(దండుగుల శ్రీనివాస్)
రేవంత్ సర్కార్‌ను ఎంత బద్నామ్ చేద్దామనుకున్న కేటీఆర్‌కు ఏదో ఒక రూపంలో కథ అడ్డం తిరుగుతోంది. ఎంత దుష్ప్రచారం చేసినా.. గద్దొచ్చి పిల్లను తన్నుకుపోయినట్టు.. ఏదో ఒక సంఘటన రేవంత్‌ను ఆకాశినికెత్తుతోంది. జనాలకు మరింత చేరువ చేస్తోంది. బీఆరెస్ సోషల్ మీడియా ద్వారా నిరంతరం రేవంత్‌పై డేగ కన్ను వేసి జనంతో తిట్లు తినిపించేందుకు కేటీఆర్ నానా తంటాలు పడుతున్నా కాలం కలిసిరావడం లేదు. అదృష్టం ముఖం చాటేస్తోంది. దురదృష్టం ఇంకా వెంటాడుతోంది కేటీఆర్‌ను. రేవంత్ టైమ్ బాగుంది. అదింకా కొనసాగుతోంది. సలహాలిచ్చే వారెవరో గానీ పర్వాలేదు. సమయానికి బాగనే వర్కవుట్ అవుతోంది. జనానికి చేరువయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారు.
సరే, ఇదంతా ఎందుకు.. అసలు ముచ్చటకొద్దాం! ఇప్పుడు రేవంత్ ఓ ఆటగాడు. ప్లే గ్రౌండ్ సీరియస్‌గా ఫుట్‌బాల్ ఆటను ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీరియస్‌గా. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విషయం అర్థమైందనుకుంటా. మెస్సీతో ఈనెల 13న మ్యాచ్ ఉంది. దీని కోసమే ఆ సన్నాహాలు. సహజంగానే రేవంత్ క్రీడాకారుడు. తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. దీని ముగింపు సందర్బంగా 13న మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఫిక్స్ చేశారు. దీనికి స్వయంగా రేవంత్ టీమ్ రంగంలోకి దిగడం.. సీరియస్‌గా ప్రాక్టీస్ చేయడమే ఇప్పుడు వైరల్ వార్త. అదే ట్రెండ్ నడుస్తోంది. అంతా శెభాష్ రేవంతు! బాగుందోయ్ నీ క్రీడా స్పూర్తి… అని మెచ్చుకుంటున్నారు పార్టీలకతీతంగా. ఇదిప్పుడు కేటీఆర్ అండ్ టీమ్‌కు మింగుడు పడటం లేదు. అంతా రేవంత్‌ను ఆకాశానికెత్తుతుంటే పాపం కడుపు మంటతో కేటీఆర్ రగిలిపోతున్నాడు.
మొన్న అందెశ్రీ కుటుంబానికి బాసటగా నిలిచి.. అంతిమయాత్రలో పాడెమోసిన రేవంత్‌ను అంతా కొనియాడారు. ఓ సీఎం స్థాయిలో ఇంత వరకు ఓ కళాకారుడు చనిపోతే వచ్చి శవయాత్రలో పాల్గొన్న సందర్బం లేదు. కానీ దీన్ని తిరగరాశాడు రేవంత్. స్వయంగా ఆ కుటుంబానికి పెద్ద కొడుకయ్యాడు. మిత్రుడి అంత్యక్రియలకు అన్నీ తానై వ్యవహరించాడు. పాడె మోసి మరింతగా అందరి మనసులు గెలిచాడు. అప్పుడు అంతా పార్టీలకతీతంగా భేష్ అన్నారు. సీఎం అంటే ఇలా ఉండాలని కొనియాడారు. ఇదీ కేటీఆర్ టీమ్‌కు మింగుడు పడలేదు. అర్బకుడని సీఎంను గేలిచేస్తూ ఎన్ని మాటలు మాట్లాడినా.. దాన్ని కేటీఆర్ అహంకారపు, బలుపు మాటలుగానే పరిగణిస్తున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడం లేదు.
రేవంత్ వ్యవహార శైలి అందరి మనసు గెలిచేలా చేస్తుంటే.. కేటీఆర్ నానాటికీ తిట్ల దండకం స్మరించుకుంటూ పలుచనయిపోతున్నాడు. అంతా రేవంత్‌ను ఆకాశానికెత్తుతుంటే.. అతనిపై కేటీఆర్ ఉమ్మేయడానికి చేసే ప్రయత్నంలాగే తిరిగి తనకే తగులుతోంది.. బూమరాంగవుతూ వస్తోంది. కాస్కో.. నా వాస్కోడిగామా! అని రేవంత్ ప్రతీసారి కేటీఆర్‌కు సవాల్ విసురుతూనే ఉన్నాడు. కేటీఆర్ కయ్యానికి కాలు దువ్వుతూ తనంతట తను బొక్కబోర్లా పడుతూనే ఉన్నాడు.
Dandugula Srinivas
Senior Journalist
7661066999
