిత ఇప్పుడు క్లారిటీగా ఉంది. స్పష్టమైన రాజకీయ లక్ష్యాన్ని ఎంచుకుంది. బీఆరెస్ నుంచి సస్పెండయిన తరువాత ఆమె తన స్టాండ్, లైన్ తీసుకోవడంలో తడబడింది. తండ్రి నీడను కాదని బతకనేమోనని అనుకున్నది. ఆయన సపోర్టు లేకుండా మనలేమోనని కూడా భయపడ్డది. కానీ మెల్లగా అందులో నుంచి బయటపడ్డది. అసలు తను బయటకు రావడానికి, స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఎంచుకుని .. రాజకీయ పార్టీ పెట్టాలనుకోవడం.. ఇదంతా కేసీఆర్ వల్లే ఆమె చేయగలిగింది. ఎందుకంటే పరోక్షంగా కవితను రెచ్చగొట్టి, అవమానించి, నిర్లక్ష్యం చేసి..పట్టింపులేకుండా వదిలేసి…అంతా కొడుకు కొడుకు అంటూ జపం చేయడమే దీనికి కారణం. అందుకే మెల్లగానైనా..కాస్త లేటుగానైనా.. అందరూ తిట్టిన తరువాతనైనా ఇప్పుడామె మేల్కొన్నది. గోడ మీద పిల్లి వాటం వదిలింది. క్లారిటీతో ఉన్నది. స్పష్టమైన స్టాండ్‌తో రాజకీయం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె పట్ల కాస్త జనానికి ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆమె భవిష్యత్తులో పెట్టబోతున్న పార్టీకి అంతో ఇంతో మనుగడ ఉంటుంది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటారా? ఆమె కేసీఆర్‌ను ఈకలెక్క తీసిపారేసింది. తండ్రీ గిండ్రీ జాన్తానై అంటున్నది. కేసీఆర్ గీసీఆర్ ..అయితే నాకేంటి అంటున్నది. అవును అసలు ఆయన్ను తండ్రి అని సంబోధించడం మానేసింది. మాజీ సీఎంగా కూడా గుర్తించడం లేదు. ఉద్యమకారుడు అనే అంటున్నది. తెలంగాణ తీసుకురావడంలో కీలక భూమిక పోషించాడనే చెపుతున్నది. అంత వరకే. అలాంటి ఉద్యమకారుడిని అన్ని మాటలంటాడా? అని రేవంత్‌ను అర్సుకున్నదామె. అంతే కాదు.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంపై ఆమె ఖుల్లం ఖుల్లా బీఆరెస్ నడి బజారులో నిలబెట్టినంత పనిచేసింది. ఆయనేమన్నా తప్పు చేశాడా? అని నిలదీసింది. చేశాడు కాబట్టే రాలేకపోతున్నాడనే అర్థం వచ్చేలా ఇన్‌డైరెక్టుగా మీడియాతో మాట్లాడుతున్నది. ఆయన రాకపోతే ఇప్పటికే చావు బతుకుల మధ్య ఉన్న పార్టీ… మరింక చచ్చి ఊరకుంటుందని కూడా కరాఖండిగా చెప్పేసింది. పిల్లకాకులకు అసెంబ్లీలో మాట్లాడే చాన్స్ ఇస్తే జనం ఎవరూ వినరని తన ఆగ్రహాన్ని వెలుబుచ్చింది.
అవును.. మరి కవితకు కోపం రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. సమంజసమే ఆమె అలా మాట్లాడటం. ఎందుకంటారా? తనను తుక్కు తుక్కు తిట్టిన వాళ్లంతా కేసీఆర్ చంకలోనే ఇంకా ఉన్నారు. పల్లికిలిస్తూ ఆయన పక్కనే కూర్చుకుంటున్నారు. ఇది సరిపోదంటూ.. పదవులు కూడా వచ్చి పడుతున్నాయి వారికే. ఇంక తండ్రీ గిండ్రీ ఏంటండీ? కేసీఆర్..గీసీఆర్ ఛల్ ఎవరైతే నాకేంటీ? అని ఇక ఆమె విరుచుకపడుతున్నది. ఏకి పారేస్తున్నది. నిజాలు నిగ్గు తేల్చుతున్నది. బీఆరెస్ నేతల గుండెల్లో బాంబులు పేల్చుతున్నది. ఆ పార్టీని చీల్చి చెండాడుతున్నది. తండ్రికి మనసున పట్టకుండా చేస్తున్నది. ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో అని దాశరథి చెప్పినట్టుగా… తను సీఎం కావడానికి, తన కొడుకును ఇప్పుడు సీఎం చేయడానికి ఎంతో మందిని బలిపెట్టిన కేసీఆర్‌కు ఈ గతి పట్టాల్సిందే. మా పాపం ఊరికే పోదు అని తెరవెనుక నుంచి కూడా కేసీఆర్ బాధిత సంఘం శాపనార్ధాలు పెడుతున్నది. కవితకు మద్దతుగా నిలుస్తున్నారు వారంతా.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
