(దండుగుల శ్రీనివాస్)
పదేండ్లు సీఎంగా చేసిన అనుభవం ఉన్నా.. కేవలం రాజకీయం కోసం కొన్ని చవకబారు ఆరోపణలు చేయడం కేసీఆర్ పై ఉన్న కాస్త గౌరవం కూడా పోయింది. మొన్నటి దాకా కేటీఆర్ నోటి వెంట వచ్చిన 420 హామీలు .. అనే ఆరోపణల మాట కేసీఆర్ కూడా చేసిండు. రాజకీయంగా లబ్ది కోసం కాంగ్రెస్ సర్కార్‌ను ఇరుకున పెట్టి.. ఇబ్బంది పెట్టి .. జనం ముందు దోషిలా నిలిపాలని కేసీఆర్ చూశాడు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న వాదన… కేసీఆర్ పాలనలో 8 లక్షల కోట్లు అప్పయ్యిందని. అందుకే ఇచ్చిన హామీలు సకాలంలో కొన్ని నెరవేర్చలేకపోయామని. కానీ కేసీఆర్ చెప్పినట్టుగా 420 హామీలేమీ జనాలకివ్వలేదు ఆనాడు కాంగ్రెస్ పార్టీ.
సరే, ఇప్పుడు అసలు ముచ్చటకొద్దాం.. ప్రెస్‌మీట్లో అన్నీ మాట్లాడిన కేసీఆర్ తను చేసిన 8 లక్షల కోట్ల అప్పుల గురించి ఎందుకు మాట్లాడలేదు. ఇకపై మాట్లాడడు కూడా. ఎందుకంటే .. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని కేసీఆర్‌కు తెలుసు. అందుకే సర్కార్ హామీలు అమలు చేయడంలో ఫెయిలైందని చెప్తూ జనం ముందు దోషిలా నిలపాలనే ప్రయత్నమే తప్ప.. నిజంగా తెలంగాణ సమాజం బాగు కోరేవాడైతే.. ఇక్కడి జనం కష్టపడకుండా, ఇబ్బందులు పడకుండా చేసే వాడైతే.. తను చేసిన అప్పుల గురించి బాధ్యతాయుతంగా వివరణ ఇవ్వాలి. సర్కార్ ముందు ఇప్పుడున్న ఆర్థిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా చెప్పాలి. ఎందుకంటే.. సీనియర్ కదా! తెలంగాణ జాతిపితకదా. మీకు తెలంగాణ ప్రజలకు మంచి అవకాశం ఇచ్చారు.. ఐదేళ్లు మంచిగా పాలించి మంచిపేరు తెచ్చుకోండని.. ఏదో దీవిస్తున్నట్టుగా, విశాల దృక్పథం ఉన్నవాడిలా గతంలో మాట్లాడాడు కేసీఆర్.
ఒకవేళ బీఆరెస్ సర్కార్ మళ్లీ మూడోసారి అధికారంలోకి వచ్చినా.. ఈ అప్పుల తిప్పలు తప్పేవి కావు. అదేమీ తక్కువ తినలేదు. ఇప్పటికే అమలవుతున్న పథకాల భారం తడిచిమోపెడైంది. వాళ్లూ చెప్పారు ఎలక్షన్ హామీలలో నాలుగు వేల పింఛన్ చేస్తాం దశలవారీగా.. రైతుబంధు పెంచుతాం మెల్ల మెల్లగా.. ఇలా ఏవీ తక్కువ చెప్పలేదు. ఇప్పుడు అధికారం పోగానే.. ఏమాయే అంటున్నారు తప్ప చేసి పోయిన పాపాలు, అప్పుల చిట్టా గురించి గప్‌చుప్‌గా ఉన్నారు. జనాలు తిప్పలు పడుతుంటే చూసి చంకలు గుద్దుకుంటున్నారు. సర్కార్ చేతగాని తనంగా చూపాలనే తాపత్రయంతో దిగజారుడు రాజకీయ ఆరోపణలు చేస్తూ మరింత పలుచనవుతున్నారు.
అధికారం కోసం ఏమైనా చేయాల్సిందేనని కేసీఆర్ డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా అప్పుల గురించి రేపు ఏ విలేకరి అడిగినా దబాయింపే ఉంటుంది. సరైన వివరణ ఉండదు. మరి ఈ సర్కార్‌కు సలహాలు, సూచనలు ఇచ్చే మానసిక స్థితి కేసీఆర్‌కు ఉందనుకోవాలా? సర్కార్ మేలు కోరుతాడని భావించాలా? దీనికి సమాధానం కావాలంటే… తెలంగాణ ఉద్యమకారులను, బీఆరెస్ కార్యకర్తలను, కేసీఆర్ వెంట ఉండి వాడుకుని బయటకు గెంటేయబడ్డ వారిని అడిగితే కరెక్టుగా తెలుస్తుంది.

Dandugula Srinivas
Senior Journalist
7661066999
