(మ్యాడం మధుసూదన్
సీనియర్ పాత్రికేయులు)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు ముక్కలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. మూడు కార్పొరేషన్లపై ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ మేరకు పునర్విభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న శాసన సభ ముందుంచనుంది. మరోవైపు జీహెచ్ఎంసీ మినహా మిగితా పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్దం చేసుకున్నది. పోలీస్ కమిషనరేట్ల మాదిరిగా మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మూడు మున్సిపల్ కార్పొరేషన్‌లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చాలా విశాలంగా ఉండనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 150 డివిజన్లు, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో 76, మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో 74 డివిజన్లు ఉంటాయి.
ఔటర్ రింగురోడ్డు ఇవతల, అవతల మొత్తం 2071 చదరపు కి.మీ వరకు విస్తరించి ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌ను ప్రస్తుత పోలీస్ కమిషనరేట్ల మాదిరిగా విభజిస్తున్నారు. కానీ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో కలపాలని నిర్ణయించడం కొంత వివాదానికి దారి తీసే పరిస్థితి ఉంది. ఎందుకంటే.. జీహెచ్ఎంసీ పరిధిలో మూసీ నది దక్షిణాన ఉన్న నాలుగు జోన్లతో పాటు సికింద్రాబాద్, గోల్కోండ జోన్లుంటాయి. సైబరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లుంటాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లుంటాయని అధికారులు వెల్లడించారు. ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న జోన్లను, తక్కవుగా ఉన్న జోన్లను కొన్ని కలిపి కొత్త కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా జీహెచ్ఎంసీ పునర్విభజనలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లు ఉంటాయి.
ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా శాటిలైట్ మ్యాప్‌ల ఆధారంగా ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను చేసి తుది రూపునిచ్చింది. దీనికి అధికారిక ముద్ర వేయడానికి అవసరమైన లాంఛనాలను పూర్తి చేస్తున్నది. పట్టణ, మున్సిపల్ ఎన్నికల తరువాత మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహించనున్నప్పటికీ, పునర్వవ్యవస్థీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చకచకా పూర్తి చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా నిరూపించుకున్నతరువాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు నిర్వహించాలా? లేక ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలా?? అనే విషయంపై అధికార పార్టీలో ఇంకా స్పష్టత కనిపించడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సర్పంచులను గెలవలేకపోయామనే అసంతృప్తి కొంత అధికార పార్టీలో ఉంది. ఇప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పట్టణ, మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు సవాల్‌గా మారనున్నాయి.
