(మ్యాడం మ‌ధుసూద‌న్‌
సీనియ‌ర్ పాత్రికేయులు)

ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌ప‌డానికి క‌దం తొక్కుతున్న‌ది. మ‌రి ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌లతో పాటు గ్రేట్ అండ్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతాయా..? అంటే చాలా మంది జ‌రుగుతాయ‌నుకుంటున్నారు. కానీ, ప్ర‌స్తుత ప‌రిస్థితిని నిశితంగా ప‌రిశీలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో జ‌రిగే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ప‌ట్ట‌ణ‌, మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత ఫ‌లితాల‌ను బ‌ట్టి జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు క‌ద‌న రంగంలోకి దూకే అవ‌కాశం క‌నిపిస్తున్న‌ది. అది కూడా ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల త‌రువాత‌నే వెళ్లాల‌నే ఒక ఆలోచ‌న ఉంది. ఈ లెక్క‌న మ‌రో ఆరు నెల‌ల వ‌ర‌కు గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు.

ఫిబ్ర‌వ‌రి 10తో గ‌డువు ముగుస్తున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాల‌న‌లోకి వెళ్ల‌నుంది. స్పెష‌ల్ ఆఫీస‌ర్ ఎవ‌ర‌య్యా అంటే.. దాదాపుగా మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిస్తున్న మంత్రి, స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డే కావ‌డం గ‌మ‌నించద‌గ్గ విష‌యం. అంటే.. పాల‌క మండ‌లి గ‌డువు ముగియ‌గానే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో సూప‌ర్ ప‌వ‌ర్‌గా ముఖ్య‌మంత్రికి అవ‌కాశం ఉంది. ఈ సువ‌ర్ణ‌వ‌కాశాన్ని త‌న పార్టీకి, ప్ర‌భుత్వానికి అనుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అప్పుడే స‌న్నాహాలు ప్రారంభించారు. మొద‌టిసారిగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి .. ఇక త‌న ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ, స‌మీక్ష‌లు నిరంత‌రం ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఆద‌ర్శ న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి అన్ని కోణాల నుంచి ప్ర‌య‌త్నాలు జ‌ర‌గాల‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు.

మొద‌ట స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాల‌న‌లో కొంత‌కాలం పాటు న‌గ‌రంలో వినూత్న‌మైన త‌ర‌హాలో అభివృద్ధిని చేప‌ట్టి, త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక మార్కును ఏర్పాటు చేసుకుని, న‌గ‌రాన్ని కాంగ్రెస్‌కు ప‌టిష్ట‌మైన వేదికగా మార్చాల‌ని ముఖ్య‌మంత్రి భావిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రో నెల, నెల‌న్న‌ర‌లో ప్రస్తుత పాల‌క మండ‌లి గ‌డువు ముగియ‌గానే గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌ర‌హాలో ప్ర‌త్యేక అధికారుల పాల‌న‌ను పూర్తి స్థాయిలో స‌ద్వినియోగ ప‌రుచుకోవాల‌ని భావిస్తున్నారు. నిజానికి గ‌త కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ ఎక్కాదుక్కా క‌లిసి గెలిచి దాదాపుగా ఉనికినే కోల్పోయింది. బీజేపీ 48 స్థానాల్లో గెలిచి అధికార పార్టీ బీఆరెస్‌కు గ‌ట్టిపోటీనిచ్చింది. మ‌జ్లిస్ త‌న స్థానాల‌ను నిల‌బెట్టుకున్న‌ది. ఇక, ఆ త‌రువాత జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో 22 సీట్ల‌లో గ‌ల్లంతైంది. త‌రువాత జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌ల‌లో విజ‌య ప‌తాకాన్ని ఎగుర‌వేసింది. మరికొంత మంది ఎమ్మెల్యేల‌ను అరువుకు తెచ్చుకుంది.

బీఆరెస్‌లో ఉండీ, కాంగ్రెస్‌కు అనుబంధంగా ప‌నిచేస్తున్న ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌ల‌లో ఇంకా స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. మ‌రో వైపు చిన్నాభిన్న‌మైన కిందిస్థాయి క్యాడ‌ర్‌ను ప‌టిష్టం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. స్పెష‌ల్ ఆఫీస‌ర్ పాల‌న ప్రారంభం కాగానే, అనుబంధ ఎమ్మెల్యేలు, అస‌లు ఎమ్మెల్యేలంద‌రూ క‌లిసి బీఆరెస్ క్యాడ‌ర్‌ను, బీజేపీ క్యాడ‌ర్‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుని ముందుకు పోవాల్సిన ప‌రిస్థితి కాంగ్రెస్‌కు ఉంది. ముఖ్య‌మంత్రి ప్ర‌త్య‌క్ష ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అవ‌స‌ర‌మైన చోట్ల రోడ్లు, ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిలు, పెద్ద పెద్ద వంతెన‌లు, ప్ర‌జ‌ల‌కు మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌డం ద్వారా విజ‌యానికి బాట‌లు వేసుకోవ‌డానికి ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల‌లో ఓట‌ర్ల స్పంద‌న న‌గ‌రంతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల‌లో ప్ర‌జాక‌ర్ష‌క ప‌థ‌కాలు, స‌బ్సిడీ సంక్షేమ ప‌థ‌కాలు తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. కానీ న‌గ‌రానికి వ‌చ్చే స‌రికి ఆ ప‌రిస్థితి మారుతుంది. గ‌తంలో వైఎస్ఆర్, కేసీఆర్ పాల‌న‌ను ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో హైద‌రాబాద్‌లో జ‌రిగిన అభివృద్ధిని చూసి న‌గర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడికి క‌ష్ట‌కాలంలో కూడా అండ‌గా నిలిచారు. ప్ర‌త్యేక తెలంగాణ ఏర్పాటైన త‌రువాత కూడా, టీఆరెస్ ప్ర‌భంజ‌నంలో న‌గ‌ర ఓట‌ర్లు టీడీపీ, బీజేపీ కూటమికి అధిక స్థానాలు క‌ట్ట‌బెట్టారు.

వైఎస్ఆర్ పీరియ‌డ్‌లో కూడా ఆయ‌న చేసిన అభివృద్ధిని చూసి రెండ‌వ సారి ప‌ట్టంగ‌ట్టారు. కేసీఆర్ స‌ర్కార్ కూడా ఇదే విధంగా న‌గ‌ర ప్ర‌జ‌లు పూర్తి అండ‌గా నిలిచారు. కానీ, రెండేళ్ల‌లో న‌గ‌రంలో త‌న‌కంటూ ఓ ముద్ర‌ను వేయ‌లేక‌పోయింది. ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌లో రెండు ఉప ఎన్నిక‌ల‌లో గెలిచి కొంత ఉనికిని నిలబెట్టుకుంది. కానీ ఇంకా పాత‌, కొత్త నాయ‌కుల క‌ల‌యిక‌, క్యాడ‌ర్‌లో ఐక్య‌త‌, నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం సాధించాల్సి ఉంది. చాలా మందికి సందేహం రావొచ్చు. ఎందుకు ప్ర‌భుత్వం ఇంత హ‌డావుడి చేస్తుంద‌ని. కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో చేప‌ట్టేబోయే స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (స‌ర్) కోసం కొన్ని లెక్క‌లు, స‌రిహ‌ద్దుల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంది కాబ‌ట్టి మ‌రీ హ‌డావుడి చేశారు. ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ గ‌డువు ముగిసినందున అక్క‌డ నిధులు రాబ‌ట్టేందుకు ఎన్నిక‌ల‌కు సిద్ద‌ప‌డుతున్నారు. కానీ జీహెచ్ఎంసీలో ఆ ప‌రిస్థితి లేదు. ఆరు నెల‌ల త‌రువాత కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించే వెసులుబాటు ఉండ‌టం కూడా ప్ర‌భుత్వానికి క‌లిసి వ‌స్తుంది.

ఇక‌, మూడు క‌మిష‌న‌రేట్లు, మూడు కార్పొరేష‌న్లు..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ మ‌రింత గ్రేట‌ర్‌గా మారింది. ఆరు జోన్లు, 30 స‌ర్కిళ్లు అన్న‌ట్టు ఉన్న గ్రేట‌ర్ ప‌రిధి 60 స‌ర్కిళ్లు, 300 డివిజ‌న్లుగా మారింది. 12 జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బాధ్య‌త‌లు చేప‌ట్టారు. హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ స్థాయి గ్లోబ‌ల్ సిటీగా మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా న‌గ‌రాన్ని విస్త‌రించిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో 650 చ‌ద‌ర‌పు కి.మీ విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసీ ప‌రిధి ఇప్పుడు ఎకాఎకిన 2053 చ‌ద‌ర‌పు కి.మీల‌కు విస్త‌రించింది. జీహెచ్ఎంసీని ఉన్న 27 మున్సిపాలిటీల‌ను, కార్పొరేష‌న్ల‌ను విలీనం చేసి మ‌హాన‌గ‌రాన్ని అతిభారీ న‌గ‌రంగా మార్చారు. ఈ మొత్తం ప‌రిధిని పోలీస్ క‌మిష‌న‌రేట్ల మాదిరిగా పున‌ర్విభ‌జించాల‌ని ప్ర‌భుత్వం దాదాపుగా ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో ఉన్న ప్రాంతాల‌న్నీ హైద‌రాబాద్ కార్పొరేష‌న్‌గా, సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని ప్రాంతాల‌న్ని సైబ‌రాబాద్ కార్పొరేష‌న్‌గా, రాచ‌కొండ ప‌రిధిలో ఉన్న ప్రాంతాల‌న్నీ మ‌ల్కాజిగిరి కార్పొరేష‌న్‌గా మారుస్తున్నారు. ఇక ప‌ట్ట‌ణ మున్సిప‌ల్ ఎన్నిక‌లు మేలో జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీకైతే ఇప్ప‌ట్లో క్లియ‌రెన్స్ రాదు.