(దండుగుల శ్రీనివాస్)
ఉద్యమకారుల పాలిట అసలు దయ్యం కేసీయారే. అవును.. ఈ మాట పరోక్షంగా అన్నది ఆయన బిడ్డే కవితనే. ఆయన పాలనలో ఉద్యమకారులు ఎంతటి గోసను అనుభవించారో ఆమె మరోసారి గుర్తు చేసింది. 1200 మంది తెలంగాణ ఉద్యమంలో అసులుబాస్తే.. కేసీఆర్ 540 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చి ఆదుకున్నాడని, మిగిలిన వారిని గాలికొదిలేశాడని పరోక్షంగా కేసీఆర్ సర్కార్పై దుమ్మెత్తిపోసిందామె. సెక్రటేరియట్లోకి ఉద్యమకారులను రానీయలేదని, మధ్యలో పెత్తనం ఇచ్చిన కొందరు ఉద్యమకారులను అవమానించి, బెదిరించారని కూడా బయటపెట్టిందామె. బుధవారం కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఆమె తెలంగాణ ఉద్యమకారులతో కలిసి భూ పోరాటానికి శ్రీకారం చుట్టింది. కాంగ్రెస్ సర్కార్ తన మ్యానిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 250 గజాల జాగాను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమె ఈ ఉద్యమానికి పూనుకున్నది. అయితే పనిలో పని ఆమె తన తండ్రి గవర్నమెంటును దునుమాడింది.
కేసీఆర్ దేవుడే.. ఆయన చుట్టే దయ్యాలున్నాయి… కవిత తన తండ్రికి రాసిన లేఖ బయట పెట్టిన తరువాత ఆమె చేసిన వ్యాఖ్యలివి. తరువాత ఆమె ఒక్కొక్కరిగా దయ్యాల లిస్టు బయటపెడుతూ వచ్చింది. ఒక్క కేసీఆర్ తప్ప.. తన అన్న కేటీఆర్ దాకా ఆమె దయ్యం లిస్టులో చేర్చి మరి తిట్టడం ప్రారంభించింది. ఆరోపణలు గుప్పిస్తున్నది. ప్రశ్నిస్తున్నది. నిలదీస్తూ వస్తున్నది. ఇప్పుడు ఈ ఉద్యమకారుల విషయంలో తన తండ్రినే అసలు దెయ్యం చేసింది పరోక్షంగా. అంటే ఇప్పుడక్కడ దేవుడెవరూ లేరు. అన్నీ దయ్యాలే అన్నట్టు. కేసీఆర్తో సహా. మొన్నటికి మొన్న తను తండ్రి నీడ నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన ఆమె… ఇకపై తండ్రి ఫోటోను కూడా వాడుకోవడం లేదని తేల్చి పారేసింది. ఎప్పుడైతే తనపై కేసీఆర్కు దగ్గరగా ఉన్నవారి దండయాత్ర చేయడం ప్రారంభిచారో.. మళ్లీ వాళ్లే కేసీఆర్ చంకలో చేరి ఇకిలిస్తూ కనిపిస్తున్నారో.. ఆమె అగ్గిమీద గుగ్గిలమైంది. ఇక కేసీఆర్ను కూడా వదలడం లేదు. ప్రాజెక్టుల దగ్గర నుంచి నీటా వాటాల దాకా.. సంక్షేమ పథకాల అమలు తీరు నుంచి గులాబీ లీడర్ల అవినీతి బాగోతాల దాకా.. దేన్నీ దేన్నీ వదలడం లేదు. మధ్యలో అధికార పార్టీని ప్రశ్నిస్తూనే.. ఒత్తిడి తెస్తూనే.. తను మాత్రం గులాబీ బాస్ను, ఆ పార్టీని, ఆ పార్టీ లీడర్లను టార్గెట్ చేసింది. ఎవరినీ వదలడం లేదు. అన్న, తండ్రి.. ఇప్పుడు వీరు కూడా లిస్టులో చేరిపోయారు. దీంతో ఇప్పుడు బీఆరెస్లో దేవుడెవరూ లేరు.. అన్నీ అన్నీ దయ్యాలే. ఆ పార్టీ ఇప్పుడు దయ్యాల కొంప అన్నట్టు.. కవిత భాషలో చెప్పాలంటే.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
